సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతు బజార్లలో ఇప్పటికే కిలో రూ.25కే ఉల్లిని అమ్ముతున్నామని, దీనిని మరో నెల రోజులు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కగా.. రాష్ట్రంలోనూ ఆ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకోవాలని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఉల్లి ధరలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. పెరుగుతున్న ఉల్లి ధరలు, అందుబాటులో ఉన్న నిల్వలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మరో నెలపాటు ఉల్లిని కిలో రూ.25కే రైతుబజార్లలో అమ్మేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రతిరోజూ 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతుబజార్లకు సరఫరా చేయాలన్నారు. బిడ్డింగులో నేరుగా పాల్గొంటూ రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరుకులో సగాన్ని మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తోందని అధికారులు చెప్పగా.. ధరల స్థిరీకరణ నిధిని వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62 నుంచి రూ.75 మధ్య ఉందని, బిడ్డింగులో కనీస ధర రూ.53 నుంచి రూ.62 మధ్య కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. రవాణా ఖర్చులు కలుపుకుంటే రూ.70 నుంచి రూ.72 వరకూ ఖర్చవుతోందని, ఇంత ఎక్కువ రేటున్నా కిలోకు కనీసం రూ.40–45కి పైబడి రాయితీ ఇచ్చి రైతుబజార్లకు సరఫరా చేస్తున్నామని, పేదలకు, సామాన్యులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని వారు చెప్పారు. ధరలు తగ్గేంతవరకూ ఇది కొనసాగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉల్లిని అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
వేరుశనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి..
వేరుశనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, ఇందుకోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందని, కానీ దానికోసం ఎదురుచూడకుండా ఈ నెల 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. అప్పటివరకూ రైతులెవ్వరూ ఎంఎస్‌పీ ధరకన్నా తక్కువకు అమ్ముకోకుండా చూడాలన్నారు. పంట వచ్చిన జిల్లాల్లో వెంటనే కేంద్రాల్ని ప్రారంభించి రైతులను దళారుల దోపిడీ నుంచి కాపాడాలన్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకూ 18 కేంద్రాలు తెరిచామని, 200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు.
ధర స్థిరపడేంతవరకూ రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల మొక్కజొన్న ధర పెరిగిందని అధికారులు చెప్పారు. కాగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లను కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ఆయనీ సందర్భంగా అధికారులను అడిగారు. వచ్చే జనవరి నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment