పశ్చిమ కృష్ణా, న్యూస్‌లైన్ : కొత్తూరు రిజర్వుఫారెస్ట్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. బుధవారం హైదరాబాద్ రేంజ్ ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ శ్రీనివాసరెడ్డి బృందం అంబాపురం ప్రాంతంలో పర్యటించింది. అటవీభూముల్లో కట్టిన ఇళ్లను, బేస్‌మెంట్, పిల్లర్లస్థాయిలో ఉన్న కట్టడాలను ఆ బృందం పరిశీలించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి గృహాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. విచారణాధికారుల్ని పక్కదారి పట్టించేందుకు అక్రమార్కులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వినికిడి. ఇటీవల నిర్మించిన ఇళ్లను సైతం పాతఖాతాలో జమ చేసేందుకు స్థానిక అధికారులు ప్రయత్నించగా.. వాటికి విద్యుత్ కనెక్షన్లు ఎప్పుడు తీసుకున్నారో ఆశాఖ నుంచి నివేదిక తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సూచించడంతో అక్రమార్కులు కంగుతిన్నారు.
చర్యలేవీ?
2010లోనే అంబాపురం ప్రాంతంలో 42 ఇళ్లు కట్టినట్లు గుర్తించారు. అప్పట్లో ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశారు. వీటిపై కోర్టులో కేసులు నడిచాయి. ఇటీవలే కోర్టు తీర్పు అటవీశాఖకు అనుకూలంగా వచ్చింది. అయినా అక్రమ కట్టడాలను తొలగించకపోవడంపై స్థానిక అధికారులను విజిలెన్స్ బృందం తప్పుబట్టినట్లు సమాచారం. గతేడాది ఆగస్ట్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. అవి ప్రస్తుతం కోర్టులో ఉన్నాయి. కేసులు నమోదు చేసిన సమయంలో ఆక్రమణదారుల నుంచి నిర్మాణాలను నిలిపివేస్తామని లిఖితపూర్వకంగా లేఖలు తీసుకున్నారు. అయినా ఆ నిర్మాణాలు యథాతథంగా కొనసాగిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అటవీ హద్దుల గుర్తింపులో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమ నిర్మాణాలు, అనధికార క్వారీలపై విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో అనేక వాస్తవాలు వెలుగుచూడటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు.
పీసీసీఎఫ్‌కు నివేదిక ఇస్తాం
కొత్తూరు రిజర్వుఫారెస్ట్ అక్రమాలపై విచారణ పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (పీసీసీఎఫ్)కు త్వరలోనే నివేదిక అందజేస్తాం. గతేడాది సస్పెండ్ అయి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వ్యవహారాన్ని పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళతాం. బాధ్యులపై పీసీసీఎఫ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
- శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ
అటవీ అక్రమాలపై విచారణ పూర్తి
Published Thu, Oct 3 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement