రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు | Budget 2025 Session Of Parliament Set To Be A Significant Event From January 31 To April 4, Check More Details Inside | Sakshi
Sakshi News home page

రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Published Sat, Jan 18 2025 10:00 AM | Last Updated on Sat, Jan 18 2025 10:16 AM

Budget 2025 Session of Parliament set to be a significant event from January 31 to April 4

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget 2025 Session) జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సెషన్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో భాగం మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. ఈమేరకు కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు తన ఎక్స్‌ ఖాతాలో వివరాలు వెల్లడించారు.

జనవరి 31న ఉదయం 11 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసంగంలో రాబోయే సంవత్సరానికి ప్రభుత్వ ఎజెండా, ప్రాధాన్యతలను వివరించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దేశ ఆర్థిక పనితీరు, భవిష్యత్ అంచనాలను తెలిపే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.

కేంద్ర బడ్జెట్ సమర్పణ

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్‌కు ఇది వరుసగా ఎనిమిదో పూర్తికాల బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌లో కీలక ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ ఆర్థిక విధానాలను వివరిస్తారు. ఈ బడ్జెట్‌లోని అంశాలను పార్లమెంటు ఉభయ సభలు నిశితంగా పరిశీలిస్తాయి. ఇందులోని అంశాలు, వివిధ నిబంధనలపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతాయి.

ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..

రెండో దశల్లో చర్చలు

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగే తొలి దశ సమావేశాల అనంతరం వివిధ పార్లమెంటరీ కమిటీలు బడ్జెట్ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు వీలుగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 9 వరకు పార్లమెంట్ విరామం తీసుకోనుంది. తిరిగి మార్చి 10న రెండో విడత సమావేశాలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 4న ముగుస్తాయి. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చించి బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement