రాష్ట్రపతి పాలనకు సిఫారసు!
కేంద్రానికి గవర్నర్ నివేదిక
దానికే మొగ్గుతున్న కాంగ్రెస్
కొత్త సీఎం అంటే రిస్కేనన్న భావన
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోంది. రాజకీయ అనిశ్చితి నెలకొన్న దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సిఫార్సు చేశారు.
ఈ మేరకు పూర్తి వివరాలతో గురువారం ఆయన కేంద్రానికి నివేదిక పంపారని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరిపానని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపలేదని నివేదికలో ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదనే రీతిలో నివేదిక సమర్పించినట్టు సమాచారం. విభజన నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులో ఉంచాలన్నా రాష్ట్రపతి పాలనే శరణ్యమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. కేంద్రం అందుకే మొగ్గుతున్నట్టు చెబుతున్నారు.
విభజన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం, అతి త్వరలో రెండు రాష్ట్రాలు ఏర్పాటు కానుండటం, లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనవసరమనే నిర్ణయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్టు తెలుస్తోంది. పైగా రాష్ర్టంలో కాంగ్రెస్ పూర్తి సంక్షోభంలో పడినందున కొత్త సీఎంను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించడం కూడా తలకు మించిన భారమన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. రిస్కు తీసుకుని సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసి కొత్త సీఎంను ఎంపిక చేసినా ఎన్నికల వేళ గ్రూపు తగాదాలు తీవ్రమయ్యే ప్రమాదముందని అధిష్టానం అంచనాకు వచ్చింది. అందుకే జూన్ 1 దాకా అధికారంలో కొనసాగే అవకాశమున్నా, ఎన్నికల దాకా రాష్ట్రపతి పాలనే మేలనే నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ముగియగానే సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కావాలని భావిస్తోంది. అనంతరం రాష్ట్రపతి పాలనపై నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
పరిశీలనలో అన్ని అంశాలు: థరూర్
కేంద్ర హోం శాఖకు గవర్నర్ నివేదిక పంపారని కేంద్ర మంత్రి శశిథరూర్ గురువారం ఏఐసీసీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి పాలన విధిస్తారా, తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు వేర్వేరు సీఎంలను నియమిస్తారా అని ప్రశ్నించగా, అదింకా పరిశీలనలో ఉందని బదులిచ్చారు. దానిపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటవుతుందన్నారు. రాష్ట్రపతి పాలనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్రల్లో ఏయే పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని ప్రశ్నించగా, అదంతా ఏకే ఆంటోనీ కమిటీ చూసుకుంటుందన్నారు.
పీసీసీ చీఫ్‌ల ఆధ్వర్యంలోనే ఎన్నికల్లోకి!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించి, గెజిట్ వెలువరించగానే తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటికీ ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)లను ఏర్పాటు చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. వాటికి కొత్త అధ్యక్షులను నియమించి, వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షులుగా ఉండేవారే పార్టీ గెలిస్తే సీఎం రేసులో ముందుండటం పరిపాటి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లకు కొత్త అధ్యక్షులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రపతి పాలన వస్తే...
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే రాజకీయ వ్యవస్థ శూన్యంగా మారుతుంది. ప్రజాప్రతినిధులంతా సామాన్య పౌరులుగానే మిగలాల్సి వస్తుంది. పాలన వ్యవహారాలను గవర్నరే నిర్వహిస్తారు. కేంద్రం సలహాలు, సూచనల మేరకు పాలిస్తారు. ఇందుకోసం రాజ్‌భవన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పాలన వ్యవహారాలపై గవర్నర్‌కు సలహాలు, సూచనలిచ్చేందుకు ఇద్దరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న ఐఏఎస్ అధికారులు నియమితులవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సహా అధికార యంత్రాంగమంతా గవర్నర్ కింద పని చేయాల్సి ఉంటుంది.