ఫ్రిజ్‌.. ఏసీ.. మైక్రోవేవ్‌.. దీర్ఘాయుష్మాన్‌భవ! | consumer durable makers in intense warranty war: white goods companies | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌.. ఏసీ.. మైక్రోవేవ్‌.. దీర్ఘాయుష్మాన్‌భవ!

Published Wed, Aug 21 2024 4:12 AM | Last Updated on Wed, Aug 21 2024 8:02 AM

consumer durable makers in intense warranty war: white goods companies

వైట్‌ గూడ్స్‌ కంపెనీల వారంటీ వార్‌! 

ఏసీ, ఫ్రిజ్‌ కంప్రెషర్లపై 12 ఏళ్ల వరకు వారంటీ 

వాషింగ్‌ మెషీన్, డిష్‌వాషర్‌ మోటార్లపై 20 ఏళ్ల వరకు

ఈ ఆఫర్లతో సేల్స్‌ పెరుగుతున్నాయంటున్న రిటైలర్లు

ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, డిష్‌ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్‌ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్‌ నడుస్తోంది. వైట్‌ గూడ్స్‌ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్‌ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్‌ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట!     – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ తయారీ సంస్థలు సేల్స్‌ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్‌జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్‌ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్‌ మెషీన్, డిష్‌ వాషర్‌ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్‌ టైమ్‌’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్లు 
చెబుతున్నారు.

రేటు ఎంత ఎక్కువైతే.... 
వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్‌ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్‌లైతే మార్కెట్‌ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్‌ బెకో రిఫ్రిజిరేటర్‌ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.

ఎల్‌జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్‌ మెషీన్‌ ఇన్వర్టర్‌ మోటార్‌పై శాంసంగ్, హయర్‌ 20 ఏళ్ల వారంటీని ఆఫర్‌ చేస్తుండగా... వోల్టాస్‌ బెకో, గోద్రెజ్‌ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని  మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి.  

ప్రధాన విడిభాగాలపైనే... 
చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్‌ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీ సెట్లపై చాలా బ్రాండ్‌లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్‌ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

అధిక వారంటీ వ్యవధి వల్ల అప్‌గ్రేడ్‌ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. 
యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.

వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... 
వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్‌ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్‌లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్‌ స్టోర్‌ డైరెక్టర్‌ అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement