పోలీసు పహారాలో ఉల్లి విక్రయాలు!
⇒ రైతుబజార్ కౌంటర్ల వద్ద పోలీసు భద్రత
⇒ సబ్సిడీ ఉల్లికి పోటెత్తుతున్న
⇒ వినియోగదారులు సిబ్బందిపై దాడులతో
⇒ మార్కెటింగ్ శాఖ జాగ్రత్తలు
⇒సబ్సిడీ ఉల్లికి ఐడీ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉల్లి కల్లోలం సృష్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటుండటంతో వినియోగదారులు సబ్సిడీ ఉల్లి కోసం రైతుబజార్లకు పోటెత్తుతున్నారు. దీంతో రైతుబజార్లలో ఉల్లి కౌంటర్ల వద్ద రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల పరిస్థితి ఘర్షణ వాతావరణాన్ని తలపిస్తోంది. నిర్ణీత సమయం ముగిశాక రైతుబజార్ సిబ్బంది కౌంటర్ మూసివేస్తుండటంతో.. గంటల తరబడి క్యూలో నిలబడ్డ వినియోగదారులు ఆవేశానికి లోనై దాడులకు దిగుతున్నారు. శనివారం ఎర్రగడ్డ రైతుబజార్‌లో జనం దాడులకు దిగడంతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదివారం నుంచి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌లోని అన్ని రైతుబజార్లలో ఆదివారం ఉదయం నుంచే సబ్సిడీ కౌంటర్ల వద్ద మోహరించిన పోలీసులు.. విక్రయాలు సాఫీగా సాగేలా భద్రతా చర్యలు చేపట్టారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చే సి సబ్సిడీ ఉల్లిని అందించారు.
ఏడు గంటల నుంచే క్యూ లైన్లు
నగరంలోని 9 రైతుబజార్లలో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగిస్తున్నారు. అయితే ఉదయం 7కే వినియోగదారులు రైతుబజార్‌కు చేరుకుంటున్నారు. సెలవు రోజైన ఆదివారం రద్దీ పెరగడంతో ఎర్రగ డ్డ, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రాత్రి 8.30 వరకు విక్రయాలు సాగించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రైతుబజార్ల ద్వారా ఆదివారం 70 టన్నుల ఉల్లిని వినియోగదారులకు అందించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని హోల్‌సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి రూ.57(మోడల్ ప్రైస్) కనీస ధర పలకడంతో ఆదివారం నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.60-65 ధర పలికింది. ఇదే సరుకును రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి కేజీ రూ.70-80 వసూలు చేస్తున్నారు.
ఐడీ ఉంటేనే.. సబ్సిడీ ఉల్లి
గ్రేటర్‌లోని 9 రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్‌లెట్లలో, మేడ్చెల్, మేడిపల్లి రైతుబజార్లలో ఈ నెల 5 నుంచి సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో వినియోగదారుడికి 2 కిలోల చొప్పున కేజీ రూ.20 ప్రకారం అందిస్తున్నారు. సబ్సిడీ ఉల్లి దుర్వినియోగం కాకుండా అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్, గ్యాస్ కనెక్షన్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి ఐడీగా చూపిస్తేనే సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలిపోకుండా మార్కెటింగ్ శాఖ ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులు సీసీ కెమేరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండగా.. విజిలెన్స్ బృందాలు రైతుబజార్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సిబ్బందిపై డేగ కన్ను వేశాయి.
కొరత రానివ్వం
సబ్సిడీ ఉల్లికి కొరత రానివ్వబోమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉల్లి సరఫరాపై మార్కెటింగ్ మంత్రి తరచూ సమీక్షిస్తూ ఎంత ధర పెరిగినా రాయితీని ప్రభుత్వం భరిస్తుందని, సబ్సిడీ ఉల్లి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సుమారు 100 టన్నుల ఉల్లిని సేకరించి బోయిన్‌పల్లి మార్కెట్లో నిల్వ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 700 టన్నుల ఉల్లిని సబ్సిడీ ధరపై రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయించామని అధికారులు తెలిపారు.
ఎంత ఖర్చయినా రాయితీ ఉల్లిని అందిస్తాం: మంత్రి హరీశ్‌రావు
రాయితీ ఉల్లిగడ్డను ప్రజలకు అందించేందుకు ఎంత మొత్తం అయినా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కెట్‌లో ఉల్లి కొరత లేకుండా చేస్తామని, దీనికోసం తమ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 లక్షల కిలోల ఉల్లిని రైతు బజార్ల ద్వారా అందించినట్లు, 7.50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినట్లు తెలిపారు. 89 కేంద్రాల ద్వారా ఉల్లి అమ్మకాలు కొనసాగుతున్నాయని, ఉల్లి బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు సైతం అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేయాలని సూచించారు.