హైకోర్టు జడ్జి డ్యాన్స్ చేయమన్నారు: మహిళా జడ్జి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలైంది. మహిళా జడ్జిని హైకోర్టు జడ్జి లైంగికంగా వేధించారని ఆ పిల్లో ఆరోపించారు. హైకోర్టు జడ్జిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలని పిటిషనర్ తన పిల్‌లో కోరారు.
గ్వాలియర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ తనను హైకోర్టులోని ఓ జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్కు డాన్సు చేయమన్నారని కూడా ఆమె ఆరోపించారు. ఆ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారని ఆమె తెలిపారు. ఈ విషయాలు చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అనుమతి ఇవ్వలేదని ఆమె తెలిపారు. దాంతో ఇక తాను ఏమీ చేయలేని పరిస్థితిలో, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఇదిలాఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మహిళా న్యాయమూర్తి ఆరోణలను ఆయన ఖండించారు.