8-10% వృద్ధి సాధ్యమే..
పన్ను ఆదాయాలు పెరుగుతున్నాయ్..
- ఈసారి వరుణుడు కరుణిస్తున్నాడు...
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు జోరందుకుంటోందని, ఈ ఏడాది పన్నుల ఆదాయాలు కూడా దండిగానే వస్తాయని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం... ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావంతో మళ్లీ 8-10 శాతం వృద్ధిరేటు సుసాధ్యం కానుందని కూడా ఆయన చెప్పారు. ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వ్యవస్థ, ఇన్‌ఫ్రా రంగంలో పెట్టుబడుల జోరు, స్మార్ట్‌సీటీలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం వంటి చర్యలన్నీ వృద్ధిని పరుగులు తీయించేందుకు దోహదం చేస్తాయని జైట్లీ తెలిపారు. ఆదివారమిక్కడ జరిగిన నాబార్డు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
37.5 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
గతేడాదికంటే ఈసారి పన్ను వసూళ్లలో మంచి పురోగతి కనబడుతుండటం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అంత్యంత సానుకూల సంకేతంగా జైట్లీ పేర్కొన్నారు. ఈఏడాది తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) పరోక్ష పన్నుల ఆదాయం 37.5 శాతం ఎగబాకి రూ.1.54 లక్షల కోట్లుగా నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.1.12 కోట్లుగా ఉన్నట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ.. గతేడాది మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదుకావడం చెప్పుకోదగిన విషయమేనని..
ఈ సంవత్సరం(2015-16)లో 8 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. అయితే, దేశీయంగా కొన్ని సవాళ్లు పొంచిఉన్నాయని.. వీటిపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోందన్న జైట్లీ.. ఈ ఏడాది వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 3.3 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక గ్రీస్ సంక్షోభంపై మాట్లాడుతూ.. అన్ని దేశాలూ దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. తమ పరిమితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొనే వ్యయాలు చేయాలన్నది గ్రీస్ ఇచ్చిన అతిపెద్ద సందేశమని చెప్పారు.
రైతులకు కొత్త వ్యవసాయ బీమా పథకం!
ఈ ఏడాది వరుణుడు కరుణిస్తున్నాడని.. వర్షాలు ఆశించిన స్థాయిలోనే పడుతుండటం అటు రైతులకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పప్పులు, ఇతర ఆహారోత్పుత్తుల ధరలు దిగొచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతుల కోసం ఒక కొత్త వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని చెప్పారు. రైతులు ఒక్క వర్షాలను మాత్రమే నమ్ముకోకుండా చూడటమే ఈ కొత్త పథకం ప్రధానోద్దేశమని జైట్లీ వ్యాఖ్యానించారు.
రుతుపవన వర్షాలు కాస్త ఆలస్యమైనప్పటికీ.. వర్షపాతం జూన్‌లో సాధారణం కంటే 25 శాతం అధికంగా నమోదైందని జైట్లీ పేర్కొన్నారు. కరువు భయాలు ఇక తొలగినట్టేనని.. మిగిలిన కాలానికి కూడా వర్షాలు ఆశాజనకంగానే ఉండొచ్చన్నారు. కరువు ఆందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ఇటీవలే ప్రకటించిన రూ.50,000 కోట్ల జాతీయ సాగునీటి పథకం ఇందులో ప్రధానమైనదని కూడా జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం కోసం మరిన్ని చర్యలకు సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారు.