కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : పది, పదిహేనురోజులుగా విపరీతంగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిన ఉల్లి ధర ప్రస్తుతం తిరోగమన బాట పట్టింది. నిన్న, మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ.4700 పైగా ఉండగా సోమవారం ఒకే రోజు రూ.3500కు పడిపోయింది. ఇది కూడా గరిష్ట ధర కావడం గమనార్హం. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా ఉల్లి వచ్చింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఉల్లికి కొంత డిమాండ్ తగ్గడంతో ఆ ప్రభావం ధరపై పడింది. ఎక్కువ లాట్‌లకు రూ.3000 నుంచి రూ.3300 వరకే ధర లభించింది. రూ.4 వేలకు పైగా ధర లభిస్తుందనుకొని మార్కెట్ ఉల్లిని తరలించిన రైతులు ధర పడిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. నిజంగా ఉల్లికి డిమాండ్ తగ్గిందా? వ్యాపారుల మాయాజాలమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉల్లికి డిమాండ్ తగ్గిందని, అందువల్లే ధర తగ్గుముఖం పట్టిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
రైతు బజార్‌లో ఉల్లి అమ్మకాలు
రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించే నిమిత్తం మార్కెటింగ్ అధికారులు కర్నూలు సీక్యాంప్ రైతు బజార్‌లో ఉల్లిని తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన రైతు ద్వారా రెండు రకాల సరుకు(కిలో రూ.40, కిలో రూ. 30)ను అమ్మించారు. ఇలా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 క్వింటాళ్లు విక్రయించారు. రైతు బజార్‌లో ఉల్లి విక్రయాలు కొనసాగిస్తామని, రైతులు ముందుకు రాకపోతే మార్కెట్ యార్డు నుంచి కొనుగోలు చేసి నో లాస్, నో ప్రాఫిట్ ప్రకారం వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ రిటైర్డ్ జేడీ నారపురెడ్డి రైతు బజారులో స్వచ్ఛందంగా రైతులకు సేవలందిస్తున్నారు. సోమవారం ఉల్లి పంపిణీ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ హనుమంతరావు, సెక్యూరిటీ గార్డులు కూడా తమ వంతు సహకారం అందించారు.
దిగివస్తున్న ఉల్లి ధర
Published Tue, Aug 20 2013 1:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement