సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె బదిలీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఆ మేర కేంద్ర న్యాయశాఖ గురు వారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16లోపు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. జస్టిస్ శ్రీదేవి తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయ్యారు. ఏపీలోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో ఆమె జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. వివి« ద హోదాల్లో పనిచేశారు. ఘాజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇటీవల ఆమె తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని అలహాబాద్ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆ మేర కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఈ సిఫారసును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. బదిలీకి ఆయన ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment