న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తిని ఇన్‌స్టాల్ (ఏర్పాటు చేయడం/పనిచేయించడం) చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌గూడ్స్ (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది. అంతే కానీ కొనుగోలు చేసిన తేదీని వారంటీ/గ్యారంటీకి పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వారంటీ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది.
ఇందుకు సంబంధించి పరిశ్రమల సంఘాలు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, శామ్‌సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్‌పూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, డైకిన్, సోనీ, హిటాచి, ఐఎఫ్‌బీ, గోద్రేజ్, హయర్, యూరేకా ఫోర్బ్స్, లైడ్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ లేఖ రాశారు. ఉత్పత్తిని వినియోగించని కాలానికి వారంటీని అమలు చేయడం అనుచిత వాణిజ్య విధానంగా ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019’ స్పష్టం చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. పండుగల సీజన్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment