raithu bazar
-
అన్నీ కిటకిటే!
సాక్షి నెట్వర్క్: దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించనున్న నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతుబజార్లు, స్థానిక మార్కెట్లతోపాటు సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు. కరోనా భయాందోళనలతో వివిధ రాష్ట్రాల సరిహద్దులు మూసేస్తుండటం.. ఈ ప్రభావం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల కొరత ఏర్పడడమే కాక ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో నెల రోజులకు సరిపడా ఇంటి సామాన్లను కొనుగోలు చేసేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో కిటకిటలాడుతున్న విజయవాడలోని రైతుబజార్ - కర్నూలు జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూకు ఒకరోజు ముందే అన్ని నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని దుకాణాలు, సూపర్మార్కెట్లు కిటకిటలాడాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో రైతుబజార్లు కిక్కిరిసిపోయాయి. - శ్రీకాకుళం జిల్లాలో.. సరుకుల కొరత ఏర్పడుతుందన్న ప్రచారం జరగడంతో ప్రజలు కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల ముందు తండోపతండాలుగా జనం కనిపించారు. రైతుబజార్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. నెలకు సరిపడా సరుకులు కొంటున్న వారు కనిపించారు. దీంతో కొన్ని దుకాణాలు ఖాళీ అయిపోయాయి. - నిత్యావసరాల కొనుగోలుదారులతో అనంతపురం మార్కెట్ కూడా కిటకిటలాడింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. - నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ రద్దీగా మారింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరారు. - చిత్తూరు జిల్లాలోని ప్రధాన మార్కెట్లు, షాపింగ్ మాళ్లు కొనుగోలుదారులతో నిండిపోయాయి. మధ్యాహ్నం 2 గంటలకు కూడా జిల్లాలోని అన్ని పట్టణాల్లోని కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ జనంతో కిక్కిరిసిపోయాయి. కొందరు మాంసం ప్రియులు తమకు అవసరమైన వాటిని ఒకరోజు ముందే కొనుగోలు చేసి ఫ్రిజ్‌లలో భద్రపరుచుకున్నారు. - విశాఖ జిల్లాలోని అన్ని రైతుబజార్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నెల 31 వరకూ పలు దుకాణాలు, మాల్స్ మూసెయ్యాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. నిత్యావసరాల్ని నిల్వ చేసుకునేందుకు జనం ఎగబడ్డారు. నగరంలోని అన్ని సూపర్మార్కెట్లు మధ్యాహ్నం 12 కల్లా ఖాళీ అయిపోయాయి. అనేకచోట్ల వైన్ షాపుల వద్ద కూడా మద్యం ప్రియులు బారులుతీరారు. - తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కూడా రైతుబజార్లలో జనం పోటెత్తారు. వారం, పది రోజులకు సరిపడా కాయగూరలు కొనుగోలు చేశారు. నిత్యావసరాల కొనుగోళ్లకు జనం పోటెత్తడంతో అన్ని రకాల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డెట్టాల్, శానిటైజర్లనూ బాగా కొనుగోలుచేశారు. -
ఉల్లి ధరల నియంత్రణలో ఏపీ కృషి భేష్
సాక్షి, అమరావతి: ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. దేశవ్యాప్తంగా ఇటీవల ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్ల ద్వారా కిలో కేవలం రూ.25 చొప్పున అందించేలా చర్యలు చేపట్టడం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే–2019–20లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి భారీ ఎత్తున కొనుగోలు చేసి.. నష్టాలకు వెనుకాడకుండా వినియోగదారులకు సబ్సిడీ ధరకు విక్రయించడం ద్వారా ఉల్లి ధరలను అదుపు చేయడంలో తన వంతు కృషి చేసినట్లు ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలూ ఇదే రీతిలో తక్కువ ధరకే ఉల్లిని సరఫరా చేసినట్లు సర్వే వెల్లడించింది. అకాల వర్షాల వల్ల ఉల్లి పంట భారీగా దెబ్బతినడంతో ఖరీఫ్ దిగుబడి బాగా తగ్గిపోయిందని, దీంతో ఉల్లి ధరలు డిసెంబర్, 2019 నాటికి 455.8 శాతం పెరిగినట్టు పేర్కొంది. దేశంలో ఉల్లి సాగు అధికంగా జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో పంట సాగు ఏడు శాతం మేరకు తగ్గిపోయినట్టు తెలిపింది. ఇదే సమయంలో సెప్టెంబర్–అక్టోబర్ మాసాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల ఉల్లి సాగైన మహారాష్ట్రలో 58 శాతం, కర్ణాటకలో 18 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాతం మేరకు పంట దెబ్బతిన్నట్టు పేర్కొంది. పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, ఎగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు 57,373 టన్నుల ముందస్తు నిల్వలను బయటకు తీసి విక్రయించినట్లు వివరించింది. వీటితోపాటు ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల నుంచి ఎంఎంటీసీ ద్వారా దిగుమతి చేసుకొని నాఫెడ్ ద్వారా విక్రయించినట్లు తెలిపింది. ఇలా సరఫరా చేసిన ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్ సత్వర చర్యలు చేపట్టినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. -
మరో నెల.. కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతు బజార్లలో ఇప్పటికే కిలో రూ.25కే ఉల్లిని అమ్ముతున్నామని, దీనిని మరో నెల రోజులు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కగా.. రాష్ట్రంలోనూ ఆ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకోవాలని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఉల్లి ధరలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. పెరుగుతున్న ఉల్లి ధరలు, అందుబాటులో ఉన్న నిల్వలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మరో నెలపాటు ఉల్లిని కిలో రూ.25కే రైతుబజార్లలో అమ్మేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రతిరోజూ 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతుబజార్లకు సరఫరా చేయాలన్నారు. బిడ్డింగులో నేరుగా పాల్గొంటూ రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరుకులో సగాన్ని మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తోందని అధికారులు చెప్పగా.. ధరల స్థిరీకరణ నిధిని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62 నుంచి రూ.75 మధ్య ఉందని, బిడ్డింగులో కనీస ధర రూ.53 నుంచి రూ.62 మధ్య కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. రవాణా ఖర్చులు కలుపుకుంటే రూ.70 నుంచి రూ.72 వరకూ ఖర్చవుతోందని, ఇంత ఎక్కువ రేటున్నా కిలోకు కనీసం రూ.40–45కి పైబడి రాయితీ ఇచ్చి రైతుబజార్లకు సరఫరా చేస్తున్నామని, పేదలకు, సామాన్యులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని వారు చెప్పారు. ధరలు తగ్గేంతవరకూ ఇది కొనసాగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉల్లిని అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వేరుశనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి.. వేరుశనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, ఇందుకోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందని, కానీ దానికోసం ఎదురుచూడకుండా ఈ నెల 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. అప్పటివరకూ రైతులెవ్వరూ ఎంఎస్పీ ధరకన్నా తక్కువకు అమ్ముకోకుండా చూడాలన్నారు. పంట వచ్చిన జిల్లాల్లో వెంటనే కేంద్రాల్ని ప్రారంభించి రైతులను దళారుల దోపిడీ నుంచి కాపాడాలన్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకూ 18 కేంద్రాలు తెరిచామని, 200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. ధర స్థిరపడేంతవరకూ రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల మొక్కజొన్న ధర పెరిగిందని అధికారులు చెప్పారు. కాగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లను కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ఆయనీ సందర్భంగా అధికారులను అడిగారు. వచ్చే జనవరి నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. -
భిక్షమేయని పాపానికి యాచకుడి రాక్షసత్వం
సాక్షి, ఉయ్యూరు (కృష్ణా): భిక్షమేయని పాపానికి ఓ యాచకుడు అతి కిరాతకంగా వ్యవహరించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ఉయ్యూరు పట్టణంలో సంచలనమైంది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరులోని కూనపరెడ్డినగర్కు చెందిన చిలకా కొండబాబు (50), అతని భార్యతో కలిసి బస్టాండ్ ఆవరణలోని రైతు బజారులో పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తాడు. అదే రైతు బజారు, బస్టాండ్ ప్రాంతంలో పట్టణ శివారు నాగన్నగూడెంకు చెందిన గుంజా అశోక్‌బాబు యాచన చేస్తూ జీవనం సాగిస్తాడు. భోజన సమయంలో మంగళవారం మధ్యాహ్నం భార్యను బండి వద్ద ఉంచి కొండబాబు భోజనం చేసి కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు బస్టాండ్‌లోని ఫ్యాను కిందకు వెళ్లి నేలపై సేద తీరుతున్నాడు. రైతు బజారులో యాచన చేస్తూ అదే క్రమంలో బస్టాండ్‌లోకి వెళ్లి కొండబాబును ఓ ఐదో, పదో ఇవ్వమని అడిగాడు. ఇరువురూ అక్కడే కొంత కాలంగా పరిచయస్థులు కావడంతో నా దగ్గర లేవు, ఎక్కడైనా వెళ్లి తీసుకో.. అని కొండబాబు బదులిచ్చాడు. బస్టాండ్‌లో ప్రయాణికుల వద్దకు వెళ్లినా ఎవ్వరూ ఇవ్వకపోవడంతో తిరిగి మళ్లీ కొండబాబు దగ్గరకే వచ్చి బిచ్చమడిగాడు. దీంతో కొండబాబు ‘ఏవయ్యా, నా దగ్గర లేవన్నానా, అడుక్కోకపోతే పని చేసుకోవచ్చు కదా, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావ్’’ అని అనడంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. దీంతో కోపోద్రిక్తుడైన అశోక్‌బాబు ఒక్కసారిగా కొండబాబు మెడ పట్టుకుని ఉరిమి చేతులతో దాడి చేసి బలంగా బాదడంతో నోటి నుంచి రక్తం కక్కుకుని అక్కడికక్కడే క్షతగాత్రుడు కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గురుప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చోద్యం చూస్తూ.. పట్టపగలు తమ కళ్ల ముందే అకారణంగా ఓ వ్యక్తి మరొకరిపై దాడి చేసి కొట్టి చంపుతుంటే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. బస్టాండ్‌లో జనం ముందే కొట్టి చంపుతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా చోద్యం చూడటంపై పోలీసులు నివ్వెరపోయారు. -
టమాటా ధర పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమాటా రూ.35 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.8కే లభించిన టమాటా ఇప్పుడు రైతుబజార్లోనే రూ.30కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమాటా శుక్రవారం బహిరంగ మార్కెట్లో రూ.32–35ల చొప్పున అమ్మారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చేరడం, ఏపీలోని మదనపల్లి ద్వారా దిగుమతులు తగ్గడం, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అరకొర సరఫరా అవుతుండటంతో ఆ ప్రభావం ధరలపై పడుతోంది. తగ్గిన సరఫరా.. రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలోని వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాల్లో టమాటా సాగు జరుగుతున్నా 15 శాతం అవసరాలనే తీరుస్తున్నాయి. దీంతో దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర మార్కెట్‌కు రోజూ 400 టన్నుల మేర దిగుమతి అవుతోంది. స్థానికంగా 50 టన్నులు వస్తుండగా, మిగతా 350 టన్నుల మేర పొరుగు రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతోంది. ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతోంది. అయితే ప్రస్తుత సీజన్లో అక్కడ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఏపీ అధికారుల లెక్కల ప్రకారం ఒక్క మదనపల్లి మండల పరిధిలోనే గతేడాది 1,970 హెక్టార్లలో ఉన్న సాగు ఈ ఏడాది 502 హెక్టార్లకు పడిపోయింది. నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల పరిధిలోనూ సగానికి విస్తీర్ణం తగ్గింది. దీనికి తోడు చలి తీవ్రత కారణంగా మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో బూడిద తెగులు సోకడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో మదనపల్లిలోనే టమాటాకు మంచి రేటు లభిస్తోంది. అక్కడే కిలో రూ.30 పలుకుతోంది. దీంతో రాష్ట్రానికి దిగుమతి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని కోలార్, చింతమణి ప్రాంతాల నుంచి టమాటా రాష్ట్రానికి వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగు మతి చేసుకుంటుండటంతో.. డిమాండ్ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు బోయిన్పల్లి మార్కెట్‌కే 2,500 క్విం టాళ్ల మేర టమాటా సరఫరా కాగా, శుక్రవారం 1,380 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.5 నుంచి రూ.6 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.30 వరకు పలుకుతోంది. దీన్ని మార్కెట్లో వ్యాపారులు రూ.2 నుంచి రూ.5 వరకు కలిపి రూ.35 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మున్ముందు ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గతేడాది ఇదే రోజున టమాటా కిలో ధర 6 రూపాయలు పలికింది. మిగతా కూరగాయల్లోనూ అంతే చీక్యాప్సికం, వంకాయ, కాకర, బెండ, దొండ ధరల్లోనూ పెరుగుదల ఉంది. వీటి ధర రెండింతల మేర పెరిగింది. క్యాప్సికం ధర ప్రస్తుతం కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ నుంచి దిగుమతులు తగ్గాయి. అనంతపురం నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే వంకాయకు డిమాండ్ పెరగడంతో దీని ధర కిలో రూ.40కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.30 నుంచి రూ.45కి చేరింది. బెండ రూ.40, దొండ రూ.35కి చేరింది. -
రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
సాక్షి, విజయవాడ : స్వరాజ్ మైదానంలోని రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఆరు బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతుబజార్లో ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా షాపులు నిర్వహిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని అధికారులు ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులతో పాటు తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. రైతుబజార్లో అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు.. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై, కూరగాయలను గ్రేడింగ్ చేసి బయట మార్కెట్‌కి పంపుతున్న వారిపై, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు సరిగా పనిచేయని షాప్ యాజమానులపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. -
ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు
ఖమ్మం: బయట వ్యాపారులకు రైతు బజార్ అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను రైతులు అడ్డుకున్నారు. ఖమ్మం ప్రధాన రైతుబజారు వద్ద రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ మంగళవారం తీవ్రస్థాయికి చేరింది. వ్యాపారులు బయటనుంచి కూరగాయలు తెచ్చి రైతు బజార్ ఎదుట విక్రయిస్తుండడంతో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రైతులు రైతుబజార్ ఎదుట బైఠాయించారు. సమస్య పరిష్కరించేందుకు వచ్చిన ఎమ్మెల్యే వ్యాపారులకు రైతు బజార్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజార్లో స్టాళ్ల ఏర్పాటుకు వ్యాపారులను ఎలా అనుమతిస్తారంటూ రైతులు నిలదీశారు. ఆయన వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకోవడంతో అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పోలీసుల సాయంతో బయటపడ్డారు. -
ఈ–మార్కెటింగ్‌తో రైతుకు లబ్ధి
ఆర్మూర్ : రైతులకు లబ్ధి చేకూర్చేందుకే దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ మార్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్మించిన గోదామును ఆయన బుధవారం పరిశీలించారు. మొక్కను నాటిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ మార్కెటింగ్ విధానాన్ని 2014లో ప్రయోగాత్మకంగా వరంగల్, బూరేపల్లి, మలక్పట్, తిరుమలగిరి మార్కెట్ యార్డుల్లో చేపట్టామన్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని క్రమ క్రమంగా దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఈ మార్కెటింగ్ ద్వారా రైతులు పండించిన పంటను దేశ వ్యాప్తంగా అమ్ముకొని లాభపడే అవకాశాలు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి చర్య లు తీసుకుంటున్నామని పార్థసారథి చెప్పారు. ఇప్పటికే 36 రైతుబజార్లు ఉండగా, కొత్తగా మరో 25 ఏర్పాటు చేసేందుకు రూ.44 కోట్లు మంజూ రు చేశామన్నారు. మున్సిపల్ అధికారులు స్థలం కేటాయిస్తే, రైతు బజార్ నిర్మిస్తామని తెలిపారు. నాబార్డు నిధులతో రాష్ట్ర వ్యా ప్తంగా 330 గోదాముల నిర్మాణం, రూ .220 కోట్లతో మార్కె ట్ యార్డుల్లో మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టామని వివరించారు. చెట్లుంటేనే వర్షాలు కురుస్తాయని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర తిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. వ్యవసాయ శాఖకు పది లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 9.20 లక్షల మొక్కలు నాటామన్నారు. మార్కెటింగ్ ఈఈ గోవర్ధన్‌రెడ్డి, ఏడీ రియాజ్, డీఈ గణేష్, హరితహారం స్పెషల్ ఆఫీసర్ సయ్యద్ ఇఫ్తకార్, ఆర్మూర్ మార్కెట్ యార్డు కార్యదర్శి పీర్ నాయక్, జెడ్పీటీసీ సభ్యుడు సాందన్న, కౌన్సిలర్ రమాకాంత్, జాగిర్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. హరితహారంతోనే తెలంగాణ నందనవనం భిక్కనూరు : హరితహారంతోనే తెలంగాణ నందనవనంగా మరుతుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో నిర్మిస్తున్న గిడ్డంగి పనులను పరిశీలించారు. పనులు సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. గిడ్డంగి ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అడవులు అంతరించడం వల్లనే వర్షాలు తగ్గుముఖం ప ట్టాయని, వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్రతీ ఒక్కరు ఏటా పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూ చించారు. రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలను నాటాలన్నారు. భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ అమృతరెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ, లలిత, కాశీనాథ్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ అధికారి ఇఫే్తకార్ నజబ్, ఏడీఎం మహ్మద్ రియాజ్, ఈఈ గోవర్ధన్‌రెడ్డి, డీఈ గణేష్, ఏఈ రవీందర్, భిక్కనూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి నజీరొద్దీన్, సూపర్‌ౖÐð జర్తామస్లపాల్గొన్నారు. -
ఉల్లిని రైతులు నేరుగా బజార్లో అమ్మవచ్చు
హైదరాబాద్: ఇక నుంచి రైతు బజార్లలో రైతులు నేరుగా ఉల్లిగడ్డ అమ్మే సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాలని మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్ రావు ఆ శాఖా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 70 శాతం రాయితీపై ఉల్లిగడ్డల విత్తనాలు సరఫరా చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రైతు బజార్లలో ఒక కిలోకు 11 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముకోవటానికి ప్రత్యేక సదుపాయలు కల్పించాలని చెప్పారు. మంత్రి హరీష్ ఆదేశాలను అనుసరించి పర్యవేక్షణ అధికారి జంట నగరాలలో ఉన్న రైతు బజార్లలో ఎస్టేట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇందుకు సంబందించిన విధివిధానాలను రూపొందించారు. ఇందులో బాగంగా మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ఉల్లిగడ్డ అత్యధికంగా పండించే మండలాలైన మొమిన్ పేట్, మర్ పల్లి, సిద్ధిపేట్, చేవెళ్ల, శంకర్ పల్లి, నవాబ్ పేట్, శివంపేట్ ప్రాంతాలలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించి, రైతు బజార్లలో తాము పండించిన ఉల్లి పంటను అమ్ముకునే విధంగా చూడాలని ఆదేశించారు. -
ఉల్లిపాయల కోసం ఘర్షణ
ఎంవీపీ కాలనీ: ఉల్లి అగ్గి రాజేస్తోంది. కేజీ ఉల్లిపాయల కోసం ఘర్షణకు దిగే పరిస్థితి వచ్చింది. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్లో మంగళవారం వినియోగదారులు ఉల్లిపాయల కోసం రైతు బజార్ ఎస్టేట్ అధికారి జగదీశ్వరరావును కొట్టినంత పని చేశారు. మంగళవారం నుంచి ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను సరఫరా చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో సుమారు వెయ్యి మంది వినియోగదారులు రైతు బజార్‌కు తరలివచ్చారు. అదే సమయంలో 20 బస్తాల ఉల్లిపాయల సరుకు మాత్రమే రైత్ బజార్‌కు వచ్చింది. ఉదయం కౌంటర్ తెరచిన కొద్దిసేపటికే స్టాక్ అయిపోయింది. దీంతో వినియోగదారుల్లో ఉల్లి చిచ్చు రాజుకుంది. తగినంత సరుకు లేకుండా ఏం చేస్తున్నారంటూ కొందరు ఎస్టేట్ అధికారి జగదీశ్వరరావుపై మండిపడ్డారు. కొందరు కొట్టేందుకు ముందుకు రాగా, ఆయన అక్కడ నుంచి జారుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. -
పోలీసు పహారాలో ఉల్లి విక్రయాలు!
⇒ రైతుబజార్ కౌంటర్ల వద్ద పోలీసు భద్రత ⇒ సబ్సిడీ ఉల్లికి పోటెత్తుతున్న ⇒ వినియోగదారులు సిబ్బందిపై దాడులతో ⇒ మార్కెటింగ్ శాఖ జాగ్రత్తలు ⇒సబ్సిడీ ఉల్లికి ఐడీ ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉల్లి కల్లోలం సృష్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటుండటంతో వినియోగదారులు సబ్సిడీ ఉల్లి కోసం రైతుబజార్లకు పోటెత్తుతున్నారు. దీంతో రైతుబజార్లలో ఉల్లి కౌంటర్ల వద్ద రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల పరిస్థితి ఘర్షణ వాతావరణాన్ని తలపిస్తోంది. నిర్ణీత సమయం ముగిశాక రైతుబజార్ సిబ్బంది కౌంటర్ మూసివేస్తుండటంతో.. గంటల తరబడి క్యూలో నిలబడ్డ వినియోగదారులు ఆవేశానికి లోనై దాడులకు దిగుతున్నారు. శనివారం ఎర్రగడ్డ రైతుబజార్లో జనం దాడులకు దిగడంతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదివారం నుంచి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌లోని అన్ని రైతుబజార్లలో ఆదివారం ఉదయం నుంచే సబ్సిడీ కౌంటర్ల వద్ద మోహరించిన పోలీసులు.. విక్రయాలు సాఫీగా సాగేలా భద్రతా చర్యలు చేపట్టారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చే సి సబ్సిడీ ఉల్లిని అందించారు. ఏడు గంటల నుంచే క్యూ లైన్లు నగరంలోని 9 రైతుబజార్లలో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగిస్తున్నారు. అయితే ఉదయం 7కే వినియోగదారులు రైతుబజార్‌కు చేరుకుంటున్నారు. సెలవు రోజైన ఆదివారం రద్దీ పెరగడంతో ఎర్రగ డ్డ, కూకట్పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రాత్రి 8.30 వరకు విక్రయాలు సాగించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రైతుబజార్ల ద్వారా ఆదివారం 70 టన్నుల ఉల్లిని వినియోగదారులకు అందించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని హోల్‌సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి రూ.57(మోడల్ ప్రైస్) కనీస ధర పలకడంతో ఆదివారం నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.60-65 ధర పలికింది. ఇదే సరుకును రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి కేజీ రూ.70-80 వసూలు చేస్తున్నారు. ఐడీ ఉంటేనే.. సబ్సిడీ ఉల్లి గ్రేటర్‌లోని 9 రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్లలో, మేడ్చెల్, మేడిపల్లి రైతుబజార్లలో ఈ నెల 5 నుంచి సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో వినియోగదారుడికి 2 కిలోల చొప్పున కేజీ రూ.20 ప్రకారం అందిస్తున్నారు. సబ్సిడీ ఉల్లి దుర్వినియోగం కాకుండా అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్, గ్యాస్ కనెక్షన్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి ఐడీగా చూపిస్తేనే సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలిపోకుండా మార్కెటింగ్ శాఖ ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులు సీసీ కెమేరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండగా.. విజిలెన్స్ బృందాలు రైతుబజార్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సిబ్బందిపై డేగ కన్ను వేశాయి. కొరత రానివ్వం సబ్సిడీ ఉల్లికి కొరత రానివ్వబోమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉల్లి సరఫరాపై మార్కెటింగ్ మంత్రి తరచూ సమీక్షిస్తూ ఎంత ధర పెరిగినా రాయితీని ప్రభుత్వం భరిస్తుందని, సబ్సిడీ ఉల్లి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సుమారు 100 టన్నుల ఉల్లిని సేకరించి బోయిన్పల్లి మార్కెట్లో నిల్వ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 700 టన్నుల ఉల్లిని సబ్సిడీ ధరపై రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయించామని అధికారులు తెలిపారు. ఎంత ఖర్చయినా రాయితీ ఉల్లిని అందిస్తాం: మంత్రి హరీశ్‌రావు రాయితీ ఉల్లిగడ్డను ప్రజలకు అందించేందుకు ఎంత మొత్తం అయినా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో ఉల్లి కొరత లేకుండా చేస్తామని, దీనికోసం తమ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 లక్షల కిలోల ఉల్లిని రైతు బజార్ల ద్వారా అందించినట్లు, 7.50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినట్లు తెలిపారు. 89 కేంద్రాల ద్వారా ఉల్లి అమ్మకాలు కొనసాగుతున్నాయని, ఉల్లి బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు సైతం అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేయాలని సూచించారు. -
అన్నా...ఈ సొరకాయ రేటెంత?
బోడుప్పల్: ‘అన్నా..ఈ సొరకాయ రేటెంత? దీన్ని మీరే పండించారా...గిట్టుబాటు అవుతోందా...’ అంటూ మంత్రి హరీష్‌రావు రైతుబజార్లో కూరగాయల రైతులను ఆరా తీశారు. బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లిలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుబజార్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుబజార్లో కలియతిరుగుతూ రైతులతో మాట్లాడారు. కూరగాయల ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా నివారిస్తామని, ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హరీష్ వెంట మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులున్నారు. - మేడిపల్లి -
సిద్దిపేటను ముంచెత్తిన జడివాన
మెదక్: సిద్దిపేట పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. జడివానకు వీధులన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం ఆరున్నర నుంచీ రాత్రి 8:30 వరకు కురిసిన వర్షం గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిది. దీంతో పట్టణమంతా అంధకారం నెలకొంది. పట్టణంలోని మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులు టార్పాలిన్లతో ధాన్యాన్ని తడవకుండా తంటాలు పడ్డారు. అదే విధంగా రైతు బజార్లో అమ్మకానికి ఉంచిన కూరగాయలు అకాల వర్షపు నీటిలో కొట్టుకు పోయాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్న డెక్కన్ చైర్ ఎగ్జిబిషన్ వెలివేషన్ తాత్కాలిక కట్టడాలు నేలకొరిగాయి. ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షనగా నిలిచిన బారీ జాయింట్ వీల్ గాలి దుమారానికి పక్కకు ఒరిగి పోయింది. వర్షం కారణంగా ఎగ్జిభిషన్కు సందర్శకులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నియోజక వర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట మండలాల్లోని ఆయా గ్రామాల్లో కొద్దిపాటి వర్షం కురిసిందని సమాచారం. -
13 నుంచి ‘రాయలసీమ పంటలు-వంటలు’
అనంతపురం అగ్రికల్చర్ : రాయలసీమ జిల్లాలలో పండించిన పాతకాలపు పం టలు తెలుసుకోవాలన్నా, అలనాటి పౌష్టికాహారపు వంటలు రుచిచూడాలన్నా ఈ నెల 13, 14, 15 తేదీల్లో రైతుబజార్‌కు రావాలని ఏఎఫ్ ఎకాలజీ డెరైక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి రైతులు, ప్రజలకు సూచించారు. స్థానిక రైతుబజార్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ... 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతుబజార్ ప్రాంగణంలో ‘రాయలసీమ పంటలు-వంటలు’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేరుశనగ లాంటి ఏకపంటతో నష్టపోతున్న జిల్లా రైతులను గట్టెక్కించడం, ఫాస్ట్‌ఫుడ్ లాంటి పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో అనేక రోగాలు కొనితెచ్చుకుంటున్న ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలనే ధ్యేయంతో ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కనుమరుగైన సాంప్రదాయ పంటలకు పునరుజ్జీవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యపు, పప్పుధాన్యపు పంటలు ఎలా ఉంటాయనే దానిపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే వాటితో తయార య్యే పలు రకాలు, శాఖాహారంతో పాటు మాంసాహారం వంటకాలు ప్రదర్శనలో పెడతామని తెలిపారు. అరిక అన్నం, అరిక పెరుగన్నం, కొర్ర చిత్రాన్నం, కొర్ర పలావు, బరిగే పెరుగన్నం, రాగి, జొన్న, చెన్నంగి ముద్దలు, సంకటి, అలసంద, పెసర, ఉలవ చారు, వంకాయ పులుసు, కందిపప్పు, చింతకాయ పులుసు, మున గ కారం, పొయ్యిలో కారం, కొబ్బరి కా రం, నూనే వంకాయ, వేరుశనగ చెట్నీ లు, రాగి, సద్ద రొట్టెలు, బరిగ, రాగి దోసేలు, పితిక బాళ్ల కారం తదితర సాంప్రదాయ శాఖాహార వంటకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే బరిగి దోశ, నాటికోడి కూర, కోడిపులుసు, వేపుడు, తలకాయ కూర, వట్టిచేపల కూర, గుడ్డు దోశెలు లాంటి మాంసాహార వంటకాలు రుచిచూడవచ్చని తెలిపారు. వీటితో చిరుతిల్లు, పచ్చళ్లు ఉంటాయన్నారు. అలాగే మహిళలకు వంటల పోటీలు ఉంటాయన్నారు. ఇంట్లోనే సాంప్రదాయ వంటలు వండుకుని వస్తే వాటి రుచిని బట్టి బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 94904 06339 నంబర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళా స్వయం సంఘాలు, రేకులకుంట, రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు, ఆర్డీటీ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎర్త్ 360 ఎకోవెంచర్ డెరైక్టర్ దినేష్, టింబక్టు ప్రతినిధి బబ్లూగంగూలి, ఏపీఎంఏఎస్ ప్రతినిధి సతీష్, తిరుమల ఆర్గానిక్ ప్రతినిధి నరసింహనాయక్, డీఆర్డీఏ డీపీఎం అన్నపూర్ణమ్మ, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి రెవెన్యూ డివిజన్ కూ రైతుబజారు
