అ‘పూర్వ బంధం’ | Chittoor district western areas again within former Kadapa district | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ బంధం’

Published Wed, Apr 6 2022 5:12 AM | Last Updated on Wed, Apr 6 2022 5:14 AM

Chittoor district western areas again within former Kadapa district - Sakshi

బి.కొత్తకోట:  బ్రిటీష్‌ పాలనలో కడప జిల్లాలో కలిసి ఉన్న చిత్తూరుజిల్లా పశ్చిమ ప్రాంతాలు మళ్లీ పూర్వ కడప జిల్లా పరిధిలోని ప్రాంతాలతో కలిసి కొత్తజిల్లా ఏర్పాటు కావడం విశేషంగా చెప్పుకోవాలి. నిన్నమొన్నటి వరకు ఏదైనా పాత రికార్డులు కావాలంటే చిత్తూరు జిల్లా ప్రజలు కడప కలెక్టరేట్‌పై ఆధారపడేవాళ్లు.  జిల్లాల పునర్విభజనతో చిత్తూరు పశ్చిమ ప్రాంతం ఎక్కడినుంచి విడిపోయిందో మళ్లీ అదే ప్రాంతంలో కలిసింది. చోళ రాజుల పాలన నుంచి మైసూర్‌ మహరాజుల పాలన వరకు తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గ ప్రాంతాలు వారి సామ్రాజ్యాల్లో భూ భాగంగా ఉండేవి. వైడుంబులు, పాలేగాళ్లు, రేనాటిచోళులు, మలిచోళులు, విజయనగర, మైసూర్‌రాజు టిప్పు సుల్తాన్‌ పాలనలో ఉన్న ఈ నియోజకవర్గాలను మైసూర్‌ బెల్ట్‌ ప్రాంతంగా పిలిచేవారు.

1800 అక్టోబర్‌ 12న నిజాం పాలకులతో వెల్లస్లీకి కుదిరిన ఒప్పందం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, ఇప్పటి కర్నాటకలోని బళ్లారి జిల్లాలు బ్రిటీష్‌ పాలన కిందకు వచ్చాయి. అప్పటినుంచి చిత్తూరుజిల్లా కడప జిల్లా పరిధిలో ఉండేది. ఈ ప్రాంతానికి కడప కలెక్టర్‌ పాలకుడు. అప్పటి కడపజిల్లా విస్తీర్ణం అధికం కావడంతో పాలనా సౌలభ్యం కోసం బ్రిటీష్‌ పాలకులు 1850లో మదనపల్లెను రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేశారు. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ చేసిన వారిని ఇక్కడ సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ పాలన సాగించారు. ఈ ప్రాంతంలో జరిగే ఉత్తరప్రత్యుత్తరాలు, రిజిస్ట్రేషన్లు, అధికారిక కార్యకలాపాలన్నీ కడపజిల్లా పేరుతోనే జరిగాయి.  

సరిగ్గా 111 ఏళ్లకు మళ్లీ.. 
బ్రిటీష్‌ పాలనలో కడప జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను కలుపుకొని 1911 ఏప్రిల్‌ ఒకటిన చిత్తూరు జిల్లా ఏర్పడింది. సరిగ్గా 111 ఏళ్ల తర్వాత యాదృచ్ఛికంగా మళ్లీ కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతో కలిసి కొత్తగా ఏర్పడిన అన్నమయ్యజిల్లాలో కలిసింది. కొత్తజిల్లా ఏర్పడటం అటుంచితే పూర్వం ఈ మూడు నియోజకవర్గాలు కడపలో భాగమైనవే. ఒకసారి వీడిపోయిన ఈ ప్రాంతాలు కడప జిల్లా నియోజకవర్గాలతో మళ్లీ కలిశాయి. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలు భిన్నమైనవే. ఆహార, ఆహర్యం, భాష, వ్యవహారికం పరంగా తేడా కనిపిస్తుంది. కడపలో సుబ్బయ్య, వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మ ఇలాంటి పేర్లు అధికంగా వింటాం. ఈ నియోజకవర్గాల పరిధిలో తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామి, శ్రీకాళహస్తీశ్వరుడి పేరు కలిసివచ్చేలా పేర్లుంటాయి.  

1850లోనే మదనపల్లె డివిజన్‌ కేంద్రం  
అత్యధిక విస్తీర్ణం కలిగిన కడప నుంచి జిల్లా పరిపాలన కష్టంగా భావించిన బ్రిటీష్‌ పాలకులు 1850లోనే మదనపల్లెలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే సబ్‌కలెక్టర్‌ కోసం అందమైన కార్యాలయం, బంగళాను నిర్మించారు. ఇక్కడ పనిచేసిన బ్రిటిష్‌ పాలకులందరూ ఐసీఎస్‌ అధికారులు. స్వాతంత్య్రం వచ్చేదాకా ఇక్కడ పనిచేసిన సబ్‌కలెక్టర్లలో అత్యధికులు బ్రిటీషర్లే. ఇప్పటి 31 మండలాలతో డివిజన్‌ ఉండగా బ్రిటిష్‌పాలనలో పరిధి ఇంకా ఎక్కువ. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో తంబళ్లపల్లెలోని ఆరు, మదనపల్లెలోని మూడు, పీలేరులోని రెండు మండలాలతో డివిజన్‌ ఏర్పడింది.  

హార్సిలీహిల్స్‌ కనుగొన్న కలెక్టర్‌  
1865–67 మధ్య మదనపల్లె సబ్‌కలెక్టరుగా పనిచేసిన డబ్ల్యూడీ హార్సిలీ గుర్రంపై పర్యటిస్తూ బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామంలోని ఏనుగుమల్లమ్మ కొండ పరిసరాల్లో సంచరిస్తుండగా మండువేసవిలో చల్లటి వాతావరణ అనుభూతి పొందారు. గుర్రంపైనే కొండపైకి వెళ్లారు. అక్కడ పశుకాపరులతో ఏనుగుమల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవాలని వారిచేత పలికించారు. అప్పటినుంచి హార్సిలీహిల్స్‌గా పేరొచ్చింది. 1871లో కడప కలెక్టరుగా పని చేసిన డబ్ల్యూడీ హార్సిలీ మద్రాసు ప్రభుత్వం నుంచి హార్సిలీహిల్స్‌ను వేసవి విడది కేంద్రంగా అనుమతులు పొందారు.

నియోజకవర్గ పరిధుల మార్పులు 
చిత్తూరు జిల్లా ఏర్పడ్డాక తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు మారుతూ వస్తున్నాయి. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం లేదు. బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. 1957 ఎన్నికల నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంగా మారింది. అప్పటినుంచి పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాలు పూర్తిగా, బి.కొత్తకోట మండలంలోని బయ్యప్పగారిపల్లె, శీలంవారిపల్లె, బండారువారిపల్లె, కోటావూరు, తుమ్మనంగుట్ట, గోళ్లపల్లె పంచాయతీలు తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో ఉండేవి. బి.కొత్తకోట, గుమ్మసముద్రం, గట్టు, బీరంగి, బడికాయలపల్లె పంచాయతీలు, కురబలకోట మండలం మదనపల్లె నియోజకవర్గంలో ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కురబలకోట, బి.కొత్తకోటలో అన్ని పంచాయతీలను మదనపల్లె నుంచి వేరుచేసి తంబళ్లపల్లె నియోజకవర్గంలో కలిపారు.

మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె మున్సిపాలిటీ, రూరల్, నిమ్మనపల్లె మండలాలుండగా తొలగించిన బి.కొత్తకోట, కురబకోట మండలాల స్థానంలో పుంగనూరు నియోజకవర్గంలోని రామసముద్రం మండలాన్ని మదనపల్లెలో కలిపారు. 2009 వరకు వాయల్పాడు నియోజకవర్గం ఉండగా పునర్విభజనలో వాయల్పాడు, గుర్రంకొండ, కలికిరి, కలడక మండలాలను పీలేరు నియోజకవర్గంలో కలపగా  వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగైంది. పీలేరులోని కొన్ని మండలాలను చంద్రగిరి నియోజకవర్గంలో కలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement