వాడేసిన బైకుకూ వారంటీ! | CredR announces festive offers for its entire range of bikes | Sakshi
Sakshi News home page

వాడేసిన బైకుకూ వారంటీ!

Published Sat, Nov 7 2015 6:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

వాడేసిన బైకుకూ వారంటీ!

వాడేసిన బైకుకూ వారంటీ!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయవిక్రయాలకు ఎన్నో వెబ్‌సైట్లున్నాయి. వీటికోసం ఎన్నో స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. కాకపోతే సెకండ్ హ్యాండ్ బైక్‌లు మాత్రమే కావాలనుకుంటే మాత్రం... క్రెడ్‌ఆర్‌ను (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఆర్‌ఈడీఆర్.కామ్) సందర్శించాల్సిందే. ఇంకో చిత్రమేంటంటే బైక్ కావాల్సి వచ్చి... దాన్ని కొనుక్కోవటానికి ఇబ్బంది పడ్డ వ్యక్తులే ఈ సంస్థను ఆరంభించటం. దీని గురించి వ్యవస్థాపకులు నిఖిల్, సుమిత్ ఏమంటారంటే...
 
ఉద్యోగ రీత్యా ముంబయిలో మాకు బైక్ కావాల్సి వచ్చింది. కొత్తది కొనేంత డబ్బు లేక సెకండ్ హ్యాండ్ బైకు కొందామనుకున్నాం. ముంబయిలాంటి నగరంలో ఎక్కడ కొనాలో... ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. ఆన్‌లైన్‌లో వెతికితే అక్కడ పెట్టే బైకు ఫొటోలు, డాక్యుమెంట్లు ఒకలా ఉండేవి. తీరా ఫోన్ చేసి వెళ్లి చూస్తేనేమో పరిస్థితి వేరేలా ఉండేది! అలాంటపుడే అనిపించింది... కొత్త బైకుల్లాగే సెకండ్‌హ్యాండ్ బైకులనూ నమ్మకంగా.. నాణ్యంగా అందించే సంస్థ ఉంటే బాగుండునని!! ఆ ఆలోచనతోనే రూ.25 లక్షల పెట్టుబడితో 2015లో ముంబై కేంద్రంగా క్రెడ్‌ఆర్‌ను ప్రారంభించాం.

అమ్మేవాళ్లు ఎక్కువ పైసలు రావాలనుకోవటం... కొనేవా ళ్లు తక్కువకు కొనాలనుకోవటం జరిగేది ఒక్క సెకండ్‌హ్యాండ్ వ్యాపారంలోనే. ఆరంభించిన 8 నెలల్లోనే 10 వేల బైకులను విక్రయించాం. రూ.40 కోట్ల టర్నోవర్ సాధించాం.  క్రెడ్‌ఆర్‌లో కొన్న వాహనానికి మేం వారంటీ కూడా ఇస్తున్నాం.
 
40 నుంచి 4 వేల బైకులకు..
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పుణె, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభించాం.  40 బైకులతో ప్రారంభించిన క్రెడ్‌ఆర్‌లో ఇపుడు 4 వేలకు పైగా వాహనాలు రిజిస్టరై ఉన్నాయి. రోజుకు 75-80 బైకులను విక్రయిస్తున్నాం. ప్రతి బైకు విక్రయం మీద అమ్మకం దారు నుంచి రూ.500 చార్జీ వసూలు చేస్తాం.
 
8 నెలల్లో రూ.40 కోట్ల టర్నోవర్..
సంస్థను ప్రారంభించిన 8 నెలల్లోనే 10 వేల బైకులను విక్రయించాం. అంటే రూ.40 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. రోజుకు 1,000 బైకులను విక్రయించాలనేది మా లక్ష్యం. అందుకే వచ్చే ఏడాది మార్చి నాటికి 10 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో క్రెడ్‌ఆర్ సేవలను ప్రారంభిస్తాం.
 
రెండేళ్ల పాటు నిధుల జోలికెళ్లం..
క్రెడ్‌ఆర్‌ను ప్రారంభించిన ఏడాదిలోపే రెండు రౌండ్లలో నిధులను సమీకరించాం. సీడ్ రౌండ్‌లో భాగంగా ఈ ఏడాది మార్చిలో స్నాప్‌డీల్ ఫౌండర్లు కునాల్ బహల్,  రోహిత్ బన్సల్, బిగ్ బాస్కెట్ చైర్మన్ గణేష్ కృష్ణన్, అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్‌లు 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. సిరీస్-ఎలో సెప్టెంబర్లో ఫిడెలిటీ ఇన్వెస్టర్స్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. రెండేళ్ల పాటు వ్యాపార విస్తరణ మీద దృష్టిపెట్టాం. ఆ తర్వాతే మరోసారి నిధుల సమీకరణ చేస్తాం.
 
నేటి నుంచి బిగ్ బైక్ ఫెస్టివల్: సెకండ్ హ్యాండ్ బైకుల వ్యాపారంలో నమ్మకాన్ని పెంచేందుకు, క్రెడ్‌ఆర్‌కు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ది బిగ్ బైక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. అంటే ఒక బైకు కొంటే ఇంకో బైకును ఉచితంగా అందిస్తాం. మూడు రోజుల్లో తొలి 400 మంది కస్టమర్లు మాత్రమే దీనికి అర్హులు.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement