Warranty
-
ఫ్రిజ్.. ఏసీ.. మైక్రోవేవ్.. దీర్ఘాయుష్మాన్‌భవ!
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్ నడుస్తోంది. వైట్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు సేల్స్ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్ టైమ్’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.రేటు ఎంత ఎక్కువైతే.... వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్లైతే మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్ బెకో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.ఎల్జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్ మెషీన్ ఇన్వర్టర్ మోటార్‌పై శాంసంగ్, హయర్ 20 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తుండగా... వోల్టాస్ బెకో, గోద్రెజ్ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన విడిభాగాలపైనే... చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్ ప్యానెల్ టీవీ సెట్లపై చాలా బ్రాండ్లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.⇒ అధిక వారంటీ వ్యవధి వల్ల అప్‌గ్రేడ్ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. ⇒ యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్ స్టోర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. -
మోదీ వారంటీ ఎక్స్పైర్ అవుతుంది..: జైరాం రమేష్
'మోదీ కి గ్యారెంటీ' అనే బీజేపీ నినాదంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట 'గ్యారెంటీ' అనే పదాన్ని వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఉపయోగించారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వారెంటీ గడువు ముగియబోతోందని జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్నాయి. గ్యారెంటీ అనే మాట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఉపయోగించారని ఆయన అన్నారు. మోదీ కి గ్యారెంటీ అనే పదం జూలై 26న ఢిల్లీలో భారత మండపాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రధాని మొదట ఉపయోగించారు. ఇదే నేడు బీజేపీ వారంటీగా మారిపోయింది. ఇప్పటికే మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' పేర్కొన్న విషయాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 'జన గర్జన్ సభ' ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, 'మోదీ కి గ్యారెంటీ' జీరో వారెంటీ అని, మమతా బెనర్జీ, టీఎంసీ మాత్రమే హామీలను నిలబెట్టుకుంటాయని అభిషేక్ అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇన్స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీ
న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తిని ఇన్స్టాల్ (ఏర్పాటు చేయడం/పనిచేయించడం) చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌గూడ్స్ (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది. అంతే కానీ కొనుగోలు చేసిన తేదీని వారంటీ/గ్యారంటీకి పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వారంటీ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల సంఘాలు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్‌పూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, డైకిన్, సోనీ, హిటాచి, ఐఎఫ్బీ, గోద్రేజ్, హయర్, యూరేకా ఫోర్బ్స్, లైడ్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ లేఖ రాశారు. ఉత్పత్తిని వినియోగించని కాలానికి వారంటీని అమలు చేయడం అనుచిత వాణిజ్య విధానంగా ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019’ స్పష్టం చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఫ్రిజ్‌లు, ఏసీలు.. కొంటున్నారా? గ్యారెంటీపై ప్రభుత్వం కీలక సూచన!
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వైట్‌గూడ్స్‌పై ఇచ్చే గ్యారెంటీ లేదా వారంటీకి సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వాటి తయారీ, విక్రయ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఆయా ఉపకరణాల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వంటి ఉపకరణాలపై వారంటీ లేదా గ్యారంటీని అవి కొనుగోలు చేసిన తేదీ నుంచి వర్తింపజేస్తారు. అలా కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని పరిశ్రమలు, రిటైల్ అసోసియేషన్లు, వైట్ గూడ్స్ తయారీదారులకు ప్రభుత్వ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక లేఖలో సూచించారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలను సాధారణంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులే ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేసే వరకు వినియోగదారులు ఆ వస్తువులను ఉపయోగించలేరు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వినియోగదారులు ఉత్పత్తిని ఉపయోగించలేనప్పుడు వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిని ఏర్పరుస్తుంది. కొనుగోలు తేదీ నుంచి వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వలన వినియోగదారు సాధారణంగా ఆనందించే మొత్తం వారంటీ వ్యవధిలో తగ్గింపునకు దారి తీస్తుంది. ఈ-కామర్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల విషయంలో ఈ సమస్య మరింతగా పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి డెలివరీలో అదనపు సమయం ఉంటుంది. -
టూ–వీలర్లకు వారంటీ పొడిగించిన హోండా మోటార్‌సైకిల్.. వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎక్స్టెండెడ్ వారంటీ ప్రకటించింది. 250 సీసీ వరకు సామర్థ్యం గల అన్ని మోడళ్లకు ఇది వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 91 రోజులు మొదలుకుని తొమ్మిదవ సంవత్సరం వరకు పొడిగించిన వారంటీని కస్టమర్లు పొందవచ్చు. 10 ఏళ్ల వరకు సమగ్ర వారంటీ కవరేజీని అందించడమేగాక, వాహనాన్ని ఇతరులకు విక్రయించినప్పడు వారంటీ బదిలీ అవుతుంది. అధిక విలువైన విడిభాగాలు, ఇతర అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలతో సహా 10 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ కవరేజీని అందించడం పరిశ్రమలో తొలిసారి అని హెచ్ఎంఎస్ఐ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథుర్ తెలిపారు. -
7 సీటర్ ఎలక్ట్రిక్ కారు.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 520 కి.మీ ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బీవైడీ ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా ‘ఈ6’ పేరుతో సరికొత్త ప్రీమియం ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.29.6 లక్షలు. ఈ మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ వెహికల్లో 71.7 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్లేడ్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 180 ఎన్ఎం టార్క్, గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు, 580 లీటర్ల బూట్ స్పేస్, వంటి హంగులు ఉన్నాయి. వాహనం వారంటీ మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్లు, బ్యాటరీ 8 ఏళ్లు లేదా 5,00,000 కిలోమీటర్లు, ట్రాక్షన్ మోటార్ 8 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్లు ఆఫర్ చేస్తోంది. -
ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...!
Fairphone 4 Sustainable Smartphone: మనకు నచ్చిన ఫలానా కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కొన్నమనుకోండి. దానిపై వారంటీ ఎన్ని రోజులమేర వస్తుందంటే...! సింపుల్‌గా వన్ ఇయర్ వారంటీ వస్తోందని చెప్తాం. ఫోన్‌తో వచ్చే ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఆర్నెల్లపాటు వారంటీ వస్తుంది. స్మార్ట్‌ఫోన్ తయారుచేసే కంపెనీలు గరిష్టంగా ఒక ఏడాది పాటు మాత్రమే వారంటీని అందిస్తాయి. ఈ సమయంలో ఫోన్‌కు ఏమైనా సమస్యలు తలెత్తితే ఆయా కంపెనీలు చూసుకుంటాయి. వారంటీ ముగిసిపోయాక ఏదైనా సమస్య వస్తే కచ్చితంగా డబ్బులను వసూలు చేస్తాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కంపెనీ ఏకంగా ఐదేళ్ల పాటు వారంటీను అందిస్తోంది. చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్ మన్నికైన, పర్యావరణహితంగా ఉండే స్మార్ట్ఫోన్లను ప్రముఖ డచ్ కంపెనీ ఫెయిర్‌ఫోన్ తయారుచేస్తోంది. భూమ్మీద ఎలక్ట్రానిక్స్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఫెయిర్‌ఫోన్ పనిచేస్తోంది. తాజాగా ఫెయిర్‌ఫోన్ 4 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఐదేళ్ల పాటు వారంటీని అందిస్తుంది. భవిష్యత్తులో వచ్చే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 12, 13, 14, 15 వెర్షన్లను సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, గ్రే, స్పెక్ల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చును. అక్టోబర్ 25 నుంచి కంపెనీ పలు దేశాలకు డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 49,800 కాగా 8జీబీ వేరియంట్ ధర రూ. 55, 845. ఫెయిర్‌ఫోన్ 4 ఫీచర్లు.. 6.3-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,340 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 స్నాప్‌డ్రాగన్ 750జీ ఆడ్రెనో 619 జీపీయూ 8జీబీ ర్యామ్+ 256 ఇంటర్నల్ స్టోరేజ్+ 2టీబీ మైక్రో ఎస్డీ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 48 ఎమ్పీ రియర్ కెమెరా 25ఎమ్పీ సెల్ఫీ కెమెరా 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 3,905mAh రిమూవబుల్ బ్యాటరీ డ్యూయల్ బ్యాండ్ వైఫై 5జీ సపోర్ట్, యూఎస్బీ టైప్‌సీ చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! -
అటు ఓలా స్కూటర్... ఇటు ఓల్ట్రో సైకిల్...
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్కూటర్ విభాగంలో ఓలా సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు సైకిళ్ల సెగ్మెంట్లో ఓల్ట్రో దూసుకొస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పోవడంతో పల్లె పట్నం తేడా లేకుండా పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. అయితే ఈవీల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఇండియాలో అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే కొనేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని ఎలక్ట్రిక్ సైకిల్ తయారీలో పనిలో ఉంది సరికొత్త స్టార్టప్ ఓల్ట్రో. ఓల్ట్రో ఓల్ట్రో స్టార్టప్ 2020 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ స్టార్టప్ నుంచి ఓల్ట్రాన్ పేరుతో ఇ సైకిల్ మార్కెట్లోకి వచ్చింది. ఏడాది వ్యవధిలో 35 లక్షల టర్నోవర్ సాధించింది. అయితే ప్రస్తుతం పెట్రోలు రేట్లు పెరిగిపోవడం, ఫెమా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం నుంచి దన్ను లభిస్తుండటంతో ఓల్ట్రో దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో ఉండే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ సైకిల్ని డిజైన్ చేసింది. ఏడాదిలో ఏకంగా పది కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తోంది. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ ఓల్ట్రో సైకిల్లో 750వాట్ల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే సగటున ఒక యూనిట్ కరెంటు ఖర్చు అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీతో కనిష్టంగా 75 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణం చేస్తుందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రశాంత అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒక యూనిట్ కరెంటు సగటు ఛార్జీ రూ. 4గా ఉందని.. కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించ్చవచ్చంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ధర ఎంతంటే ఓల్ట్రో అందించే ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.35,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ సైకిల్‌పై వన్ ఇయర్ వారంటీని సంస్థ అందిస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు సాగించేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఏడాది వ్యవధిలో పది కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నజఫ్‌గడ్‌లో ఈ సంస్థకు సైకిల్ తయారీ యూనిట్ ఉంది. ఇక్కడ నెలకు నాలుగు వందల సైకిళ్లు తయారు అవుతుండగా దాన్ని పదిహేను వందలకు పెంచనుంది. వారంటీ సైకిల్‌కి సంబంధించిన కంట్రోలర్, మోటార్లో ఏదైనా సమస్యలు వస్తే ఏకంగా సైకిల్‌నే రీప్లేస్ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ సైకిల్ రిపేర్ సైతం చాలా ఈజీ అని చెబుతోంది. అయితే ఈ సైకిల్ ఎంత బరువును మోయగలుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. -
కస్టమర్లకు హోండా శుభవార్త !
వెబ్‌డెస్క్: కస్టమర్లకు హోండా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్ ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది. పెరిగిన హోండా షైన్ ధర ఇండియన అర్బన్ మార్కెట్లో పట్టున్న హోండా సంస్థ ధరలు పెంచింది. హోండా టూవీలర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న షైన్ మోడల్ ధరను పెంచింది. బీఎస్ 6 ప్రమాణాలతో తయారు చేసిన హోండా షైన్ బైక్ రేటు రూ. 1072 పెంచింది. గడిచిన రెండు నెలల్లో వరుసగా రెండోసారి షైన్ బైక్ రేటును హోండా పెంచింది. ప్రస్తుతం ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం షైన్ బైక్ డ్రమ్వేరియంట్ మోడల్ ధర రూ. 71,550 ఉండగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346గా ఉంది. ప్రస్తుత ధరల పెంపుతో వీటిపై అదనంగా రూ. 1072 వ్యయం కానుంది. పెరిగిన ధరపై జీఎస్టీ, ఇతర లోకల్ ట్యాక్సులు కలుపుకుని కొనుగోలు దారులపై అదనంగా దాదాపు రెండు వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓ వైపు షైన్ బైక్ ధరలు పెంచిన హోండా సంస్థ మరోవైపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు జూన్ 30లోపు హోండా షైన్ బైకును కొనుగోలు చేస్తే.. రూ. 3500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చంటూ ప్రత్యేక ఆఫర్‌ను హోండా సంస్థ ప్రకటించింది. -
టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్!
ముంబై: దేశంలో కరోనా విజృంభణ కారణంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల వారంటీ, ఉచిత సర్వీసుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తమ వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది. టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 31, 2021 నుంచి 2021 మే 31 మధ్య కాలంలో ముగియనున్న ప్రయాణీకుల కార్ల వారంటీ, ఉచిత సర్వీసుల కాలాన్ని ఇప్పుడు 2021 జూన్ 30 వరకు పొడగించింది. కోవిడ్ -19 కారణంగా తమ వినియోగదారులు వాహనాలను నిర్వహణ, మరమ్మతుల కోసం టాటా మోటార్స్ సేవా కేంద్రాలకు తీసుకురాలేరు కాబట్టి ఈ ప్రకటన చేసినట్లు టాటా మోటార్స్, పీవీబియు, కస్టమర్ కేర్(డొమెస్టిక్ & ఐబి) హెడ్ డింపుల్ మెహతా వివరించారు. లాక్డౌన్ సమయంలో వారంటీ, ఉచిత సర్వీసుల కాలం ముగిస్తే అది మాకు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన చెప్పారు. మెహతా మాట్లాడుతూ.. "మేము మా కస్టమర్లకు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాము. అందుకే వారి వారంటీ, ఉచిత సర్వీసుల వ్యవధిని 2021 జూన్ 30 వరకు పొడిగించడం ద్వారా ఈ కఠినమైన సమయాల్లో వారికి కొంతైన మద్దతు ఇస్తున్నాము. ఈ చొరవ ద్వారా, మేము మా బ్రాండ్ కస్టమర్లతో కనెక్ట్ అవుతున్నాము" అని అన్నారు. టాటా మోటార్స్ సంస్థకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కి పైగా ప్రాంతాల్లో 608 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి అని తెలిపారు. చదవండి: త్వరలో మార్కెట్లోకి హ్యార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ బైక్స్ -
వారంటీ పొడిగిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులకు వారంటీని పొడిస్తున్నాయి. వీటిలో శామ్సంగ్, వన్‌ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు ఉన్నాయి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ముగిసే అన్ని రకాల ఉత్పత్తులకు మే 31 వరకు వారంటీ పొడిగిస్తున్నట్టు శామ్సంగ్ ప్రకటించింది. మార్చి 1 నుంచి మే 30 వరకు ముగిసే వాటికి మే 31 వరకు వారంటీ ఇస్తున్నట్టు వన్ ప్లస్ తెలిపింది. ఒప్పో సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అలాగే ఆన్లైన్ రిపేర్ సర్వీస్‌ను సైతం అందిస్తోంది. పరిస్థితి సర్దుమణగగానే కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సర్వీసు అందిస్తామని షావొమీ స్పష్టం చేసింది. రియల్మీ మే 31 వరకు వారంటీ ఎక్స్టెండ్ చేసింది. మార్చి 15–ఏప్రిల్ 30 మధ్య కొనుగోలు చేసిన డివైస్‌లకు రిప్లేస్మెంట్ పీరియడ్‌ను అదనంగా 30 రోజులు పొడిగించింది. మార్చి 20 నుంచి మే 20 మధ్య వారంటీ ముగిసే ఉత్పత్తులకు 60 రోజులు పొడిగించినట్టు డీటెల్ వెల్లడించింది. మార్చి 15–మే 15 పీరియడ్‌లో వారంటీ పూర్తి అయ్యే ప్రొడక్టులకు 60 రోజులు ఎక్స్టెండ్ చేసినట్టు లావా పేర్కొంది. వారంటీ పీరియడ్‌ను రెండు నెలలు పొడిగించామని టెక్నో, ఇన్ఫినిక్స్ ప్రకటించాయి. -
వాడేసిన బైకుకూ వారంటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయవిక్రయాలకు ఎన్నో వెబ్‌సైట్లున్నాయి. వీటికోసం ఎన్నో స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. కాకపోతే సెకండ్ హ్యాండ్ బైక్‌లు మాత్రమే కావాలనుకుంటే మాత్రం... క్రెడ్‌ఆర్‌ను (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఆర్ఈడీఆర్.కామ్) సందర్శించాల్సిందే. ఇంకో చిత్రమేంటంటే బైక్ కావాల్సి వచ్చి... దాన్ని కొనుక్కోవటానికి ఇబ్బంది పడ్డ వ్యక్తులే ఈ సంస్థను ఆరంభించటం. దీని గురించి వ్యవస్థాపకులు నిఖిల్, సుమిత్ ఏమంటారంటే... ఉద్యోగ రీత్యా ముంబయిలో మాకు బైక్ కావాల్సి వచ్చింది. కొత్తది కొనేంత డబ్బు లేక సెకండ్ హ్యాండ్ బైకు కొందామనుకున్నాం. ముంబయిలాంటి నగరంలో ఎక్కడ కొనాలో... ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. ఆన్లైన్లో వెతికితే అక్కడ పెట్టే బైకు ఫొటోలు, డాక్యుమెంట్లు ఒకలా ఉండేవి. తీరా ఫోన్ చేసి వెళ్లి చూస్తేనేమో పరిస్థితి వేరేలా ఉండేది! అలాంటపుడే అనిపించింది... కొత్త బైకుల్లాగే సెకండ్‌హ్యాండ్ బైకులనూ నమ్మకంగా.. నాణ్యంగా అందించే సంస్థ ఉంటే బాగుండునని!! ఆ ఆలోచనతోనే రూ.25 లక్షల పెట్టుబడితో 2015లో ముంబై కేంద్రంగా క్రెడ్‌ఆర్‌ను ప్రారంభించాం. అమ్మేవాళ్లు ఎక్కువ పైసలు రావాలనుకోవటం... కొనేవా ళ్లు తక్కువకు కొనాలనుకోవటం జరిగేది ఒక్క సెకండ్‌హ్యాండ్ వ్యాపారంలోనే. ఆరంభించిన 8 నెలల్లోనే 10 వేల బైకులను విక్రయించాం. రూ.40 కోట్ల టర్నోవర్ సాధించాం. క్రెడ్ఆర్లో కొన్న వాహనానికి మేం వారంటీ కూడా ఇస్తున్నాం. 40 నుంచి 4 వేల బైకులకు.. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పుణె, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభించాం. 40 బైకులతో ప్రారంభించిన క్రెడ్ఆర్లో ఇపుడు 4 వేలకు పైగా వాహనాలు రిజిస్టరై ఉన్నాయి. రోజుకు 75-80 బైకులను విక్రయిస్తున్నాం. ప్రతి బైకు విక్రయం మీద అమ్మకం దారు నుంచి రూ.500 చార్జీ వసూలు చేస్తాం. 8 నెలల్లో రూ.40 కోట్ల టర్నోవర్.. సంస్థను ప్రారంభించిన 8 నెలల్లోనే 10 వేల బైకులను విక్రయించాం. అంటే రూ.40 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. రోజుకు 1,000 బైకులను విక్రయించాలనేది మా లక్ష్యం. అందుకే వచ్చే ఏడాది మార్చి నాటికి 10 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో క్రెడ్ఆర్ సేవలను ప్రారంభిస్తాం. రెండేళ్ల పాటు నిధుల జోలికెళ్లం.. క్రెడ్‌ఆర్‌ను ప్రారంభించిన ఏడాదిలోపే రెండు రౌండ్లలో నిధులను సమీకరించాం. సీడ్ రౌండ్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో స్నాప్‌డీల్ ఫౌండర్లు కునాల్ బహల్, రోహిత్ బన్సల్, బిగ్ బాస్కెట్ చైర్మన్ గణేష్ కృష్ణన్, అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్‌లు 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. సిరీస్-ఎలో సెప్టెంబర్‌లో ఫిడెలిటీ ఇన్వెస్టర్స్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. రెండేళ్ల పాటు వ్యాపార విస్తరణ మీద దృష్టిపెట్టాం. ఆ తర్వాతే మరోసారి నిధుల సమీకరణ చేస్తాం. నేటి నుంచి బిగ్ బైక్ ఫెస్టివల్: సెకండ్ హ్యాండ్ బైకుల వ్యాపారంలో నమ్మకాన్ని పెంచేందుకు, క్రెడ్ఆర్కు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ది బిగ్ బైక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. అంటే ఒక బైకు కొంటే ఇంకో బైకును ఉచితంగా అందిస్తాం. మూడు రోజుల్లో తొలి 400 మంది కస్టమర్లు మాత్రమే దీనికి అర్హులు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం?
ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు... బైక్, కారు వంటి ఆటోమొబైల్స్ కావచ్చు... వీటిని కొనేటపుడు ప్రతిసారీ శ్రీధర్‌కు షోరూమ్ వాళ్లు ఒక ఆఫర్ ఇస్తుంటారు. ‘‘సర్! దీనికి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. తీసుకోండి’’ అని. అంటే... సదరు వస్తువుకు కంపెనీ ఇచ్చే వారంటీ కాకుండా డీలర్ ఇచ్చే అదనపు వారంటీ అన్నమాట. దానిక్కాస్త ఎక్స్ట్రా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ ప్రతి సందర్భంలోనూ వద్దని చెప్పేస్తూ ఉంటాడు. తరవాత బయటికొచ్చి... అరె! తీసుకుని ఉంటే బాగుండేదేమో!! అనుకుంటుంటాడు. మరి ఈ ఎక్స్టెండెడ్ (పొడిగించిన) వారంటీని తీసుకోవటం మంచిదా..? లేక వద్దని వదిలేయటమే మంచిదా? ఒకసారి చూద్దాం. పొడిగించిన వారంటీ అంటే నిజానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదే. ఎందుకంటే ప్రతి వస్తువుకూ సాధారణంగా ఇచ్చే వారంటీ ఒకటుంటుంది. అది నెల కావచ్చు... ఏడాది కావచ్చు. ఈ గడువులో గనక వస్తువుకేదైనా అయితే కంపెనీ దాన్ని రిపేరు చేయటమో, లేక మార్చి కొత్తది ఇవ్వటమో చేస్తుంది. ఆ గడువు అయిపోయాక గనక ఆ వస్తువు దెబ్బతింటే అప్పుడు ఈ పొడిగించిన వారంటీ పనికొస్తుంది. బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయో మనకు తెలియంది కాదు. అవి క్లెయిమ్ రూపంలో చెల్లించే మొత్తం కంటే ప్రీమియం రూపంలో వసూలు చేసే మొత్తమే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే అవి క్లెయిమ్‌లు చెల్లించ గలుగుతాయి. లేదంటే దివాలా తీస్తాయి. ఈ పొడిగించిన వారంటీ కూడా ఇలానే పనిచేస్తుంది. అంటే దీనర్థం పొడిగించిన వారంటీలో క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండవనేగా!? అంకెల్లో ఓ సారి చూద్దాం.. శ్రీధర్ ఎలా ఆలోచించాడో ఓ సారి చూద్దాం. తను ఓ ల్యాప్‌టాప్ కొందామనుకున్నాడు. పేరున్న రిటెయిలర్ దగ్గరకు వెళ్లాడు. రూ.36,000 ధర చెప్పిన రిటెయిలర్... కంపెనీ ఇస్తున్న ఏడాది వారంటీతో పాటు తాము రెండేళ్లు పొడిగింపు వారంటీ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ రెండేళ్ల పొడిగింపు వారంటీ లేకుండా ల్యాప్‌టాప్ ఎంతని అడిగితే... ఆ వారంటీ (బీమా) ధర మైనస్ చేసి రూ.26,000కు ఇస్తానన్నాడు. గమనించాల్సిందేంటంటే ఏడాదిలోపు ల్యాప్‌టాప్‌కు ఏదైనా అయితే తిరిగి కొత్తదిస్తారు. రూ.36,000 పెట్టి కొంటే ఈ గడువు మూడేళ్లకు పెరుగుతుంది. అదే 26వేలు పెట్టి కొంటే ఏడాది మాత్రమే వారంటీ. ఆ తరవాత ఒక్కరోజు గడిచినా రీప్లేస్మెంట్ ఉండదు. శ్రీధర్ ఆలోచన మరోలా ఉంది. ఎలాగూ ఏడాది వరకు వారంటీ ఉంటుంది. పెపైచ్చు ల్యాప్‌టాప్ 26వేలకే వస్తుంది. ఒకవేళ ఏడాది తరవాత ఏదైనా జరిగితే... రోజురోజుకూ టెక్నాలజీ మారుతోంది కనక అప్పటికి మార్కెట్లో ఉండే కొత్త టెక్నాలజీ ల్యాప్‌టాప్‌ను దాదాపు 26వేలకే కొనుక్కోవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం కొన్న మోడల్‌నే అప్పుడు కూడా కొనాలంటే పాతదై పోతుంది కనక ధర కూడా దాదాపు 15-20 వేల మధ్యనే ఉంటుంది. ఒకవేళ ల్యాప్‌టాప్‌కు ఏమీ కాకపోతే మొత్తం మిగిలినట్టే. ఇలా ఆలోచించాకే... రిటెయిలర్ ఎంత ఆశ చూపించినా, ఎంతగా భయపెట్టినా శ్రీధ ర్ లొంగలేదు. తన నిర్ణయానికే కట్టుబడి ఈ పొడిగింపు వారంటీ వద్దనుకున్నాడు. మానసికంగా లాభమే! శ్రీధర్లానే అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఈ పొడిగింపు వారంటీ తీసుకోవటం వల్ల ఇతర లాభాల మాటెలా ఉన్నా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన నోబెల్ విజేత డానియెల్ కానెమన్ వంటి మానసిక విశ్లేషకులు ఏమంటారంటే... ఏదైనా లాభం వల్ల కలిగే ఆనందం కన్నా నష్టం వల్ల కలిగే బాధ రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఈ లెక్కన చూస్తే నష్టం వల్ల కలిగే బాధను, నష్టం వస్తుందనే ఒత్తిడిని దూరం చేసే పొడిగింపు వారంటీ మంచిదే. గతంలో శ్రీధర్ ఇలాంటి వారంటీలు అవసరం లేదని, వద్దని తన తోటి కస్టమర్లకు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ మానసిక ప్రశాంతత కోణంలో ఆలోచించాక తను ఆ సిఫారసు మానుకున్నాడులెండి!!. అవసరమైనచోటే బీమా ఎప్పుడైనా బీమా తీసుకునేది అవసరమైన చోటే. అంటే... తద్వారా జరిగే నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉంటేనే! మెడిక్లెయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ ఇలాంటివే. ఎందుకంటే నష్టం జరిగినపుడు మనం కోల్పోయేదాన్ని ఈ పాలసీలు లేకుంటే భర్తీ చేసుకోవటం కష్టం. నిపుణులు చెప్పేదేంటంటే... ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అలా కాదు. వాటికేదైనా జరిగితే ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకోగలం. మరి అలాంటపుడు బీమా ఎందుకనేది వారి ప్రశ్న. ఇటీవల ‘బ్లూమ్‌బర్గ్’ చేసిన సర్వే ప్రకారం... ఈ పొడిగించిన వారంటీలు అమ్మకం దార్లకు ఊహించని లాభాల్ని అందిస్తున్నాయట. ఈ రకం వారంటీల కోసం కంపెనీలకయ్యే ఖర్చు చాలా తక్కువని, అవి వీటిద్వారా వినియోగదారులకు అందిస్తున్న ప్రయోజనాలు కూడా తక్కువ కావటంతో వాటికి లాభాలొస్తున్నాయని బ్లూమ్‌బర్గ్ వివరించింది.