చెన్నై : పోలీసులా నటించి దారి దోపిడీకి ప్రయత్నించిన ఎస్‌ఐ కొడుకు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు మధురై బిబిక్ కులం ముల్లై నగర్‌కు చెందిన కాశిమాయన్ లోడ్‌మన్ మంగళవారం పనికి వెళుతుండగా... పోలీసు యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని తనిఖీ చేసి రూ.3,500లను బలవంతంగా లాక్కున్నారు. ఇదమని ప్రశ్నించగా, తల్లాకులం పోలీసు స్టేషన్‌కు వచ్చి సదరు నగదు తీసుకెళ్లమని బాధితుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేయగా అలాంటిది ఏదీ జరగలేదని తెలిసింది. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసుల దుస్తులు ధరించి వాహన తనిఖీ చేస్తూ నగదు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన సదరు నకిలీ పోలీసులు అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకుని విచారణ చేయగా వారిలో ఒకరు ఎస్‌ఐ కుమారుడు కాగా, మరొకరు విదేశాల్లో డాక్టర్ కోర్సు చేస్తున్నాడని తెలిసింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.