న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేందుకు అధిక వృద్ధి రేటు తప్పనిసరి అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సేవింగ్స్ అండ్ రిటైల్ బ్యాంక్స్ 25వ ప్రపంచ కాంగ్రెస్ సదస్సులో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికంటూ అభివృద్ధి ప్రయోజనాల స్వచ్ఛందంగా వేచి చూడటం మనలాంటి ఆకాంక్షలతో కూడిన సమాజానికి సరిపోదు. దానికి మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు అధిక వృద్ధి రేటు కావాలి. అధిక శాతం ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు, వారి జీవన ప్రమాణాల ఉన్నతికి అభివృద్ధిని ఓ సాధనంగా వినియోగించుకోవాలి. అదే సమయంలో, అభివృద్ధి, ప్రగతి ఫలాలు కొందరికే లబ్ధి కలిగిస్తూ, చాలా మందిని దీనికి దూరంగా ఉంచుతున్న ప్రమాదాల పట్ల స్పృహతోనే ఉన్నాం’’ అని జైట్లీ వివరించారు. వృద్ధి తాలూకూ ప్రభావం అందరినీ చేరుకునేందుకు సమయం పడుతుందన్నారు. 2014 నుంచి మోదీ సర్కారు చేపట్టిన ఆర్థిక సేవల విస్తృతిపై మాట్లాడుతూ... ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు 33 కోట్ల ఖాతాలను ప్రారంభించాయని చెప్పారు. జీరో బ్యాలన్స్ ఖాతాల్లో ప్రజలు డిపాజిట్లు చేయడం మొదలెట్టారని, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పించామని తెలియజేశారు. మన దేశంలో ప్రధానంగా బీమా, పెన్షన్ సదుపాయాలు అందరికీ లేకపోవడంతో... చౌక ప్రీమియానికే బీమా సదుపాయం కల్పించామన్నారు. ప్రమాద బీమా కింద 14.1 కోట్ల మంది, జీవిత బీమా పథకం కింద 5.5 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. తక్కువ ప్రీమియం పెన్షన్ పాలసీ అటల్ పెన్షన్ యోజనను కూడా తీసుకొచ్చినట్టు చెప్పారు. రుణ సదుపాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని ముద్రా పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
లిక్విడిటీ సమస్య వ్యవస్థాపరం కాదు: బ్యాంకర్లు
లిక్విడిటీ కొరత వ్యవస్థాపరమైన సమస్య కాదని ప్రముఖ బ్యాంకర్లు స్పష్టంచేశారు. రోలోవర్‌కు సంబంధించి అన్ని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలూ చెల్లింపులను చేయగలవని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ చెప్పారు. సేవింగ్స్ అండ్ రిటైల్ బ్యాంక్స్ ప్రపంచ 25వ కాంగ్రెస్ సదస్సుకు హాజరైన సందర్భంగా పలువురు బ్యాంకింగ్ రంగ నిపుణులు లిక్విడిటీపై స్పందించారు. నాబార్డ్ చైర్మన్ హెచ్‌కే భన్వాలా మాట్లాడుతూ... లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ‘‘కొన్ని సంస్థలు బ్యాంకుల నుంచి స్వల్పకాల రుణాలను తీసుకుని వాటిని కస్టమర్లకు దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వటం వల్ల వాటికి సంబంధించి పెద్ద సమస్య ఏదీ లేదు. అదో సమస్యే కానీ, వ్యవస్థాగత సమస్య కాదు’’ అని పేర్కొన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో లిక్విడిటీపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నో బ్యాంకులతో పాటు, నాబార్డ్ సైతం ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సహకారం అందిస్తోందని భన్వాలా చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి తమకు రూ.15,000 కోట్ల ఎక్స్‌పోజర్ ఉందన్నారు. ‘‘మా మొత్తం రూ.4.80 లక్షల కోట్ల ఆస్తుల్లో రూ.15,000 కోట్లు అన్నవి చాలా స్వల్పం. వీటికి సంబంధించి రిస్క్ లేదు. ఏ ఎగవేత కూడా మాకు ఎదురు కాలేదు. రుణం తీసుకున్న ప్రతీ సంస్థ చెల్లింపులు చేస్తూనే ఉంది’’ అని భన్వాలా వివరించారు.
పేదరిక నిర్మూలనకు వృద్ధి రేటు పెరగాలి
Published Fri, Nov 16 2018 1:06 AM | Last Updated on Fri, Nov 16 2018 1:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment