కోవూరు చక్కెర కర్మాగారం
* అస్మదీయులకు సహకార చక్కెర పరిశ్రమలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఎత్తులు
* పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కమిటీ నియామకం
* ఐదు పరిశ్రమలను అమ్మేయడమే నయమని నివేదిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అస్మదీయులకు సహకార చక్కెర పరిశ్రమలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అస్మదీయులతో కమిటీ వేసింది. ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకు చోడవరం, ఏటికొప్పాక మినహా తక్కిన ఐదు... చిత్తూరు, ఎస్వీ(చిత్తూరు జిల్లా) కోవూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) కడప (వైఎస్సార్ జిల్లా) భీమసింగి (విజయనగరం జిల్లా) పరిశ్రమలను అమ్మేయడమే నయమంటూ రెండు రోజుల క్రితం కమిటీ నివేదించింది. ఆ నివేదికను అడ్డం పెట్టుకుని.. ఐదు చక్కెర పరిశ్రమలను అస్మదీయులకు అత్తెసరు ధరలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
చంద్రబాబు రాక, పరిశ్రమల బేరం
1999 నుంచి 2002 మధ్య కాలంలో చ్రందబాబు ప్రభుత్వం 14 సహకార చక్కెర పరిశ్రమలు విక్రయించింది. ప్రస్తుతం ఉన్న ఏడు పరిశ్రమలను కూడా అప్పట్లో అమ్మేందుకు విఫల యత్నం చేశారు. అప్పుడు విక్రయించ ని సహకార చక్కెర పరిశ్రమలను ఐదు నెలల క్రితం తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు అస్మదీయులకు కట్టబెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి సెప్టెంబరులో నిపుణుల కమిటీ వేసింది. హుద్‌హుద్ తుపాను తాకిడికి ముందు ఏటికొప్పాక, చోడవరం పరిశ్రమలు లాభాల్లో ఉండేవి. తుపాను తాకిడితో ఆ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. కేంద్రం ప్రకటించే సహాయంతో ఆ పరిశ్రమలను పునరుద్ధరించవచ్చునని కమిటీ అభిప్రాయపడింది. తక్కిన ఐదు పరిశ్రమలను అమ్మేయడమే నయమని తేల్చిచెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అత్తెసరు ధరలకే..
చిత్తూరు జిల్లాలో చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ రూ.100 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు కమిటీ తేల్చింది. ఆ పరిశ్రమకు చిత్తూరు నగరానికి సమీపంలోనే 86 ఎకరాల భూమి ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ఆ పరిశ్రమ ఆస్తుల విలువ రూ.350 కోట్లకుపైగా పలుకుతుందని అంచనా వేసిన కమిటీ ఆ పరిశ్రమను అమ్మేసి.. అప్పులను తీర్చి, తక్కిన డబ్బుతో మరో చోట కొత్త కర్మాగారాన్ని నిర్మించవచ్చునని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ.. ఆ పరిశ్రమ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.600 కోట్లకుపైగా పలుకుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టీకరిస్తున్నారు.
ఇక, ఎస్వీ షుగర్స్ ఆస్తుల విలువ రూ.850 కోట్లకుపైగా ఉంటాయని మార్కెట్ ధరలు స్పష్టీకరిస్తున్నాయి. ఈ పరిశ్రమ రూ.50 కోట్ల అప్పుల్లో ఉంది. ఈ పరిశ్రమను విస్తరిస్తే.. ఆ అప్పులను తీర్చడం కష్టమేమీ కాదు.. కానీ.. ఈ పరిశ్రమతోపాటు కోవూరు, కడపలోని రెండు పరిశ్రమలను అమ్మేయాలని ప్రతిపాదించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ఉన్న భీమసింగి పరిశ్రమనూ అమ్మేయడమే నయమని సూచిం చింది. మార్కెట్ విలువతో నిమిత్తం లేకుండా కనిష్ఠ ధరలను కమిటీ నిర్ణయించింది. ఇదే విలువను ప్రభుత్వం కూడా నిర్ణయించి.. పరిశ్రమలను వేలం వేయడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం.