ప్రతి రెవెన్యూ డివిజన్ కూ రైతుబజారు | Each division is composed of Revenue raitu bazar | Sakshi
Sakshi News home page

ప్రతి రెవెన్యూ డివిజన్ కూ రైతుబజారు

Published Wed, Dec 31 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

Each division is composed of Revenue raitu bazar

* మన ఊరు, మన కూరగాయల పథకానికి అనుసంధానం
* మూసీ నదిలో పండించే కూరగాయలకు నో ఎంట్రీ

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున రైతు బజార్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనకు పంపనున్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణపై ఇప్పటికే కొన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 రైతు బజార్లలో హైదరాబాద్‌లోనే 9 ఉన్నాయి. మిగిలినవి జిల్లా కేంద్రాల్లో నడుస్తున్నాయి. రైతు బజార్లు విజయవంతం కావడం... దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుండటంతో డివిజన్ కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు రైతు బజార్ల అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
 
ఒక్కో రైతు బజారు నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 26 రైతు బజార్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థకు చేరిన వాటికి మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని రైతు బజార్లతో అనుసంధానం చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం తక్కువ పురుగు మందులు, తక్కువ ఎరువులు వాడి కూరగాయలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని.. తద్వారా నాణ్యమైన కూరగాయలను వినియోగదారులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
 
 మూసీ నదిలో పండించే వాటికి అనుమతి లేదు
 హైదరాబాద్ నగరంలోని కొన్ని కూరగాయల దుకాణాలకు, రైతు బజార్లకు మూసీ నదిలో పండించే కూరగాయలు సరఫరా అవుతున్న విషయంపై పరిశీలన జరపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మూసీ నీటితో పండించే కూరగాయలు, ఆకుకూరలు విష పూరితమైనవని, వాటిని తింటే అనారోగ్యం ఖాయమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు బజార్లకు వాటిని రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా రైతు బజార్లలో అలాంటి విక్రేతలెవరైనా ఉంటే నిఘా పెట్టి వారి గుర్తింపు రద్దు చేసి పంపుతామని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement