ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు
ఖమ్మం: బయట వ్యాపారులకు రైతు బజార్ అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను రైతులు అడ్డుకున్నారు. ఖమ్మం ప్రధాన రైతుబజారు వద్ద రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ మంగళవారం తీవ్రస్థాయికి చేరింది. వ్యాపారులు బయటనుంచి కూరగాయలు తెచ్చి రైతు బజార్ ఎదుట విక్రయిస్తుండడంతో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రైతులు రైతుబజార్ ఎదుట బైఠాయించారు.
సమస్య పరిష్కరించేందుకు వచ్చిన ఎమ్మెల్యే వ్యాపారులకు రైతు బజార్‌లో స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజార్‌లో స్టాళ్ల ఏర్పాటుకు వ్యాపారులను ఎలా అనుమతిస్తారంటూ రైతులు నిలదీశారు. ఆయన వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకోవడంతో అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పోలీసుల సాయంతో బయటపడ్డారు.