ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం... | Nirmala Sitharaman announces multiple changes to boost growth | Sakshi
Sakshi News home page

ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...

Published Sat, Aug 24 2019 5:16 AM | Last Updated on Sat, Aug 24 2019 9:08 AM

Nirmala Sitharaman announces multiple changes to boost growth - Sakshi

సీనియర్‌ అధికారులతో కలిసి కీలక ప్రకటన చేసిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్‌ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎంఎస్‌ఎంఈ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ ఇలా ఎన్నో రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇవి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీని భారీగా పెంచుతూ గత బడ్జెట్‌లో చేసిన ప్రకటన దేశ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా నష్టపరిచింది. దీంతో సర్‌చార్జీ పెంపును తొలగించాలన్న ఎఫ్‌పీఐల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

పరిశ్రమలకు చౌకగా మూలధన నిధుల రుణాలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల(హెచ్‌ఎఫ్‌సీ)కు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) నుంచి అదనంగా రూ.20,000 కోట్ల నిధుల మద్దతు (మొత్తం రూ.30,000 కోట్లు అవుతుంది), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు నిధుల కొరత సమస్య తీర్చేందుకు గాను వారికి జీఎస్టీ రిఫండ్‌లను 30 రోజుల్లోనే చేసేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయం, ఇన్‌ఫ్రా, హౌసింగ్‌ ప్రాజెక్టులకు రుణాల లభ్యత పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం,       వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు సవరణను 2020     జూన్‌ వరకు వాయిదా వేయడం, రిజిస్టర్డ్‌ స్టార్టప్‌లపై ఏంజెల్‌ట్యాక్స్‌ రద్దు, సహా ఎన్నో నిర్ణయాలు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి.  

ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ భారం తొలగింపు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం మన్నించింది. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయంపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్‌ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఎటువంటి చర్యల్లేకపోవడంతో... నాటి నుంచి ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల వరకు నిధులను వెనక్కి తీసుకున్నారు. సర్‌చార్జీ పెంపును ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్‌ కూడా చేశారు. ‘‘క్యాపిటల్‌ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019 ద్వారా స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై విధించిన సర్‌చార్జీ పెంపును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేర ఆశించిన ఆదాయం రాకుండా పోతుంది. సర్‌చార్జీ ఉపసంహరణ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందరికీ వర్తిస్తుంది.  

స్టార్టప్‌లకు ఊరట
రిజిస్టర్డ్‌ స్టార్టప్‌లకు ఏంజెల్‌ ట్యాక్స్‌ నుంచి ఉపశమనం కల్పించడం ప్రభు త్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ‘‘స్టార్టప్‌లు, వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు ఎదుర్కొంటున్న      నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఆదాయపన్ను చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి వెల్లడించారు. ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు, ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దును నిపుణులు స్వాగతించారు. క్యాపిటల్‌ మార్కెట్లకు ఇవి జోష్‌నిస్తాయని       డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ రాజేష్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.  


రుణాలు ఇక చౌక!
గృహ, వాహన, వినియోగ రుణాలు చౌకగా మా రనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్‌బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెపో రేటు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమైన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, ఫలితంగా గృహ, వాహన, ఇతర రిటైల్‌ రుణాల ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు.

అలాగే, వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల వరకు అదనపు లిక్విడిటీ, రుణ వితరణ సాధ్యపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక రుణాల వితరణ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు పీఎంఎల్‌ఏ, ఆధార్‌ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయనుంది. రుణాలను తీర్చేసిన 15 రోజుల్లోపు వాటి డాక్యుమెంట్లను రుణ గ్రహీతలకు ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ఇకపై తప్పనిసరి. దీనివల్ల కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పిపోతాయి.  

ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల మద్దతు  
హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎఫ్‌సీలకు లోగడ ఎన్‌హెచ్‌బీ ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం. దీనివల్ల హౌసింగ్‌ రంగానికి నిధుల వితరణ పెరగనుంది.

ఆధార్‌ ఆధారిత కేవైసీని వినియోగించేందుకు ఎన్‌బీఎఫ్‌సీలను అనుమతించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్షిక క్రెడిట్‌ స్కీమ్‌ను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించగా, ప్రతీ బ్యాంకు స్థాయిలో దీనిపై అత్యున్నత స్థాయిలో సమీక్ష చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

మన దగ్గరే వృద్ధి వేగం...
అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి అంచనాలను 3.2 శాతానికి సవరించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఆర్థిక రంగం వృద్ధి వేగంగా ఉందన్నారు.  


ఆటో రంగానికి ఉద్దీపనలు
దేశంలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ రంగానికి ఉద్దీపనం కల్పించే నిర్ణయాలను మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజును వాయిదా వేసింది. ప్రభుత్వ విభాగాలు పెట్రోల్, డీజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అన్ని రకాల వాహనాలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను మాత్రం పట్టించుకున్నట్టు లేదు. 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌–6 వాహనాలనే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది.

అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బీఎస్‌–4 వాహనాల నిల్వలు పెరిగిపోతుండడం, ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోత్సాహంపై ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో... 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే వాహనాలను వాటి రిజిస్ట్రేషన్‌ గడువు వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నట్టు మంత్రి చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంటర్నల్‌ కంబస్టన్‌ వాహనాలకూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆటో రంగంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలకు గండి పడినట్టు నివేదికలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మార్చి వరకు కొనుగోలు చేసే వాహనాలపై తరుగుదలను 15 శాతానికి బదులు 30 శాతానికి పెంచుతున్నట్టు మంత్రి చెప్పారు. వాహనాలను తుక్కుగా మార్చడం సహా పలు చర్యలను పరిశీలించనున్నట్టు తెలిపారు.  

ఎంఎస్‌ఎంఈలకు వేగంగా రిఫండ్‌లు
ఎంఎస్‌ఎంఈలకు జీఎస్‌టీ రిఫండ్‌లను ప్రభుత్వం ఇకపై 30 రోజుల్లోపు చెల్లించనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. జీఎస్‌టీ సంబంధిత బకాయిలు అన్ని వేళలా సగటున రూ.7,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జీఎస్‌టీ బకాయిలను 30రోజుల్లోపు పూర్తి చేయడం అన్నది ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎంతో  మేలు చేస్తుందని, అంతిమంగా ఉపాధి అవకాశాల పెంపునకు దారితీస్తుందని ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఎంఎస్‌ఎంఈలకు ఒకటే నిర్వచనం ఇచ్చే దిశగా చట్ట సవరణను పరిశీలించనున్నట్టు చెప్పారు.


మరిన్ని ముఖ్యాంశాలు...
► రూ.100 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల రంగంపై వెచ్చించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్‌ చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ టాస్క్‌ ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

► అలాగే, మౌలికరంగ, హౌసింగ్‌ ప్రాజెక్టులకు రుణాల వితరణ పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది.   

► కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరపూరిత చర్యగా పరిగణించబోమని, సివిల్‌ లయబులిటీగానే చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.  

►   ఆదాయపన్ను శాఖ నుంచి ఆదేశాలు, నోటీసుల జారీకి కేంద్రీకృత వ్యవస్థ.  

►  స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సీబీడీటీలో సెల్‌ ఏర్పాటు.


భారతీయ కంపెనీలను కాపాడాలి
కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంపిటిషన్‌ కమీషన్‌ సన్నద్ధం కావాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ సంస్థల నుంచి పోటీ పరంగా భారత కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్‌ శాఖ వ్యవహరాలనూ కూడా మంత్రి నిర్మలా సీతారామనే చూస్తున్నారు. సీసీఐ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పోటీ పరంగా దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సీసీఐ స్వచ్చందంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారతీయ వినియోగదారులను, భారత కంపెనీలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు.   

ఊతమిస్తాయి...
ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు విశ్వాసాన్ని పెంచి, ఆర్థిక రంగంలో సహజ స్ఫూర్తి ఫరిడవిల్లేలా చేస్తాయని దేశీయ పరిశ్రమలు అభిప్రాయపడ్డాయి. ఆటో రంగం టర్న్‌ అరౌండ్‌ అయ్యేందుకు తోడ్పడుతుందని పరిశ్రమ పేర్కొంది.
 
ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్వెస్టర్ల లాభాలపై సర్‌చార్జీని తొలగించడం కీలకమైన ప్రకటన. ఇది తిరిగి ఉత్సాహాన్ని పాదుకొల్పుతుంది.
– ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్‌
 
అద్బుతమైన ప్యాకేజీ. ఆర్థిక రంగాన్ని తదుపరి దశకు తీసుకెళుతుంది.  
– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌
 
మందగమనం సంకేతాలను ఇస్తున్న ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వ చర్యలు ఎంతో మేలు చేస్తాయి. వ్యాపారాలు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఈ చర్యలు తప్పకుండా నిలబెడతాయి.
– సందీప్‌ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్‌.
 
ప్రభుత్వ ప్యాకేజీ మొత్తం మీద ఆర్థిక రంగానికి భారీగా మేలు చేస్తుంది. ఎందుకం టే ఇది వాస్తవంగా నిర్వహణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలు సైతం తమవంతుగా రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులను తగ్గించేందుకు ముందుకు రావాలి.  
– భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్‌  

ప్రభుత్వ చర్యలు ఆటో పరిశ్రమకు తక్షణ ఉపశమనాన్నిస్తాయి.
– వేణు శ్రీనివాసన్, టీవీఎస్‌ మోటార్‌ చైర్మన్‌
 
ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఆటో రంగానికి తోడ్పాటునివ్వడంతోపాటు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌నకు వీలు కల్పిస్తాయి. ఈ నిర్ణయాలు అమలైతే వృద్ధికి, ఆటో రంగంలో డిమాండ్‌కు దారితీస్తాయి.
– మార్టిన్‌ ష్యూవెంక్, మెర్సెడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈవో
 
మార్కెట్లకు ఉద్దీపనల ప్యాకేజీ మేలు చేస్తుంది. ఎఫ్‌ఫీఐలపై సర్‌చార్జీని తొలగించడం తిరిగి విదేశీ నిధులు మన మార్కెట్ల వైపు వచ్చేలా చేస్తుంది. పండుగల సీజన్‌కు ముందు ఈ ఉద్దీపనల ప్యాకేజీ ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది.
– గౌతం ష్రాఫ్, ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ కోహెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement