ప్రతీకాత్మక చిత్రం
నాకో సమస్య ఉంది... మీరే తీర్చాలిఅపరిచిత మహిళ నుంచి ఫోన్ కాల్‌గంటల తరబడి మాటల ప్రవాహంకొన్నాళ్లు వరుసగా ఫోన్లలో సంభాషణఆపై భర్తను అంటూ మరో వ్యక్తి ఫోన్‌నా భార్యను ట్రాప్ చేశావంటూ ఆరోపణపంచాయితీకి రావాలని బెదిరింపునష్టపరిహారం పేరుతో డబ్బుల డిమాండ్‌బయటకు చెప్పుకోలేకపోతున్న బాధితులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: నగరంలో నయా మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లను ఆసరాగా చేసుకుని మొదట మాటలు కలుపుతూ.. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతూ అందినకాడికి దోచుకునే ముఠా నగరంలో వరుసగా మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా వేసే ట్రాప్‌లో చిక్కుకున్న పురుషులు.. జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ట్రాప్‌లో నుంచి బయట పడేందుకు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం.
మోసం తీరు ఇలా..
తెలియని నంబరు నుంచి మొబైల్ ఫోన్‌కి కాల్ వస్తుంది. అవతలి వైపు ఓ మహిళ అమాయకంగా, ఆందోళనతో ‘హాలో సార్ నమసే’ అంటూ మాటలు కలుపుతోంది. తను సమస్యల్లో ఉన్నానని చెబుతోంది. ‘ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి బయటపడేందుకు తోచిన పది నంబర్లతో ఫోన్ చేస్తే మీకు కలిసిందది’ అంటూ పరిచయం చేసుకుంటోంది. తన సమస్యను చెప్పుకుంటున్నట్లుగా గంటల తరబడి సంభాషణ కొనసాగిస్తోంది. ఆ తర్వాత పదేపదే ఆమె కాల్ చేస్తూ తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో చెప్పాలంటూ మాటల వల విసురుతోంది. ఈ మాటల తీరుకు ఆకర్షితులై ... ఈ సంభాషణల పరంపర కొన్నాళ్ల పాటు ఫోన్‌లో కొనసాగుతోంది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే .. హఠాత్తుగా ఓ పురుషుడి నుంచి ఫోన్ వస్తోంది. ‘హలో ఎలా ఉన్నారు సార్ అంటూ వ్యంగమైన ప్రశ్నతో సంభాషణ మొదలవుతోంది. మీరెవరు అని అడిగితే...‘ రోజు మీరు గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళను అంటూ కోపంగా మాట్లాడుతాడు. ‘నీ వల్ల నా కుటుంబం నాశనమైంది’ అంటూ శాపనార్థాలు.. ఆ తర్వాత బెదిరింపులు మొదలవుతున్నాయి.
పంచాయితీకి రా..
‘నా భార్యతో రోజు ఫోన్‌లో మాట్లాడుతున్నావ్. నా భార్యను ట్రాప్ చేశావ్ . ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. ఈ విషయం నలుగురిలో మాట్లాడి పంచాయితీ పెడితే తప్ప పరిష్కారం ఉండదు. కాబట్టి ఎప్పుడు పంచాయతీ పెడదాం’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. స్పందించకుంటే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులం అంటూ మరికొందరు రంగంలోకి దిగుతున్నారు. మహిళతో ఫోన్‌లో మాట్లాడిన కాల్‌లిస్ట్, సంభాషణ రికార్డులతో పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానంటూ ఒత్తిడిని తీవ్రం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసా.. లేక పంచాయితీలో మాట్లాడుకుందామా అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బయటకు పొక్కితే పరువు పోతుందనే భయాన్ని అపరిచిత మహిళతో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తికి కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ముఠా సభ్యులే పోలీసు అధికారుల్లా ఫోన్‌లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడిలో ఆ వ్యక్తి ఉండగానే కేసు వద్దు.. పంచాయితీ వద్దు.. నష్టపరిహారం చెల్లించుకుని సమస్యను పరిష్కరించుకో.. అనే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. బాధిత వ్యక్తి హోదా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఓ రేటు దగ్గర పంచాయతీ డీల్ కుదురుతోంది. దీంతో ఎవరికీ చెప్పుకోలేక వారు అడిగినంత ముట్టచెప్పి ఊరుకుంటున్నారు.
కాజీపేట స్టేషన్ పరిధిలో ఐదుగురు..
ఇటీవల కాజీపేటలో ఓ వ్యక్తిని ఇలా బెదిరించారు. విషయం ఇంట్లో తెలిసి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులే కేసు పెట్టారు. దీంతో పంచాయితీ అంటూ బెదిరించిన వ్యక్తులు ముఖం చాటేశారు. ఒక్క కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఐదుగురు వ్యక్తులు మోసపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఖరీదైన ప్లాటు రాసి ఇవ్వగా, మరో ఇద్దరు వరుసగా రూ. 6 లక్షలు, రూ. 3 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన వారి నుంచి సుమారు రూ. 5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.
ఇద్దరు ఫిర్యాదు చేశారు..
అపరిచిత మహిళ ఫోన్ బాధితులు ఇప్పటివరకు ఇద్దరు ఫిర్యాదు చేశారు. పరువుకు భయపడి ఎవరూ కేసు పెట్టడం లేదు. అపరిచిత మహిళలు ఫోన్ చేసి మాట్లాడితే జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రలోభాలకు లోనైతే మోసపోతారు. కొత్త రకం ట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఇలా మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులను ఆశ్రయించండి. – అజయ్, కాజీపేట ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment