ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా బెటర్‌ | Indian economy to do better than 8 per cent prediction | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా బెటర్‌

Published Sat, Mar 6 2021 6:27 AM | Last Updated on Sat, Mar 6 2021 6:27 AM

Indian economy to do better than 8 per cent prediction - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసినప్పటికీ, అంతకుమించి మంచి ఫలితాన్ని అందించే బాటలో పయనిస్తోందని ఆర్థికశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాక్సినేషన్‌ విస్తృతితో ఆర్థిక పురోగతి మరింత ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో దేశం ఆరోగ్య రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.  కరోనా వైరెస్‌ సెకండ్‌ వేవ్‌ను భారత్‌ పటిష్టంగా అరికట్టగలిగిందని ఆర్థికశాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగినప్పటికీ, మ్తొతంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. మహమ్మారి సమస్య కొనసాగుతున్నప్పటికీ, మూడవ త్రైమాసికంలో 0.4 శాతం జీడీపీ వృద్ధి నమోదుకావడం సానుకూల అంశమని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో రిజర్వ్‌ బ్యాంక్‌  ఇండస్ట్రియల్‌ అవుట్‌లుక్‌ సర్వే ఆశావాద దృక్పదాన్ని వెలువరించిన అంశాన్ని నివేదిక ప్రస్తావించింది. ఉత్పిత్తి, ఆర్డర్‌ బుక్, ఉపాధి అవకాశాలు మూడవ త్రైమాసికంలో పెరిగిన అంశాన్ని సర్వే స్పష్టం చేసిందని వివరించింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో 24.4 శాతం క్షీణించగా, రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు 7.3 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement