ఉల్లి అక్రమార్కులపై.. ‘విజిలెన్స్‌’ కొరడా! | Vigilance Officers Sieging Illegal Onions | Sakshi
Sakshi News home page

ఉల్లి అక్రమార్కులపై.. ‘విజిలెన్స్‌’ కొరడా!

Published Fri, Nov 8 2019 4:27 AM | Last Updated on Fri, Nov 8 2019 4:31 AM

 Vigilance Officers Sieging Illegal Onions - Sakshi

సాక్షి, అమరావతి: ఉల్లి ధరలను అదుపుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని రంగంలోకి దించింది. పలు రాష్ట్రాల్లో వీటి దిగుబడి తగ్గడం.. వరదల కారణంగా మార్కెట్లో ఉల్లిపాయలకు కొద్దిరోజులుగా కొరత ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతికి అనుమతించింది. అయితే, వాటి ధరల్లో పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా రాష్ట్రంలోని వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రజల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న వారిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో దాడులు ప్రారంభించారు. గడిచిన రెండ్రోజులుగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పెద్దఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచడం.. కృత్రిమంగా కొరత సృష్టించి ధర పెంచి విక్రయించడం.. ఎటువంటి అనుమతులు లేకుండా హోల్‌సేల్, రిటైల్‌ షాపులు నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 మంది వ్యాపారులపై ‘విజిలెన్స్‌’ దాడులు నిర్వహించగా 47మంది అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి నుంచి రూ.27,06,200 విలువచేసే 603.50 క్వింటాళ్ల ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు ఉంచిన 37 మందికి జరిమానాలు విధించారు. మిగిలిన 10 మందిపై కేసులు నమోదు చేశారు.

నిబంధనలకు మించి నిల్వలు వద్దు
ఇదిలా ఉంటే.. హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారుల వద్ద నిబంధనలకు మించి ఉల్లిపాయల నిల్వలు ఉంచుకోకూడదని కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు హోల్‌సేల్‌ వ్యాపారులు 50 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్‌ టన్నులు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలన్నారు. మరోవైపు.. కొందరు వ్యాపారులు అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ సెస్‌ ఎగవేశారని ఆయన తెలిపారు.  

ఆదుకున్న కర్నూలు ఉల్లి
కాగా, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు రాకపోవడంతో ఆ కొరతను కర్నూలు ఉల్లిపాయలు కొంతమేర తీర్చాయి. ప్రస్తుతం రైతుబజార్లలో కర్నూలు ఉల్లిపాయలు కిలో రూ.36కు విక్రయిస్తున్నారు. దీన్ని మరింతగా తగ్గించి వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌కు ఇలా..
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం.. వరదల ప్రభావంతో ఉల్లిపాయల రవాణపై ప్రభావం పడింది. దీన్ని గమనించిన వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. అందుబాటులో ఉన్న ఉల్లిపాయలను మహారాష్ట్ర, కార్ణాటక నుంచి తక్కువ ధరకు ముందుగానే సేకరించుకుని తమ గిడ్డంగుల్లో పెద్దఎత్తున నిల్వచేశారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే రోజువారీగా కొంతమేర విక్రయాలు జరుపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. వ్యాపారులు ఒక పథకం ప్రకారమే మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ అక్రమార్జన చేస్తున్నారని విజిలెన్స్‌ పరిశీలనలో వెల్లడైంది.

నిబంధనలు..
►ఉల్లి వ్యాపారులు మార్కెట్‌ కమిటీ లైసెన్సులు తీసుకుని విధిగా పన్ను చెల్లించాలి.
►ఖచ్చితంగా లైసెన్స్‌ పొంది ఉండాలి.
►స్టాక్‌ నిల్వచేయడం.. విక్రయించే ధర అన్నీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఉండాలి.
►ఎంత స్టాకు దిగుమతి చేసుకుంటున్నారు.. ఎంత విక్రయించారో లెక్కలు చూపాలి
►హోల్‌సేల్‌ వ్యాపారులు 50 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్‌ టన్నులకు మంచి ఉంచుకోకూడదు

అక్రమంగా నిల్వచేస్తే క్రిమినల్‌ చర్యలు
ఉల్లిపాయలను అక్రమంగా నిల్వచేసుకుని అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రియమినల్‌ చర్యలు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి కొరతను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హోల్‌సేల్‌ వ్యాపారులు తమ వద్ద 50 మెట్రిక్‌ టన్నులు మించి ఉల్లిపాయలను ఉంచుకోకూడదు. అదే రిటైల్‌ వ్యాపారుల వద్ద 10 మెట్రిక్‌ టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు అక్రమ నిల్వలను సీజ్‌ చేస్తాం.    

– పి. జాషువా,
గుంటూరు జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement