యాజమాన్యాలు నిబంధనల అతిక్రమణలపై దృష్టి మైనింగ్ లీజు అనుమతులు.. వినియోగంపై ఆరా కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులు పరిశీలన ఉత్పత్తికి తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు ఉన్నాయా? ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తున్నారా! కోరిన సమాచారం ఇవ్వాలని ఆదేశాలు డీజీపీ ఆదేశాల మేరకు కదిలిన యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ఐదు సిమెంటు పరిశ్రమల్లో మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులకు తగ్గట్టుగానే పనిచేస్తున్నాయా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. విజిలెన్సు శాఖ డీజీపీ ఆర్‌పి ఠాకూర్ జిల్లా పర్యటన ముగిసిన వెంటనే ఆ శాఖ యంత్రాంగం సిమెంటు కార్మాగారాలపై దృష్టి సారించింది. తొలివిడతగా స్వయంగా పరిశీలన చేపట్టిన యంత్రాంగం అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు సమాచారం.
విజిలెన్సు ఏఎస్‌పీ లక్ష్మినాయక్ నేతృత్వంలో మంగళవారం డీఎస్పీ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్లు పుల్లయ్య, ఓబులేసు, తహశీల్దార్ శరత్‌చంద్రారెడ్డి, వ్యవసాయాధికారి శశిధర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు నరసింహారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి , ఏసీటీఓ సత్యంలు జిల్లాలోని దాల్మియా, భారతి, జువారి, ఐసీఎల్ ( రెండు ) సిమెంటు కర్మాగారాల్లో తనిఖీలు చేశారు. పరిశ్రమలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉత్పత్తులు మొదలుకుని ఉద్యోగుల జీతాల వరకూ రికార్డులు కావాలని కోరినట్లు సమాచారం.
ఇప్పటి వరకూ ఉన్న స్టాకు, మైనింగ్ లీజులు అందులో వెలికి తీసిన ముడిఖనిజం, ప్రస్తుతం నిల్వ ఉన్న ముడి ఖనిజం వివరాలను కోరినట్లు తెలుస్తోంది. అలాగే సిమెంటు పరిశ్రమకు మంజూరు చేసిన అనుమతుల వివరాలు, లెసైన్సు మేరకు ఉత్పత్తులు చేస్తున్నారా? మైనింగ్ జోన్ పరిధిలోనే మైనింగ్ చేస్తున్నారా...కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు పరిశ్రమలు పచ్చదనాన్ని పాటిస్తున్నాయా? ఉత్పత్తులకు తగ్గట్టుగా, విక్రయాలకు అనుగుణంగా ట్యాక్స్ చెట్టింపులున్నాయా? కార్మిక చట్టం మేరకు ఉద్యోగులకు జీతాలు, భద్రతలున్నాయా అనే అంశాలపై సమగ్రంగా సమాచారం కోరినట్లు తెలుస్తోంది.
విజి‘లెన్స్’
Published Wed, Dec 18 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement