ప్రపంచంలో ఐదో స్థానం మనదే | Arun Jaitley back to business, and his task is cut out | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఐదో స్థానం మనదే

Published Fri, Aug 31 2018 12:36 AM | Last Updated on Fri, Aug 31 2018 12:36 AM

Arun Jaitley back to business, and his task is cut out - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బ్రిటన్‌ను వెనక్కి నెట్టేసి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. పెరుగుతున్న వినియోగం, బలమైన ఆర్థిక కార్యకలాపాలతో ఇది సాధ్యమవుతుందన్నారు. అంతేకాదు, వచ్చే 10–20 ఏళ్లలో ప్రపంచంలో మొదటి మూడు అగ్ర దేశాల్లో భారత్‌ చోటు సంపాదిస్తుందన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది ఫ్రాన్స్‌ను అధిగమించాం. వచ్చే ఏడాది బ్రిటన్‌ను కూడా దాటిపోయే అవకాశం ఉంది. దాంతో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’’ అని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కార్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. దేశ జీడీపీ 2017 చివరికి 2.597 ట్రిలియన్‌ డాలర్లుగా పరిగణించగా, అదే సమయానికి ఫ్రాన్స్‌ జీడీపీ 2.582 ట్రిలియన్‌ డాలర్ల వద్దే ఉండటంతో ఫ్రాన్స్‌ స్థానాన్ని మన దేశం సొంతం చేసుకుంది. అయితే, జీడీపీలో తలసరి వ్యయం పరంగా ఫ్రాన్స్‌ కంటే మన దేశం వెనుకనే ఉండటం గమనార్హం. మన దేశ జనాభా 134 కోట్ల స్థాయిలో ఉండటమే ఇందుకు కారణం. ఫ్రాన్స్‌ జనాభా కేవలం 6.7 కోట్లే. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 2017 చివరి నాటికి 2.94 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశ జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 6.7% నమోదు చేయగా, ఈ ఏడాది 7.4%కి చేరుతుందని ఆర్‌బీఐ, కేంద్రం అంచనా వేస్తున్నాయి.

తక్కువ వృద్ధి దేశాలను దాటేస్తాం 
భారత్‌ కంటే తక్కువ వృద్ధి రేటున్న దేశాలను అధిగమించే సత్తా మన దేశానికి ఉందని జైట్లీ పేర్కొన్నారు. ‘‘ఆర్థిక కార్యకలాపాల విస్తరణతోనే వృద్ధి పెరుగుతోంది. వచ్చే 10–20 ఏళ్లలో మన వృద్ధి రేటును పెంచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం వృద్ధి ఎక్కువగా ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ ప్రాంతాల్లోనే ఉంది. తూర్పున వృద్ధి వేగాన్ని అందుకోవాల్సి ఉంది. ఇక్కడా వృద్ధిని చూడనున్నాం’’ అని జైట్లీ వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్న దృష్ట్యా సీసీఐ విస్తరించాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు. 

డీమోతో పెరిగిన పన్ను వసూళ్లు
డీమోనిటైజేషన్‌తో దేశంలో పన్ను వసూళ్లు పెరిగాయని జైట్లీ తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేయడంతోపాటు, మరింత వృద్ధికి దోహదపడిందని చెప్పారు. రద్దు చేసిన పెద్ద నోట్లలో 99.3% తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్‌బీఐ ప్రకటించడంతో, డీమోతో కేంద్రం సాధించిందేమిటని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘చాలా వరకు కరెన్సీ బ్యాంకుల్లోకి వచ్చాయని, దీంతో డీమోనిటైజేషన్‌ ఉద్దేశాలు నెరవేరలేదన్న ప్రకటనలు వస్తున్నాయి. జమ చేయని నోట్లు చెల్లుబాటు కాకుండా పోవడం ఒక్కటే డీమోనిటైజేషన్‌ ఉద్దేశమా? ముమ్మాటికీ కాదు’’ అని జైట్లీ పేర్కొన్నారు. దేశాన్ని పన్నులు చెల్లించే విధంగా మార్చడమే పెద్ద లక్ష్యంగా పేర్కొన్నారు. ఆదాయపన్ను వసూళ్లు డీమోనిటైజేషన్‌కు ముందు రెండు సంవత్సరాల్లో వరుసగా 6.6 శాతం, 9 శాతంగా ఉండగా, డీమోనిటైజేషన్‌ తర్వాతి సంవత్సరాల్లో 15 శాతం, 18 శాతం మేర నమోదైనట్టు జైట్లీ తెలిపారు. మూడో సంవత్సరంలోనూ ఇదే వృద్ధి కనిపిస్తుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement