ఆదాకు ఆలివ్ చిట్కా..
ఆదా, పొదుపు ఇవి సగటు జీవికే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకూ చాలా కీలకమే. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోగలమా అని కంపెనీలు నిరంతరం అన్వేషిస్తుంటాయి. పైసానే కదా అని చూసీ చూడనట్లుగా వదిలేయకుండా జాగ్రత్త పడి కోట్లు మిగుల్చుకుంటూ ఉంటాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఇదే చేసింది. ఆ కంపెనీ తమ ప్రయాణికులకిచ్చే సలాడ్‌లో ఆలివ్‌తో పాటు అయిదు వెరైటీలు ఉండేవి.
ఇందుకోసం ప్రతి సలాడ్‌కి ఎనభై సెంట్లు ఖర్చయ్యేది. అయితే, చాలా మంది ఈ ఆలివ్‌ను తినకుండా వదిలేస్తుండటాన్ని గమనించి ప్రయోగాత్మకంగా సలాడ్‌లో నుంచి ఆలివ్‌ను తగ్గించారు. దీంతో సలాడ్ వ్యయం 33 శాతం మేర తగ్గి అరవై సెంట్లకి దిగొచ్చింది. ఈ రకంగా ఒకే ఒక్క ఆలివ్‌ను తగ్గించడం ద్వారా కంపెనీ ఏడాదికి 5,00,000 డాలర్లు (దాదాపు రూ. 3 కోట్లు) మిగుల్చుకుంది.
అనవసర వ్యయాలు తగ్గించుకోవడానికి మిగతా వారు కూడా దీన్ని అమల్లో పెట్టొచ్చు. ఉదాహరణకు దుస్తులు మొదలు ఇంటి కొనుగోలు దాకా చాలా అంశాల్లో ఈ ఫార్ములా ప్రయత్నించవచ్చు. బాగుంది కదాని అవసరం లేకపోయినా అదనపు బెడ్‌రూం ఇల్లు తీసుకోకుండా ఉంటే ఆ మేరకు మిగుల్చుకున్నట్లే. అలాగని నిత్యావసరాలకు కూడా అన్వయించుకోకుండా వీలైన చోట్ల మాత్రమే ఇలాంటి ఆలివ్‌లను పక్కన పెడితే బోలెడంత ఆదా అయినట్లే.