ఖమ్మంలో మట్టిరోడ్లు కనిపించవ్
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంఅర్బన్: కార్పొరేషన్ పరిధిలోని అన్ని మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని, రానున్న రోజుల్లో ఖమ్మంలో మట్టి రోడ్లు కనిపించవని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం నగరంలోని 14వ డివిజన్లో రూ.15లక్షలతో, 9వ డివిజన్లో రూ.10లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణాలకు మేయర్ పాపాలాల్‌తో కలిసి ఎమ్మెల్యే పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడకుండా అన్ని వేళలా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల నిధులతో పూర్తిస్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని సుందరీకరణకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు, ఇరుకైన రోడ్లను విస్తరించి డబుల్ రోడ్లుగా, ప్రధాన రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, షేక్ జాన్‌బీ, మందడపు మనోహర్‌రావు, గాజుల వసంత, దస్తగిరి వీరయ్య, యాదగిరి, దస్తగిరి, కొత్తా రవి, నాగుల్‌మీరా, కొంగర జ్యోతిర్మయి, కొలకాని రమాదేవి, శ్రీనివాస్, పరమేష్ పాల్గొన్నారు.