అనంతపురం అగ్రికల్చర్ : రాయలసీమ జిల్లాలలో పండించిన పాతకాలపు పం టలు తెలుసుకోవాలన్నా, అలనాటి పౌష్టికాహారపు వంటలు రుచిచూడాలన్నా ఈ నెల 13, 14, 15 తేదీల్లో రైతుబజార్‌కు రావాలని ఏఎఫ్ ఎకాలజీ డెరైక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి రైతులు, ప్రజలకు సూచించారు. స్థానిక రైతుబజార్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ... 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతుబజార్ ప్రాంగణంలో ‘రాయలసీమ పంటలు-వంటలు’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేరుశనగ లాంటి ఏకపంటతో నష్టపోతున్న జిల్లా రైతులను గట్టెక్కించడం, ఫాస్ట్‌ఫుడ్ లాంటి పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో అనేక రోగాలు కొనితెచ్చుకుంటున్న ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలనే ధ్యేయంతో ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కనుమరుగైన సాంప్రదాయ పంటలకు పునరుజ్జీవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యపు, పప్పుధాన్యపు పంటలు ఎలా ఉంటాయనే దానిపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
అలాగే వాటితో తయార య్యే పలు రకాలు, శాఖాహారంతో పాటు మాంసాహారం వంటకాలు ప్రదర్శనలో పెడతామని తెలిపారు. అరిక అన్నం, అరిక పెరుగన్నం, కొర్ర చిత్రాన్నం, కొర్ర పలావు, బరిగే పెరుగన్నం, రాగి, జొన్న, చెన్నంగి ముద్దలు, సంకటి, అలసంద, పెసర, ఉలవ చారు, వంకాయ పులుసు, కందిపప్పు, చింతకాయ పులుసు, మున గ కారం, పొయ్యిలో కారం, కొబ్బరి కా రం, నూనే వంకాయ, వేరుశనగ చెట్నీ లు, రాగి, సద్ద రొట్టెలు, బరిగ, రాగి దోసేలు, పితిక బాళ్ల కారం తదితర సాంప్రదాయ శాఖాహార వంటకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
అలాగే బరిగి దోశ, నాటికోడి కూర, కోడిపులుసు, వేపుడు, తలకాయ కూర, వట్టిచేపల కూర, గుడ్డు దోశెలు లాంటి మాంసాహార వంటకాలు రుచిచూడవచ్చని తెలిపారు. వీటితో చిరుతిల్లు, పచ్చళ్లు ఉంటాయన్నారు. అలాగే మహిళలకు వంటల పోటీలు ఉంటాయన్నారు. ఇంట్లోనే సాంప్రదాయ వంటలు వండుకుని వస్తే వాటి రుచిని బట్టి బహుమతులు అందజేస్తామని తెలిపారు.
పోటీల్లో పాల్గొనేవారు 94904 06339 నంబర్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళా స్వయం సంఘాలు, రేకులకుంట, రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు, ఆర్డీటీ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎర్త్ 360 ఎకోవెంచర్ డెరైక్టర్ దినేష్, టింబక్టు ప్రతినిధి బబ్లూగంగూలి, ఏపీఎంఏఎస్ ప్రతినిధి సతీష్, తిరుమల ఆర్గానిక్ ప్రతినిధి నరసింహనాయక్, డీఆర్‌డీఏ డీపీఎం అన్నపూర్ణమ్మ, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
13 నుంచి ‘రాయలసీమ పంటలు-వంటలు’
Published Wed, Mar 11 2015 4:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement