సాక్షి, అమరావతి: కలుపును తట్టుకునే హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాల గుట్టు రట్టయింది. నిషేధించిన ఈ పత్తి విత్తనాలను రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మందితో కూడిన ఓ ముఠా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
వెల్దుర్తి కేంద్రంగా..
► హెచ్‌టీ కాటన్ విత్తనాలకు రాష్ట్రంలో అనుమతి లేదు. అయినా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వరుసగా మూడో ఏడాది కూడా ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ ఇటీవల కర్నూలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని గిడ్డంగుల్లో తనిఖీలు చేపట్టింది.
► ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోనే రూ.2 కోట్ల విలువైన హెచ్‌టీ విత్తనాలు దొరికాయి.
► అక్కడ లభించిన సమాచారం ఆధారంగా కర్నూలులోని ఓ శీతల గిడ్డంగిపై, పత్తికొండ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా.. పెద్దఎత్తున హెచ్‌టీ విత్తనాల నిల్వలు దొరికాయి.
► కర్నూలు జిల్లాలోని చాలా గిడ్డంగుల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్టు గుర్తించారు. విత్తన వ్యాపారులకు వ్యవసాయ అధికారి, పర్యవేక్షణాధికారి అయిన ఏడీఆర్ కుమ్మక్కై ఎవరిపైనా కేసులు పెట్టలేదని తేలింది.
ఏమిటీ.. హెచ్‌టీ కాటన్!
► కలుపు మొక్కలను నివారించే మందుల్ని పిచికారీ చేసినా తట్టుకోగలిగిన అంతర్గత శక్తి హెచ్‌టీ పత్తి మొక్కలకు ఉండటం ప్రత్యేకత.
► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జన్యు మార్పిడి చేసి రూపొందించిన ఈ విత్తనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.
► ఈ విత్తనాన్ని నేరుగా అమ్మినా.. మరేదైనా రకంతో కలిపి అమ్మినా నేరమే.
► గుంటూరు జిల్లాలోని కొందరు విత్తన వ్యాపారులు, కర్నూలు జిల్లాలోని కొందరు రైతులు ఈ ముఠాకు సహకరిస్తున్నారని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు.
క్రిమినల్ కేసులు తప్పవు
నకిలీ, అనుమతి లేని విత్తనాలు విక్రయించే వారిపైన, సహకరించే వారిపైనా పీడీ చట్టం కింద క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చాం. తప్పు చేస్తే వ్యవసాయ శాఖలోని ఉద్యోగులు, అధికారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment