సాయం శూన్యం... బతుకు దైన్యం | Andhra Pradesh Govt not to Help Flood Victims | Sakshi
Sakshi News home page

సాయం శూన్యం... బతుకు దైన్యం

Published Wed, Nov 25 2015 9:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

సాయం శూన్యం... బతుకు దైన్యం - Sakshi

సాయం శూన్యం... బతుకు దైన్యం

ప్రకృతి సృష్టించే విలయాన్ని ఆపడం ఎవరి చేతిలో లేని పని. కానీ ఆ విపత్తులబారిన పడి, సర్వం కోల్పోయినవారిని ఆదుకోవడం అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల కనీస బాధ్యత. దాదాపు పక్షం రోజులపాటు రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కుండపోత వానలు, వరదలు అతలాకుతలం చేశాయి. లక్షలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీటమునిగింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నోరకాలుగా అపారనష్టం సంభవించింది.

ఇప్పటికీ నెల్లూరు, చిత్తూరు, కడప, గోదావరి జిల్లాల్లో వందలాది కుటుంబాలు తమ ఇళ్లల్లోకి చేరుకోని పరిస్థితి. తినడానికి తిండిలేదు.., కట్టుకోవడానికి బట్టలేదు.., తలదాచుకోవడానికి గుడిసె కూడా లేదు. సాయమో రామచంద్రా అంటూ బాధితులు చేస్తున్న ఆర్తనాదాలు ప్రభుత్వ పెద్దల చెవికి ఎక్కడంలేదు. ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే. అడుగడుగునా వైఫల్యమే. సాయం చేయడంలోనూ స్వార్థమే కనిపిస్తోంది.
 
సాక్షి, నెట్‌వర్క్:  వైఎస్‌ఆర్ జిల్లా, రైల్వేకోడూరు పట్టణం, ధర్మాపురం లో పోలిశెట్టి నాగయ్య, సుబ్బమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బుట్టలు అల్లుకుని జీవనం కొనసాగిస్తున్న వీరి ఇంట్లోకి వరద నీరు చేరింది. వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయి. వరద ఉధృతికి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు సైతం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఈ కుటుం బానికి కనీసం బియ్యం కూడా ఇవ్వలేదు. వారికి డీకేటీ ఇంటి పట్టాతోపాటు, రేషన్‌కార్డు కూడా ఉంది. యేటి పోరంబోకులో నివాసం ఉన్నారనే కారణంతో అధికారులు సహాయం అందించడానికి వెనుకాడుతున్నారు.

ఇలా పలు గ్రామాల్లో వరద కోరల్లో చిక్కుకున్న వేలాది మందిదీ ఇదే పరిస్థితి. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారిని మాత్రమే వరద బాధితులుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. వరద ఉధృతికి ఇళ్లు ధ్వంసమైనా, వరద నీటిలో వస్తువులన్నీ కొట్టుకుపోయినా.. వారిని బాధితులుగా జమ కట్టడం లేదు. జీవనోపాధి కోసం నివాసం ఏర్పరుచుకొని వరదలో చిక్కుకున్న వారి పట్ల సైతం అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవంటూ సహాయం అందించడం లేదు.

గ్రామాల వైపు కన్నెత్తి చూడని యంత్రాంగం
రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలు వరద ఉధృతికి అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికీ పలు గ్రామాల్లో ప్రజలు వరద నీటిలోనే మగ్గుతున్నారు. ఇప్పటికీ బాధితులను కనీసం పలుకరించిన పాపానపోలేదు. వీఆర్‌ఓలు మాత్రమే చుట్టపు చూపుగా చూసి వెళ్లారు. తక్షణ వరద సహాయం అందించడంలోనూ విఫలమయ్యారు. పంపిణీ చేశామని చెప్పుకునేందుకు బాధితుల్లో కొందరికి మాత్రమే బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. కమలాపురం, మైదుకూరు, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రైతులకు అపార నష్టం కలిగింది. ఫలసాయం అటుంచితే పెట్టుబడులు సైతం దక్కడం లేదు. రైతుల పంట నష్టం అంచనాలు రూపొం దించడంలోనూ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

 చిత్తూరు జిల్లాలో అన్నదాత చిత్తు..
*   జిల్లా వ్యాప్తంగా 60,000 ఎకరాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
*  5000 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి.
రాకపోకల పునరుద్దరణ కొనసా..గుతూనే ఉంది. దీంతో పనులు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు.
*  కనీస సాయం కింది అరకొర బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు మళ్లీ కన్నెత్తి చూడలేదు.
*   ఒక్క శ్రీకాళహస్తి నియోజక వర్గంలోనే 20,000 ఎకరాలకుపైగా వరి, కూరగాయలు నీట మునిగాయి.
*  సత్యవేడు 15000 ఎకరాల్లో పంట పూర్తిగా  దెబ్బతిన్నది. 70  చెరువులు తెగిపోయాయి.
*  తెలుగుగంగ కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి.
*   సోమశిల-స్వర్ణముఖి కాలువ తెగిపోయింది. స్వర్ణముఖి నది  పొంగటంతో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి.
* జిల్లాలో 200లకు పైగా చెరువులకు గండ్లు పడి నీరు వృధాగా పోతున్న ఇంత వరకు గండ్లలను పూడ్చలేదు.
*   కాళంగి రిజర్వాయర్ గేట్లు విరిగిపోయాయి. మేడికుర్తి ప్రాజెక్టు తెగినా మరమ్మత్తులను ఇంకా చేపట్ట లేదు.
*  300 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నా.. ఇకా పునరుద్దరించలేదు.

 కోలుకోని గోదావరి జిల్లాలు..
* వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలో 1.50 లక్షల ఎకరాల పంటపై ప్రభావం పడింది. సుమారు 25 వేల ఎకరాల్లో పంట పనలు నీటమునగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టిన పెట్టుబడిసైతం తిరిగివచ్చే పరిస్థితి లేదు.
 
* నీట మునిగిన పనలు తరలించడం రైతులకు కష్టంగా మారింది. ఎకరాకు 12 మంది కూలీలు కోతలకు, నూర్పుడులకు పట్టేవారు. ఇప్పుడు 25 మంది పడుతున్నారు. ఇది రైతులకు అదనపు భారంగా మారింది.

* వర్షాల వల్ల ఆగిన మాసూళ్లు ఒకేసారి మొదలు కావడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది. తూర్పుడెల్టాలో మగవారికి రూ.300 ఉండే కూలీ ఇప్పుడు రూ.500ల నుంచి రూ.700 వరకు, రూ.200 ఉన్న ఆడకూలీలకు ఇప్పుడు రూ.400 వరకు ఇస్తున్నారు.

* పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ధాన్యం రంగుమారింది. దీనితోపాటు తేమ ఎక్కువుగా వస్తోంది. 17 శాతం కన్నా తక్కువ ఉన్న ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద కొంటుంది. అయితే నీట మునిగిన ధాన్యం 30 శాతం తేమ ఉంది.

* పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నగరం, తాడేపల్లిగూడెం, భీమవరం, కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో దోమల ఉధృతి అధికంగా ఉంది. వాటి నివారణకు నగరపాలక సంస్థ, మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 
ప్రతిపక్షనేతతో ఏకరువు
ఆపదలో ఉన్న ప్రజలను అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 15 రోజులుగా వర్షాలతో ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే వారి పట్ల కనీస మానవత్వం ప్రదర్శించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి  సోమవారం వరద బాధితులు ఏకరువు పెట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎవర్ని పలకరించినా ఒకటే ఆవేదన. ‘సహాయ చర్యలు అందలేదు.. అధికారులు కన్నెత్తి చూడలేదు.. ఉపాధి లేకపోయినా, తినేందుకు తిండికి కూడా ప్రభుత్వం సహాయ పడలేదు. రేషన్ బియ్యం సైతం ఇవ్వలేద’ని బాధితులు వాపోయారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
 
చేతికందిన పంట వర్షార్పణం
ఎనిమిది ఎకరాల్లో జిలకర మసూరి (వరి) సాగు చేశా. ఇందుకోసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ నెల 5వ తేదిన వరి కోత కోశాను. 8వతేది నుంచి 13వ తేది వరకు వరుసగా రోజూ వర్షం కురిసింది. ఎలాగోలా కాపాడుకున్నాను. ఆ తర్వాత నూర్పిడి చేద్దామనుకునేలోగా 15వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మోసులు వచ్చాయి.దిగుబడి మొత్తం వర్షార్పణమైంది. పెట్టుబడి కూడ చేతికి దక్కని పరిస్థితి నెలకొంది.
 - యాపరాల మాహబూబ్ హుస్సేన్, రైతు, ఖాదర్‌పల్లె (వైఎస్సార్)
 
రెండు వారాలుగా పని లేదు.. ఎలా బతకాలి?
వరదలకు రోడ్డు కోసుకుపోయి రెండు వారాలుగా మాకు పని కరువైంది. వేరే ఊళ్లకు పోవడానికి వీలు లేకుండా రాకపోకలు నిలిచిపోయాయి. మా ఊరికి వచ్చి మా గురించి పట్టించుకున్న అధికారే లేడు. ఇల్లు గడవడం లేదు. ప్రభుత్వం ఆదుకోలేదు. మా లాంటి పేదోళ్లు ఎలా బతకాలి?
 - పి.సుబ్బమ్మ, నారాయణరాజుపోడు అరుంధతివాడ, రైల్వే కోడూరు
 
రేషన్‌కార్డు లేదని బియ్యం ఇవ్వలేదు
వర్షాలకు ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో వారం రోజులుగా పాఠశాలలో తలదాచుకున్నాం. మీకు రేషన్‌కార్డు లేదు బియ్యం ఇవ్వమని అధికారులు చెప్పారు. ఆధార్‌కార్డు (944664790939) ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. వరద బాధితులకు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సహాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అవన్నీ ఉత్త మాటలేనని అర్థం అవుతోంది. అందుకు మేమే నిదర్శనం.
 - దాసా నాగమణి, చిట్వేలి బ్రిడ్జి, రైల్వేకోడూరు, వైఎస్సార్ జిల్లా
 
ఈ వయస్సులో ఇన్ని అగచాట్లా
ఎడతెరిపిలేని వర్షాలకు ఇళ్లల్లోకి నీరు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. దాతలు పెట్టిన భోజనంతో నెట్టుకొచ్చాం. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పప్పు, నూనె కూడా ఇవ్వలేదు. ముసలిదానినన్న కనికరం కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడూరు పర్యటనకు వచ్చినప్పుడు వంతెనలు చూసి వెళ్లారు. వరద బాధితులతో మాట్లాడి ఉంటే మా సమస్యలు తెలిసేవి. అప్పుడైనా మమ్ములను ఆదుకునేవారు. నాకు రేషన్‌కార్డు కూడా ఉంది.
 - ఓందూరు సుబ్బమ్మ, గాండ్లవీధి, కోడూరు, వైఎస్సార్ జిల్లా
 
 అందింది అన్నం ప్యాకెట్లే..
పదిరోజులుగా గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి. గ్రామం నీట మునిగే ఉంది. అన్నం ప్యాకెట్లు తప్ప ఇంత వరకు ఎటువంటి సాయం అందలేదు. నీటిలోనే పదిరోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాం.
 - టి.నాగరాజు, చిన్న కనపర్తి, చిత్తూరు జిల్లా
 
హామీ ఇచ్చారు.. అడిగినా పట్టించుకోవడం లేదు
పంట కాలువ తెగ్గొట్టకుండా.. ఊరు మునుగుతుందని జేసీబీ తెచ్చి నా కయ్యి దగ్గర తెగ్గొట్టారు. తెగగొట్టొదని అడ్డు పడితే నిన్ను ఆదుకొంటాం అని కొంత మంది అధికార పార్టీ పెద్దలు చెప్పారు. ఏదో చేస్తాం అన్నారు. ఇప్పుడేమో ఎవ్వరిని అడిగినా సమాధానం లేదు. నా కయ్యి పది అడుగుల లోతు కోసుకొని పోయి చెరువు అయింది
- డొల్లు గుర్రయ్య, పెద్ద కనపర్తి, చిత్తూరు జిల్లా
 
ఏడు రూపాయల వడ్డీకి అప్పు చేశా
12 రోజుల పాటు కురిసిన వర్షాలకి పనులు లేక అవస్థలు పడుతున్నాం. వర్షాల వల్లపని ఇచ్చేవారు లేరు. కుటుంబ ఖర్చులకు చేతిలో డబ్బులు లేక ఏడు రూపాయలకు అప్పు చేశా. వర్షం కుదుటపడితే పనికి వెళ్లి అప్పు తీర్చాలి.
 - స్వీటు, వసంతాపురం..చిత్తూరు జిల్లా
 
ధరలు భగ్గుమంటున్నాయి
నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌కు వెళితే ఏం కొనలేక పోతున్నాం. కుటుంబం గడవాలంటే నెలకు రూ.5 వేల వరకు కావాలి. ధరలను అదుపులోకి తీసుకురాకుంటే సామాన్య ప్రజల బతుకు ప్రశ్నార్థకమే.
 - భారతి, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement