సాక్షి, నాగార్జునసాగర్ (నల్లగొండ): సాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కాన్సుల కోసం ఆస్పత్రికి వచ్చేవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. కాసులు సమర్పిస్తేనే కాన్పులు చేస్తున్నారని లేకుంటే.. మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ గర్భిణికి ప్రసవం చేసేందుకు రూ. 5వేలు డిమాండ్ చేసి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో.. డాక్టర్ అరవింద్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ నాగేశ్వర్‌రావుపై డీఎంఈ రమేశ్‌రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించారు.
సిజేరియన్‌కు రూ.5 వేలు!
సాగర్ ఏరియా ఆస్పత్రికి తిరుమలగిరి(సాగర్), పెద్దవూర, పీఏపల్లి, అనుముల మండలాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా.. గిరిజనులు, పేదలు ఉండడం వల్ల వారంతా ఈ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ కోసం వస్తారు. వారిని కొంతమంది డాక్టర్లు కాసులిస్తేనే కాన్పు చేస్తామని, సిజేరియన్ చేయాలంటే ఐదువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. తిరుమలగిరి(సాగర్)మండలం రంగుండ్లకు చెందిన హరిత ఐదురోజుల క్రితం కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చింది. జనరల్ సర్జన్ డాక్టర్ అరవింద్ రూ.ఐదువేలు డిమాండ్ చేసి తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది.
వడ్డీకి తెచ్చి డబ్బులిచ్చాను
డబులిస్తేనే కాన్పు చేస్తామనడంతో వెయ్యికి రూ.20 వడ్డీకి తెచ్చి ఐదువేలు ఇచ్చాం. లేదంటే బీపీ ఉంది వేరేచోటకు పొమ్మన్నారు. ప్రాణమంటే భయం కావడంతో డాక్టర్ల డిమాండ్ మేరకు ఇవ్వాల్సి వచ్చింది.
– హరితకాన్పుల సంఖ్య పెంచాం
ఆస్పత్రి కొత్త భవనం ప్రారంభమయ్యాక ఆరు నెలల వరకు గర్భిణులు రాక మెటర్నిటీ వార్డు మూతపడే ఉంది. తర్వాత ఒకటి రెండు కాన్పులే అయ్యేవి. జీరో నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకు 50 నుంచి 70 వరకు సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. మేం కష్టపడి కాన్పుల సంఖ్యను పెంచాం. గిట్టని వారు ఏదో ప్రచారం చేస్తున్నారు. నేనెవరినీ డబ్బులు అడగలేదు. తీసుకోలేదు.
– డాక్టర్ అరవింద్
Comments
Please login to add a commentAdd a comment