న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్న వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బతీశాయన్న విశ్లేషణ వినిపిస్తోంది.
తగ్గిన డిమాండ్...
జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చూస్తే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 5.7 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 9.4 శాతం నష్టపోగా, ఇదే కాలంలో నిఫ్టీ–50 3.8 శాతం మేర పెరిగింది. దేశ ఆర్థిక రంగ విస్తరణలో బ్యాంకులతోపాటు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలది కీలకపాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం నుంచి లోటు ఉన్న రంగాలకు రుణ అవసరాలను ఎన్‌బీఎఫ్‌సీ విభాగమే తీరుస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగం నిధుల కటకటతో ఆర్థిక రంగ విస్తరణ కూడా ఆగిపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వినియోగం తగ్గుదల అన్నది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2019–20 ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం మేర తగ్గించి 7%గా పేర్కొనడం గమనార్హం. డిమాండ్ తగ్గడమే అంచనాలను తగ్గించడానికి కారణమని ఐఎంఎఫ్ తెలిపింది.
మరికొంత కాలం పాటు...
కొత్త ఉద్యోగాలు లేకపోవడం, నగదు లభ్యత తక్కువగా ఉండడం తదితర కారణాలతో డిమాండ్/వినియోగం మరికొంత కాలం బలహీనంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగడం సానుకూల చర్య అని, అయితే గతంలో అధిక బేస్‌తోపాటు ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా లేని అంశాలను వారు గుర్తు చేస్తున్నారు. కంపెనీల పరంగా చూస్తే... ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) 2019–20లో తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో గత ఏడు త్రైమాసికాల్లోనే తక్కువ విక్రయాలను నమోదు చేసింది. ఇక వినియోగంలో భాగమైన ఆటోమొబైల్ రంగం కూడా గడ్డు పరిస్థితులను చూస్తోంది. వాహన అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ‘‘ప్రస్తుతం వినియోగ రంగంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే... రానున్న త్రైమాసికాల్లోనూ అమ్మకాల వృద్ధి పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. కన్జ్యూమర్ స్టాపుల్స్, ఆటో, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్‌ఆర్) జ్యుయలరీ విభాగాలు ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత మందగమనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది’’ అని ఈక్విరస్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది.
అప్రమత్తంగా ఉండాలి...
సమీప కాలంలో ఆర్థిక వ్యవస్థ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్న నేపథ్యంలో వినియోగ రంగ కంపెనీల ఫలితాల వృద్ధి పుంజుకోకవచ్చు. దీంతో స్టాక్స్ ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నా యని ఈ రంగం షేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాల దృష్టితోనే కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. ఈ విభాగంలో ఎంఅండ్‌ఎం, టీవీఎస్ మోటార్, మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, గోద్రేజ్ కన్జ్యూమర్, కోల్గేట్ పామోలివ్, బ్రిటానియా, డీమార్ట్, యునైటెడ్ స్పిరిట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నిఫ్టీ కన్జంప్షన్ సూచీలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన షేర్లు.
విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?
Published Sat, Jul 27 2019 5:25 AM | Last Updated on Sat, Jul 27 2019 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment