కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న ప్రజా పంపిణీ స్టాక్ పాయింట్(కర్నూలు ఎమ్మెల్యేస్ పాయింట్)ను విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కర్నూలు, న్యూస్‌లైన్: కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న ప్రజా పంపిణీ స్టాక్ పాయింట్(కర్నూలు ఎమ్మెల్యేస్ పాయింట్)ను విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యావసర సరుకుల రవాణాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులుండటంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డీఎస్పీ పీఎన్.బాబు, డి.శివశంకర్, తహశీల్దారు రామకృష్ణారావు, ఇన్‌స్పెక్టర్లు పవన్‌కిశోర్, శ్రీనివాసులు, ఏఈఈ హరినాథబాబుతో కూడిన బృందం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గోదాములో తనిఖీలు చేపట్టారు. నగరంతో పాటు ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించిన చౌక డిపోలకు ఈ గోదాము నుంచే సరుకులు సరఫరా చేస్తారు.
ఈ సందర్భంగా గోదాములో నిల్వ ఉన్న సరుకును పరిశీలించి రికార్డులో పొందు పరిచిన వివరాలతో సరిపోల్చారు. బియ్యం, చక్కెర, గోధుమ పిండి, పామాయిల్ తదితర సరుకులకు సంబంధించిన వివరాలను రికార్డుల వారీగా పరిశీలించారు. ఏడాది క్రితం 2500 క్వింటాళ్ల బియ్యాన్ని(5 వేల ప్యాకెట్లు) సీజ్ చేసి గోదాములో భద్ర పరిచారు. ఇవి మగ్గిపోయి ఉండటంతో సంబంధించిన కేసును పరిష్కరించి బియ్యాన్ని చౌక డిపోలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకునే విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు