ముంబై: అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇటు భారత్ ఎకానమీపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం తప్పదని పలు అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆయా సంస్థల అంచనాల ప్రకారం భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–21లో మైనస్ 10 శాతం క్షీణత నుంచి మైనస్ 15 శాతం క్షీణత శ్రేణిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రితం క్షీణ అంచనాలను మరింత పెంచడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కాగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ కొంత పుంజుకునే వీలుందన్న అంచనాలనూ కొన్ని సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా ఉండడం గమనార్హం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదుచేసుకుంటుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్, చైనా మాత్రం 2.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని విశ్లేషిస్తుండడం గమనార్హం. ముఖ్యాంశాలు ఇవీ...
14.8 శాతం క్షీణత...
అమెరికా బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్: భారత్ ఎకానమీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14.8% వరకూ క్షీణత నమోదు చేసుకుంటుంది. తీవ్ర ప్రతికూలత నేపథ్యంలో క్రితం అంచనా మైనస్ 11.8 శాతాన్ని మరింత పెంచాల్సి వస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో భారీగా నష్టపోతోంది భారతదేశమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి త్రైమాసికంలో 23.9% క్షీణిస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 13.7%గా ఉండవచ్చు. డిసెంబర్ త్రైమాసికంలో 9.8%, చివరి త్రైమాసికంలో 6.7% క్షీణరేట్లు నమోదయ్యే వీలుంది. ఒక్క 2020 క్యాలెండర్ ఇయర్‌లో క్షీణత 11.1%గా ఉంటే, 2020–21లో మైనస్ 14.8%గా ఉంటుంది. అయితే 2021–22లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే వీలుంది. బేస్ రేటు (2020–21లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి) క్షీణతలో ఉండడం వల్ల 2021–22లో వృద్ధి రేటు 15.7% ఉండొచ్చు.
కఠినమైన లాక్‌డౌన్ కారణం..
అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం... ఫిచ్: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ 5 శాతమే క్షీణిస్తుందని తొలి అంచనా. అయితే ఈ అంచనాను మరింతగా 10.5 శాతానికి పెంచుతున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా ఎక్కువగా మైనస్ 23.9 శాతంగా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే ఏ దేశం అనుసరించని రీతిలో భారత్ లాక్‌డౌన్‌ను పాటించింది. దీనితో పెట్టుబడులు, వినియోగం విభాగాలు తీవ్ర ప్రతికూలతలు చూశాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించి నదానికన్నా ఎక్కువగా పతనం అవుతున్న నేపథ్యంలో వర్ధ మాన దేశాల (చైనా కాకుండా) మార్కెట్ల క్షీణ అంచనాలను కూడా క్రితం మైనస్ 4.7% క్షీణత నుంచి మైనస్ 5.7%కి సవరిస్తున్నాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. అయితే క్రితం అంచనా మైసన్ 4.6 శాతం క్షీణత కన్నా ఇది తక్కువ. కాగా చైనా మాత్రం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ఇంతక్రితం వృద్ధి అంచనా 1.2%. ఇక అమెరికా క్షీణ రేటు అంచనాను మైనస్ 5.6% నుంచి మైనస్ 4.6 శాతానికి సవరిస్తున్నాం.
తిరోగమనంలోనే...!
ఎస్‌బీఐ ఎకోర్యాప్ పరిశోధనా నివేదిక: భారత 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్షీణ రేటు అంచనాలకు మైనస్ 6.8 శాతం నుంచి మైనస్ 10.9 శాతానికి పెంచుతున్నాం. మొదటి త్రైమాసిక జీడీపీ భారీగా మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకోగా, రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) ఆర్థిక వ్యవస్థ మైనస్ 12 శాతం నుంచి మైనస్ 15 శాతం వరకూ క్షీణిస్తుంది. మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఈ పరిమాణం మైనస్ 5%–మైనస్ 10% వరకూ ఉంటుంది. నాల్గవ త్రైమాసికం (జనవరి–మార్చి)లో ఈ క్షీణ రేటు మైనస్ 2% నుంచి మైనస్ 5 శాతం వరకూ ఉంటుంది. అయితే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణ వృద్ధి రేటు కనిపిస్తుండడం, కొన్ని కీలక రంగాల్లో క్షీణరేట్లు తగ్గుతుండడం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న సానుకూల అంశాలు.
నష్టం రూ.18.44 లక్షల కోట్లు
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్: కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను క్రితం మైనస్ 5.3% నుంచి మైనస్ 11.8%కి పెంచాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏ త్రైమాసికంలోనూ వృద్ధి నమోదయ్యే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థకు 18.44 లక్షల కోట్ల నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ వల్ల 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధి బాటకు మళ్లే వీలుంది. లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది. 1951 నుంచీ జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉండగా, 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లో క్షీణ రేట్లు నమోదయ్యాయి. 1980లో మైనస్ 5.2 శాతం క్షీణత చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment