శ్రీవారి ప్రసాదాల ఇన్స్పెక్టర్ ఎర్రంరెడ్డిని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల: శ్రీవారి ప్రసాదాలు అక్రమంగా తరలిస్తున్న ఆలయంలో ప్రసాదాల విభాగానికి పర్యవేక్షకుడిగా ఉండే యర్రంరెడ్డిని టీటీడీ విజెలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈయన బెంగళూరుకు చెందిన ఓ కార్పొరేట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో వెయ్యి చిన్న లడ్డూలు, 50 కల్యాణోత్సవం లడ్డూలు, మరో 50 వడలు ఇచ్చేందుకు ఒప్పందం కుదురుకున్నాడు.
ఆ మేరకు గురువారం 270 చిన్న లడ్డూలు, 15 కల్యాణోత్సవం లడ్డూలు, 16 వడలను బెంగళూరుకు తరలిస్తుండగా వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఆవరణలో విజిలెన్స్ విభాగం దాడులు చేసి, అతన్ని పట్టుకున్నారు. లడ్డూలు, వడలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై టీ టీడీ ఈవో సాంబశివరావు తీవ్రంగా పరిగణిస్తూ.. వాస్తవాలు వెలికి తీయాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.