7–8 శాతం సముచిత వృద్ధి రేటే: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే భారత్ సాధిస్తున్న 7–8 శాతం వృద్ధి రేటు సముచితమైన స్థాయేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మందగించడానికి పెద్ద నోట్ల రద్దు ఒక్కటే కారణం కాదని పేర్కొన్నారు. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను అనేక అంశాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు.
2016–17 మార్చి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 6.1 శాతంగానే నమోదు కావడంతో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను భారత్ కోల్పోయి.. చైనా దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్‌డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైట్లీ పేర్కొన్నారు. మరోవైపు, డీమోనిటైజేషన్ సమయంలో వచ్చిన మొత్తం డిపాజిట్ల గణాంకాలపై ఆర్‌బీఐ ఇంకా కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు. ఆర్థిక సంవత్సరాన్ని జనవరికి మార్చే విషయంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు.
ఎయిరిండియాపై జైట్లీ, గజపతిరాజు కీలక చర్చ
రుణభారంతో కుంగుతున్న ఎయిరిండియా భవితవ్యంపై గురువారం కేంద్ర మంత్రులు జైట్లీ, అశోక గజపతిరాజు కీలక చర్చలు జరిపారు. ఎయిరిండియాలో వ్యూహాత్మక వాటాను విక్రయించే అవకాశాలున్నాయని, పూర్తిగా ప్రైవేటీకరించే అవకాశాలు కూడా లేకపోలేదన్న వార్తల నేపథ్యంలో వీరి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎయిరిండియాను పటిష్టమైన, లాభదాయకమైన సంస్థగా మార్చాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని భేటీ తర్వాత పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే చెప్పారు.