* మన ఊరు, మన కూరగాయల పథకానికి అనుసంధానం * మూసీ నదిలో పండించే కూరగాయలకు నో ఎంట్రీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున రైతు బజార్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనకు పంపనున్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణపై ఇప్పటికే కొన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 రైతు బజార్లలో హైదరాబాద్‌లోనే 9 ఉన్నాయి. మిగిలినవి జిల్లా కేంద్రాల్లో నడుస్తున్నాయి. రైతు బజార్లు విజయవంతం కావడం... దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుండటంతో డివిజన్ కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు రైతు బజార్ల అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఒక్కో రైతు బజారు నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 26 రైతు బజార్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థకు చేరిన వాటికి మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని రైతు బజార్లతో అనుసంధానం చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం తక్కువ పురుగు మందులు, తక్కువ ఎరువులు వాడి కూరగాయలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని.. తద్వారా నాణ్యమైన కూరగాయలను వినియోగదారులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. మూసీ నదిలో పండించే వాటికి అనుమతి లేదు హైదరాబాద్ నగరంలోని కొన్ని కూరగాయల దుకాణాలకు, రైతు బజార్లకు మూసీ నదిలో పండించే కూరగాయలు సరఫరా అవుతున్న విషయంపై పరిశీలన జరపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మూసీ నీటితో పండించే కూరగాయలు, ఆకుకూరలు విష పూరితమైనవని, వాటిని తింటే అనారోగ్యం ఖాయమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు బజార్లకు వాటిని రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా రైతు బజార్లలో అలాంటి విక్రేతలెవరైనా ఉంటే నిఘా పెట్టి వారి గుర్తింపు రద్దు చేసి పంపుతామని అంటున్నారు. -
రైతు బజారే.. టీడీపీ నేతల జాగీరుగా మారింది!
-
దిగివస్తున్న ఉల్లి ధర
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : పది, పదిహేనురోజులుగా విపరీతంగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిన ఉల్లి ధర ప్రస్తుతం తిరోగమన బాట పట్టింది. నిన్న, మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ.4700 పైగా ఉండగా సోమవారం ఒకే రోజు రూ.3500కు పడిపోయింది. ఇది కూడా గరిష్ట ధర కావడం గమనార్హం. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా ఉల్లి వచ్చింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ఉల్లికి కొంత డిమాండ్ తగ్గడంతో ఆ ప్రభావం ధరపై పడింది. ఎక్కువ లాట్లకు రూ.3000 నుంచి రూ.3300 వరకే ధర లభించింది. రూ.4 వేలకు పైగా ధర లభిస్తుందనుకొని మార్కెట్ ఉల్లిని తరలించిన రైతులు ధర పడిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. నిజంగా ఉల్లికి డిమాండ్ తగ్గిందా? వ్యాపారుల మాయాజాలమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉల్లికి డిమాండ్ తగ్గిందని, అందువల్లే ధర తగ్గుముఖం పట్టిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రైతు బజార్లో ఉల్లి అమ్మకాలు రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించే నిమిత్తం మార్కెటింగ్ అధికారులు కర్నూలు సీక్యాంప్ రైతు బజార్లో ఉల్లిని తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన రైతు ద్వారా రెండు రకాల సరుకు(కిలో రూ.40, కిలో రూ. 30)ను అమ్మించారు. ఇలా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 క్వింటాళ్లు విక్రయించారు. రైతు బజార్లో ఉల్లి విక్రయాలు కొనసాగిస్తామని, రైతులు ముందుకు రాకపోతే మార్కెట్ యార్డు నుంచి కొనుగోలు చేసి నో లాస్, నో ప్రాఫిట్ ప్రకారం వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ రిటైర్డ్ జేడీ నారపురెడ్డి రైతు బజారులో స్వచ్ఛందంగా రైతులకు సేవలందిస్తున్నారు. సోమవారం ఉల్లి పంపిణీ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ హనుమంతరావు, సెక్యూరిటీ గార్డులు కూడా తమ వంతు సహకారం అందించారు.