కిరణ్‌ను నమ్ముకుంటే మునిగిపోతాం
సమావేశానికి హాజరుకాని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
పార్టీని వీడేందుకు నిర్ణయం
భవిష్యత్ రాజకీయాలపై సన్నిహితులతో సమాలోచనలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంట నడిస్తే చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మునిగిపోతామనే ఆందోళనలో ఉన్నారు. ‘ఇప్పటికే రాజకీయ భవిష్యత్‌పై పడుతున్న ఆందోళన చాలు, కిరణ్‌ను నమ్ముకుని ఇప్పటికే చాలావరకు మునిగిపోయాం. కొత్త పార్టీ పేరుతో జనం మధ్యకు వెళదామంటున్న కిరణ్ నిజం చెబుతున్నాడో... అబద్ధం చెబుతున్నాడో నమ్మలేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆడిస్తున్న మనిషి ఆయన. రాష్ట్ర విభజన జరిగే వరకు సీఎంగా ఉండాలని సోనియాగాంధీ కోరితే ఉన్నానని చెప్పారు.
ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? లాస్ట్ బాల్ వరకు ఎదురు చూద్దాం. విభజనను ఆపుదాం అంటూ అబద్ధాలు చెప్పిన సీఎంతో ఎలా పయనించగలం’ అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకే ఆయనకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో కిరణ్‌కుమార్ రెడ్డితో కలిపి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు సోమవారం ఆయన నివాసంలో జరిగిన సమావేశానికి వెళ్లలేదు. వీరందరికీ ఆహ్వానం అందింది. కొందరికి స్వయంగా ఫోన్‌చేసి సమావేశానికి రావాల్సిందిగా
కిరణ్ కోరారు. మరి కొందరికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌లు వచ్చాయి. అయినా ఎవ్వరూ వెళ్లలేదు.
కిరణ్‌పై నమ్మకాల్లేవు
ప్రజలకు కిరణ్‌కుమార్‌రెడ్డిపై నమ్మకాలు లేవు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మనిషని స్పష్టమైంది. కాంగ్రెస్ అధిష్టానం ఆడించే నాటకంలో కొత్తపార్టీ కూడా భాగం కావచ్చని చర్చ మొదలైంది. ఇటువంటి దశలో ఆయనకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇప్పటికే తామంతా రాజీనామాలు చేశాం. ఇక పార్టీలో ఉండే అవకాశం లేదు. రాజకీయ భవిష్యత్ గురించిన ఆలోచనలే తమను బాధిస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కొత్తపార్టీ పెట్టినా ఆయన వెంట జిల్లాలో ఏ ఒక్క లీడర్ కూడా నడిచే అవకాశం లేదని ఎమ్మెల్యేలు చెప్పారు. మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్యేలు డాక్టర్ రవి, గుమ్మడి కుతూహలమ్మ, షాజహాన్ బాషా కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించారు. వీరు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేలు రవి, కుతూహలమ్మ, షాజహాన్‌లు వైఎస్‌ఆర్ సీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్టీలో నాయకులుగా ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని, ఎమ్మెల్యేలుగా టికెట్లు ఆశించి రావాలనుకుంటే కుదరదని వైఎస్‌ఆర్ సీపీ నేతలు చెప్పారని వీరు కార్యకర్తలతో చెప్పుకున్నారు. మొదటే తాము తప్పు చేశాం. వైఎస్‌ఆర్ చరిష్మాతో గెలిచి ఆయన మరణానంతరం జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉండకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోవడంతో తమకు భవిష్యత్ లేకుండా పోయిందనే ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతోంది.
టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని జనం తిరస్కరిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు కారణమైంది. తెలుగుజాతి కలిసి ఉండాలనే అవకాశం లేకుండా చేసిన వారిలో టీడీపీ నాయకులు ముందు భాగాన ఉన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన కోసం కేంద్రానికి లేఖ ఇచ్చి ఉండకుంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావు. రెండు కళ్ల సిద్ధాంతంతో అడుగులు వేస్తున్న చంద్రబాబును చిత్తూరు జిల్లా ప్రజలు నమ్మడం లేదు.
ఏ దిక్కూ లేనమ్మకు ఎవరో ఒకరు దిక్కనే సామెతగా టీడీపీవైపు కాంగ్రెస్ వారు చూస్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తే వారిని జనంతో పాటు పార్టీలోని నాయకులు కలసి ఓడిస్తారని టీడీపీలోని వారే చెబుతున్నారు. చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లాలో రానున్న ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని టీడీపీలోని వారే కొందరు చెప్పటం విశేషం. బాబుతో కలిపి టీడీపీలో నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి రాజకీయ భవిష్యత్‌పై భయం పట్టుకుంది.