దెబ్బ మీద దెబ్బ! | heavy rians hits nellore, kadapa, chittoor districts | Sakshi
Sakshi News home page

దెబ్బ మీద దెబ్బ!

Published Wed, Dec 2 2015 10:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

చిత్తూరు జిల్లా నాగులాపురం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న అత్తమడుగు వాగు - Sakshi

చిత్తూరు జిల్లా నాగులాపురం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న అత్తమడుగు వాగు

సాక్షి, నెట్‌వర్క్: వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పక్షం రోజుల క్రితం నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసి, నానా బీభత్సం సృష్టించిన వాన మళ్లీ ముంచడానికి వస్తోంది. సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయన్న తరుణంలో మరోసారి కురుస్తున్న జల్లులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈసారి కూడా నెల్లూరు, కడప జిల్లాలపైనే వర్షం ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

నెల్లూరు జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పంటపొలాలు మళ్లీ నీటమునుగుతున్నాయి. ఊళ్లను నీళ్లు చుట్టుముడుతున్నాయి.

గూడూరు డివిజన్ పరిధిలో పోటెత్తిన వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారు. చలిగాలులకు ఎనిమిది మంది మృతిచెందారు. చెరువులన్నీ ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే కట్టిన రింగ్‌బండ్‌లు పలుచోట్ల కొట్టుకుపోయాయి. సూళ్లూరుపేట పరిధిలో స్వర్ణముఖి, కాళంగినది, మామిడి, కరిపేటికాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతుండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
 
రైల్వేకోడూరులోనూ అదే పరిస్థితి..
వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ మంగళవారం భారీ వర్షం కురిసింది. గుంజన నది, మేకలగుంటేరు, తిరుపతేరు, ముష్టేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిట్వేలు రోడ్డులో ఉన్న వంతెన, రెడ్డివారిపల్లి వంతెనలు ఇప్పటికే దెబ్బతినగా.. ఇపుడు మళ్లీ వరద నీరు పోటెత్తడంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మరో రెండ్రోజులు ఇలాగే వర్షం కొనసాగితే పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
 
చిత్తూరులోనూ వాన కష్టాలు..
చిత్తూరు జిల్లాలోనూ మళ్లీ వానకష్టాలు మొదలయ్యాయి. పుత్తూరు మండలం శ్రీరంగంచెరువు, నగరి మండలం బీమానగర్ చెరువు మొరవలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 150 ఇళ్లు జలమయయ్యాయి. చంద్రగిరి మండలం పేరూరు చెరువు ఉధృతంగా మొరవ పారడంతో లోతట్టు ప్రాంతాల్లోని 250 ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సత్యవేడు, బంగారుపాళెం, కార్వేటినగరం,  గంగాధరనెల్లూరు మండలాల్లో ఏడు  చెరువులకు గండ్లు పడ్డాయి.

పెనుమూరు మండలంలో 100 ఎకరాల పూలతోట నీట మునిగింది. ఎన్టీఆర్ జలాశయంలో ఆరు గేట్లు ఎత్తివేసి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఆరణియార్ రిజర్వాయరులో నాలుగు గేట్లు, కృష్ణాపురం జలాశయంలో మూడుగేట్లు, బహుదా ప్రాజెక్టు నందు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement