న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్ ఎకానమీ ప్రస్తుతం ఉద్యోగాల కల్పనలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న సమస్యల్లో ఉద్యోగాల కల్పన ప్రధానమైందని ఆయన అన్నారు. నైపుణ్యాల పెంపు ద్వారా మానవ వనరుల అభివృద్ధి తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా రాజన్ పనిచేస్తున్నారు.
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ లాంబా, తాను (రాజన్) సంయుక్తంగా రాసిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ అనే పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ భారత్ ఎకానమీ గురించి కీలక విశ్లేషణ చేశారు. ‘‘భారత్ ప్రస్తుతం ఒక క్రాస్ రోడ్ వద్ద ఉంది‘ అన్న ముగింపు అభిప్రాయంతో ముగిసిన పుస్తకం గురించి వివరించిన సందర్భంగా రాజన్ ఏమన్నారంటే...
► భారతదేశం అతిగొప్ప బలం 140 కోట్ల జనాభా. అయితే ఈ జనాభాకు సంబంధించి ‘మూలధనం’ ఎలా బలోపేతం చేయాలన్నది ప్రశ్న. దేశం అభివృద్ధి పథంలో పయనించే ప్రతి స్థాయిలో ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది.
► ప్రైవేట్ రంగ ఉద్యోగాల విషయంలో ‘రిజర్వేషన్ల’ ఆందోళనలు ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు తమ నివాసితులకు మాత్రమే ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ప్రయతి్నస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన ధోరణి. ఇలాంటి ధోరణి పోవాలి. దీనివల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశం మొత్తం విస్తరించడానికి వీలవుతుంది.
► గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ కలి్పస్తే రాబోయే ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో దేశంలో భారీ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పించడానికి 10 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
► భారత్ మానవ ‘మూలధనాన్ని’ మెరుగుపరుచుకుంటే... అవసరమైన ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి. శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరుస్తే, కంపెనీలు భారతదేశానికి వస్తాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు లభించడం లేదని కంపెనీలు తరచూ చెబుతుండడాన్ని మనం గమనిస్తున్నాం.
► సామాన్యునికి సైతం సైవలు అందేలా పాలనా సంస్కరణలు జరగాలి. ప్రత్యేకించి పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి సారించాలి.
► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మదింపు సరిగా జరగాలి. భారత్ తన బలహీనతలపై కాకుండా బలాలపై ఆధారపడిన మార్గాన్ని ఆవిష్కరించాలి.
Comments
Please login to add a commentAdd a comment