Additional judge
-
హైకోర్టు జడ్జిపై లోక్‌పాల్ విచారణా?
న్యూఢిల్లీ: ఒక హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిపై లోక్‌పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ధోరణి ఏమాత్రం ఆమోదనీయం కాదని పేర్కొంది. ఈ మేరకు లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒక హైకోర్టు జడ్జిపై నమోదైన రెండు ఫిర్యాదులను విచారిస్తూ లోక్‌పాల్ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రకు భంగం కల్గించేలా లోక్‌పాల్ వ్యవహరిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు జడ్జి ఉదంతంలో స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌తోపాటు హైకోర్టు జడ్జిపై ఫిర్యాదుచేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. హైకోర్టు జడ్జి ఎప్పుడూ కూడా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం,2013 పరిధిలోకి రారని మెహతా వాదించారు. ఈ కేసులో హైకోర్టు జడ్జి పేరు బహిర్గతం కాకుండా చూడాలని, ఆ ఫిర్యాదుదారు పేరు, అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను రహస్యంగా ఉంచాలని లోక్‌పాల్ రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ఈ అంశంలో కోర్టుకు సాయపడతా. హైకోర్టు జడ్జీల విషయంలో ఇలాంటివి పునరావృతంకాకుండా ఒక చట్టం ఉంటే మంచిది’’ అని ఈ అంశంలో కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. లోక్‌పాల్‌లో ఫిర్యాదుచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక కేసును నమోదుచేసింది. ఈ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఈ హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిని ఈ ప్రైవేట్ సంస్థ కోరింది. ఈ జడ్జి గతంలో లాయర్‌గా ఉన్న కాలంలో ఇదే సంస్థకు చెందిన కేసును వాదించారు. ఇప్పుడు ఆయన జడ్జీ అయ్యాక ఈ కేసులో హైకోర్టులో మరో జడ్జి, అదనపు జిల్లా జడ్జీలను ఈయన ప్రభావితం చేశారని ఫిర్యాదుదారు లోక్‌పాల్‌లో కేసు వేశారు. దీంతో లోక్‌పాల్ జనవరి 27వ తేదీన హైకోర్టు జడ్జిపై ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013లోని సెక్షన్ 20(4) ప్రకారం హైకోర్టు జడ్జిపై విచారణ చేపట్టే హక్కు తమకు ఉందని జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సారథ్యంలోని లోక్‌పాల్ బెంచ్ పేర్కొనడంతో సుప్రీంకోర్టు చివరకు ఇలా కలగజేసుకుంది. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్‌కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె బదిలీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఆ మేర కేంద్ర న్యాయశాఖ గురు వారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16లోపు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. జస్టిస్ శ్రీదేవి తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయ్యారు. ఏపీలోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో ఆమె జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. వివి« ద హోదాల్లో పనిచేశారు. ఘాజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇటీవల ఆమె తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని అలహాబాద్ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆ మేర కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఈ సిఫారసును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. బదిలీకి ఆయన ఆమోదం తెలిపారు. -
న్యాయముర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు
-
హైకోర్టు జడ్జి డ్యాన్స్ చేయమన్నారు: మహిళా జడ్జి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలైంది. మహిళా జడ్జిని హైకోర్టు జడ్జి లైంగికంగా వేధించారని ఆ పిల్లో ఆరోపించారు. హైకోర్టు జడ్జిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలని పిటిషనర్ తన పిల్లో కోరారు. గ్వాలియర్‌లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ తనను హైకోర్టులోని ఓ జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్‌కు డాన్సు చేయమన్నారని కూడా ఆమె ఆరోపించారు. ఆ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారని ఆమె తెలిపారు. ఈ విషయాలు చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అనుమతి ఇవ్వలేదని ఆమె తెలిపారు. దాంతో ఇక తాను ఏమీ చేయలేని పరిస్థితిలో, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మహిళా న్యాయమూర్తి ఆరోణలను ఆయన ఖండించారు.