కొంగోడు(కరప), న్యూస్‌లైన్ : పేదలకు చేరాల్సిన బియ్యానికి రెక్కలు వచ్చాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి, బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులకు విజిలెన్‌స అధికారులు చెక్ చెప్పారు. కరప మండలం కొంగోడులోని ఒక రైస్‌మిల్లులో బియ్యం అక్రమ నిల్వలు ఉన్నట్టు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడులు చేశారు. రూ.35,50,600 విలువైన బియ్యం, నూకలు, ధాన్యం సీజ్ చేశారు.
జీవీఎస్‌ఎన్ రాజుకు చెందిన సీతారామ మోడరన్ రైస్ మిల్లులో తనిఖీలు చేయగా రికార్డుల్లో లెక్కలకు, ఉన్న సరుకుకు తేడా ఉన్నట్టు గుర్తించారు. 396 క్వింటాళ్ల బియ్యం, 118 క్వింటాళ్ల నూకలు, 1934 క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో తేడా ఉన్నట్టు గుర్తించి, ఆ సరుకును సీజ్ చేశారు. ఈ బియ్యం ప్రజాపంపిణీకి చెందినదిగా భావిస్తున్నారు. మిల్లు యజమానిపై నిత్యావసర వస్తువుల చట్ట ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాకినాడ విజిలెన్స్ డీఎస్పీ వి.రామచంద్రరావు, సీఐ గౌస్ బేగ్, ఏఓ జి.శ్రీనివాస్, కరప ఎంఎస్‌ఓ సాయి సత్యనారాయణ, విజిలెన్స్ సిబ్బంది మూర్తి, గిరి, కొంగోడు వీఆర్వో కె.సుబ్బారావులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.
అక్రమార్కులకు చెక్
Published Wed, Dec 11 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement