అధ్వాన్న దిశగా మన ‘ఆర్థికం’ | P Victor Vijay Kumar Writes Guest Column On India Present State Of Economy | Sakshi
Sakshi News home page

అధ్వాన్న దిశగా మన ‘ఆర్థికం’

Published Sat, Aug 31 2019 1:21 AM | Last Updated on Sat, Aug 31 2019 1:26 AM

P Victor Vijay Kumar Writes Guest Column On India Present State Of Economy - Sakshi

ప్రస్తుతానికి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం పెద్ద గీత ముందు చిన్నగీతను చూసినట్టు ఉంటుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఇంకా మిగిలుందనే విశ్వాసాలను గౌరవిస్తూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ఆకస్మిక లేదా తక్షణ ఆర్థిక సమస్యలను ఎదుర్కోడానికి ఆర్బీఐ వద్ద సరయిన క్యాపిటల్‌ ఉందా లేదా అన్నది ప్రాథమికంగా చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్‌ బ్యాంకులు 13–14 శాతం ఆస్తులు రిజర్వ్‌గా ఉంచుకుంటున్నాయి. మనం కేవలం 7 శాతం మించకుండా పెట్టుకున్న రిజర్వ్‌ ఇది. దేశంలో జరిగే ద్రవ్య లావాదేవీలకు కావాల్సిన వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐకి లోపించింది. కశ్మీరులో 370వ ఆర్టికల్‌ రద్దు జరిగాక – మన దేశభద్రత విషయంలో విదేశీ మదుపుదార్లు అప్రమత్తంగా ఉంటున్నారు. మన దేశ స్థితి ’ప్రస్తుతానికి బాగలేదు’ నుంచి ’అధ్వానం’ దిశగా వెళుతోందనేది సుస్పష్టం.

చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి అక్షరాలా రూ. 1.76 లక్షల కోట్లను డివిడెండ్‌ పేరుతో బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇది భారతీయ ఆర్థిక శాస్త్రంలోనే చారిత్రక సంఘటన. 1990లలో లిబరలైజేషన్‌ జరగడానికి ముందున్న సంకట సమయంలో కూడా ఈ చర్య తీసుకోలేదు. ఇలా చేయడం తప్పాఒప్పా అని చూడ్డం ఒక కోణం అయితే, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందా అనేది మరో కోణం. ప్రస్తుతానికి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం పెద్ద గీత ముందు చిన్నగీతను చూసినట్టు ఉంటుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఇంకా మిగిలుందనే విశ్వాసాలను గౌర విస్తూ ముందు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ఇది పూర్వపు గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రతిపాదించిన సూత్రంప్రకారం ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌లో భాగంగా ఇలా చేయడం జరిగింది. ఆకస్మిక లేదా తక్షణ ఆర్థిక సమస్యలను ఎదుర్కోడానికి ఆర్బీఐ వద్ద సరి అయిన క్యాపిటల్‌ ఉందా లేదా అన్నది ప్రాథమికంగా చూడాలి.

మన రూపాయి విలువ అనుకోని విధంగా క్షీణించినా లేదా పెరిగినా, మన దగ్గర తాత్కాలిక లిక్విడిటీ సమస్యలు ఏవన్నా వచ్చినా, బాండ్‌ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం అవసరం. అలాంటి వాటి కోసం ఆర్బీఐ కొంత డబ్బు వెనకేసుకుని ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో భాగంగా కొంచెం కొంచెం రిజర్వుగా పెట్టుకుంటూ వచ్చింది. అందులో డివిడెండ్‌ రూపంలో ప్రభు త్వానికి ప్రతి సంవత్సరం ఏభై, అరవై వేల కోట్లు ఇచ్చుకోగా మిగిలించుకుంటూ వచ్చిన క్యాపిటల్‌ అది. 

అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్‌ బ్యాంకులు  13–14 శాతం ఆస్తులు రిజర్వ్‌గా ఉంచుకుంటున్నాయి. మనం కేవలం 7 శాతం మించకుండా పెట్టుకున్న రిజర్వ్‌ ఇది. ఇప్పటికి సుమారు రూ. 2.4 లక్షల కోట్ల ఆపత్కాల నిధి ఉంటే అందులో నుండి రూ. 1.23 లక్షల కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఇంకా నిశితంగా ఈ ‘వెసులుబాటు భావాన్ని’ అర్థం చేసుకోవాలంటే ‘తలసరి’ లెక్కన చూడాలి. ఆర్థిక సమస్య తీవ్రత అంచనా దొరకదు. మనకుండే ఆస్తులను మనం ఎంతమందిమి పంచుకుంటున్నాం అన్నది ఒక ఆర్థిక శాస్త్రవేత్తకుండాల్సిన సెన్సిటివిటీ. 

ఒక వ్యక్తికి ఎంత సంపాదించే సామర్థ్యం ఉంది, అందులో సగటున మనం ఎంత రిజర్వ్‌గా వాడుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడ్డం అంటే వ్యక్తుల సముదాయం, సంస్థల సముదాయం కష్టాల్లో పడ్డట్టు. వ్యక్తిగత స్థాయిలో కాకుండా ఒక సమూహంగా మనం కేంద్రస్థాయిలో కొంత రిజర్వ్‌ ఏర్పాటు చేసుకుంటాము. ఆ కోణంలో చూస్తే – మన రిజర్వ్‌ శాతం అభివృద్ధి చెందిన దేశాల రిజర్వ్‌ శాతంతో పోలిస్తే కనీసం ఐదోవంతు కూడా ఉండదు.  ఇలా అత్యవసర నిధి ప్రపంచంలో అతి తక్కువగా ఉన్న దేశాలలో మనదొకటి. అంత తక్కువలో ఉన్నది ప్రభుత్వానికి ఇచ్చేసి వాడుకోమంటున్నాం. దానివలన భవిష్యత్తులో ఏదైనా అనుకోని విపత్తు వస్తే ఆర్బీఐ తట్టుకునే సామర్థ్యం కోల్పోతుంది.  

మన జీడీపీ సుమారు 190 లక్షల కోట్ల రూపాయలు. మన సేవింగ్స్‌ రేటు అతి తక్కువ స్థాయిలో ఉంది. 2008లో 37 శాతంగా ఉన్న ఈ సేవింగ్స్‌ రేటు ఇప్పుడు 30 శాతానికి పడిపోయింది. అంటే వ్యక్తిలేదా సంస్థ స్థాయిలో మనకుండే వెసులుబాటులో నాలుగో వంతు ఇప్పటికే తగ్గిపోయింది. మన దేశంలో జరిగే ద్రవ్య లావాదేవీలకు కావాల్సిన వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐకి లోపించింది. అంటే – రేపు చైనా, అమెరికా వ్యాపార ఘర్షణ వలన రూపాయి దెబ్బతిన్నా, మన బాండ్‌ మార్కెట్లో వడ్డీరేట్లు అస్తవ్యస్తతకు గురైన సందర్భాలను ఎదుర్కోవడంలో ఆర్బీఐ శక్తి సామర్థ్యాలు బాగా తగ్గుముఖం పట్టినట్టే. 

ఇంతకుముందులా నమ్మకంగా వేలకోట్లు మార్కెట్లో పెట్టేసి అడ్డుపడి సమతూకంగా వ్యవహరించే స్థితి ఇక ఆర్బీఐకి లేదు. ఇది వాస్తవం. సింపుల్‌గా చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థను దేహంగా భావిస్తే, మనలో కొవ్వు రూపంలో నిలువ ఉన్న సొమ్ము ఈ ఆర్బీఐ రిజర్వ్‌. ఇది కాస్తా సగానికి పైగా కరిగిపోయింది. మన శక్తి లోపించే కొద్దీ కొవ్వు కరిగిపోతే ఇక ఉన్న కండలు కరిగించాల్సిన పరిస్థితి వస్తుంది అని సాధారణ పరిభాషలో చెప్పుకోవచ్చు. 

ఉదాహరణకు కశ్మీరు విషయంలో 370 ఆర్టికల్‌  రద్దు జరిగాక – మన దేశభద్రత విషయంలో విదేశీ మదుపుదార్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ఒక్క జూలైలోనే విదేశీ వ్యవస్థాగత మదుపుదార్లు  సుమారు రూ. 8,000 కోట్లను దేశంనుంచి ఉపసంహరించారు. మనదేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల వలన, అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఘర్షణ వలన ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళుతుందో ఇతమిద్దంగా చెప్పడం కష్టం. ఫైనాన్స్‌ దిగ్గజం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఊహించని విధంగా కూలిపోవడం మన ఆర్థిక వ్యవస్థకు ఒక షాక్‌. 

అలాగే దీవాన్‌ లాంటి పెద్ద హౌసింగ్‌ సంస్థలు ఇకపై లోన్లు ఇవ్వలేని స్థితికి వచ్చి, డీఫాల్ట్‌ చేస్తున్నపరిస్థితి ఊహించనిది. కేవలం గత సంవత్సరంలోనే బ్యాంకింగ్‌ రంగంలో బయటపడిన మోసం విలువ రూ. 70,000 కోట్లు. ఇవి మనం ముందే ఊహించి ప్లాన్‌ చేసుకున్న పరిణామాలు కావు. ఇవన్నీ ఆర్థికవ్యవస్థలో కరిగిపోతున్న మన ఆస్తి విలువలు. ఒక్క ఐఎల్‌ఎఫ్‌ఎస్‌  కరిగిపోవడంతో రమారమి లక్షకోట్ల ప్రాజెక్టులు నిధులు పొందే సామర్థ్యం మనదగ్గర క్షీణించింది.  ఈవిధంగా మనం ప్రతి బ్యాంకులో ప్రస్తుతం ఉన్న సంస్కృతి చూస్తూ పోతే కొన్నిలక్షల కోట్ల ప్రాజెక్టులకు నిధులు అందచేయగలిగే సామర్థ్యం ఇప్పటికే కోల్పోయాం.  

ఈ పరిస్థితి అంతా గమనిస్తే– మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళడానికి కావాల్సింది మన దగ్గర ఎన్నడూలేని విధంగా పడిపోతున్న గ్రామీణ వినియోగ సామర్థ్యం పెరగడం. అధిక జనాభా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం కూడా పట్టణ స్థాయిలో బాగా దెబ్బతిన్నది. వీటి కోసం మనం చిన్నతరహా, మధ్యతరహా సంస్థలను ప్రోత్సహించాల్సి ఉంది. మొండి బకాయిల బూచి చూపించి మనం అప్పులు ఇవ్వడం ఆపేస్తే ఇక ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. నిజానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులైన పెద్ద సంస్థల వలన జరిగినవే ఎక్కువ శాతం. 

మొత్తం లోన్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల శాతం 10 కంటే తక్కువ ఉండొచ్చు. వాస్తవానికి అది ఎక్కువే. అయితే – నూరుశాతం అప్పు తీసుకున్న వాళ్ళు ఎగవేయడానికి తీసుకుంటారనే భావంతో పోలిస్తే మాత్రం తక్కువే. ఈ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి అందవలసిన అప్పుల కోసం ఒక రిస్క్‌ కుషన్‌ ఏర్పాటు చేసుకోవలసి ఉంది. పెద్ద బ్యాంకులను విలీనం చేసే ఆలోచన చేసిన ప్రభుత్వం ఈ రూ. 1.76 లక్షల కోట్లలో రూ. 70,000 కోట్లు బ్యాంకులకు ఇచ్చి ఇదెలా సాధించగలదో మనకు ఇప్పటికీ తెలీదు. మిగతా డబ్బులు ప్రభుత్వం ఈ సంవత్సరం తగ్గిన పన్నుల చెల్లింపులు పూరించడానికి వాడుతుందని తెలిసింది. 

బదిలీ అయిన ఈ మొత్తం డబ్బును ప్రభుత్వం ఎలా వినియోగం చేస్తుందనేది కీలకమైనప్పుడు, ఇది కేవలం ద్రవ్యలోటుకు వాడుకోడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేది నిరాశాజనకమైన విషయం. ప్రాజెక్టులకు నిధులు ఆగిపోయిన ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు పెరిగి, సామాన్య మానవుడి ఆదాయ స్థాయి పెంచాల్సిన దిశగా ఈ డబ్బు ఉపయోగపడదు అనేది విదితం. మన దేశ స్థితి ‘ప్రస్తుతానికి బాలేదు’ నుంచి ‘అధ్వానం’ దిశగా వెళుతోందనేది సుస్పష్టం. మన ఆర్బీఐ కష్టమొస్తే కోలుకునే శక్తి ఇంతకు ముందులా ఉండబోదు. సామాన్యుడికి అందని ఈ సూక్ష్మ విషయాలు ఇకపై తప్పనిసరిగా వ్యక్తిగత క్షేమం దృష్ట్యా గమనంలో ఉంచుకోవాల్సి ఉంది. ప్రముఖ ఆర్థికవేత్త అన్నట్టు ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు పెంపుడు కుక్క కూడా బిస్కెట్లు దొరికే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచిస్తుందట.  

ప్రభుత్వం ఈ డబ్బుతో మేజిక్‌ చేసే పరిస్థితిలో లేదు. అందుకు పాలసీ స్థాయిలో నిర్ణయాలు అవసరం. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులపై ట్యాక్స్‌ తీసేయడం లాంటివి గొప్ప ఊపిరి పీల్చుకునే చర్యలు కావు. ప్రభుత్వమే ముందుపడి అమలు చేసే ప్రాజెక్టులను త్వరితగతిన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వ సంస్థల నుండి రావల్సిన బకాయిలను వెంటనే వ్యవస్థలోకి తేవాల్సి ఉంది. ముఖ్యంగా – మన దేశం కాంగ్రెస్‌ పాలన నుంచి ఇప్పటిదాకా కూడా ‘పాలసీ బాటిల్‌ నెక్స్‌’తో సతమతమౌతూనే ఉంది. ఇవేవీ మనం పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొవ్వు కరిగించుకుంటాం?


వ్యాసకర్త: పి. విక్టర్‌ విజయ్‌ కుమార్‌
ఇన్వెస్డ్‌మెంట్‌ బ్యాంకర్, భారీమౌలిక పరిశ్రమల చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌
ఈ–మెయిల్‌ :  pvvkumar@yahoo.co.uk
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement