Tax revenues
-
ఖజానా నింపండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టొద్దని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. భూముల అమ్మకాలతో పాటు నోటరీల క్రమబద్ధీకరణ, పన్నుల ఆదాయం పెంపు తదితర మార్గాల ద్వారా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ శాఖల రాబడులు, బకాయిలకు సంబంధించిన వివరాలను మంత్రులకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణకు సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. పన్ను ఆదాయం మరింత పెంచండి రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాల ప్రక్రియను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మూడు ప్రధాన పారిశ్రామిక వాడల అమ్మ కాలతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న విలు వైన ప్రభుత్వ భూములను అటు ప్రజా ప్రయోజనార్థం వినియోగించుకోవడంతో పాటు ఖజానా కు ఊతమిచ్చే విధంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా దష్టి పెట్టి పనిచేయాలని మంత్రివర్గం సూచించింది. అదేవిధంగా నోటరీల ద్వారా క్రయ విక్రయ లావాదేవీలు జరిగిన స్థలాలు, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేసినందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పన్ను వసూళ్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగవేత జరగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని స్పష్టం చేసింది. పన్ను ఆదాయం పెంచడం ద్వారా రెవెన్యూ శాఖలు ప్రభుత్వ మనుగడ సజావుగా సాగేట్టు చూడాలని ఉపసంఘం ఆదేశించింది. పన్నుల ఆదాయం ఇప్పటికే ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మరింత పెరిగేలా కషి చేయాలని కోరింది. వారం రోజుల్లో 58, 59 జీవోల సంబంధిత పట్టాలు మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వాటి ప్రకారం.. జీవో 58, 59లకు (ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేని నిర్మాణాల క్రమబద్ధీకరణ సంబంధిత జీవోలు) సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పేదలకు ఇళ్ల స్థలాలపై సీసీఎల్‌కు ఆదేశాలు పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియపై కూడా ఉపసంఘం చర్చించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏయే జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని, జిల్లాల కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఆ దిశగా అధికారులు కషి చేసి అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ప్రయోజనాన్ని కలిగించాలని సూచించింది. -
అగ్రి సెస్‌తో రాష్ట్రాలకు నష్టం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తాజా బడ్జెట్లో ‘అగ్రి సెస్ (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్–ఏఐడీసీ)’ను ప్రవేశపెట్టారు. పెట్రోలు, డీజిల్‌లతో పాటు బంగారం, వెండి తదితర 12 వస్తువులపై ఈ సెస్ విధించనున్నారు. ఈ సెస్ కారణంగా వినియోగదారులపై భారం పడకుండా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో సర్దుబాటు చేస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్ సందర్భంగా వివరణ ఇచ్చారు. సాధారణంగా కేంద్ర పన్నుల్లో 41% రాష్ట్రాల వాటాగా ఉంటుంది. కానీ, సర్‌చార్జ్‌లు, సెస్లలో రాష్ట్రాలకు వాటా లభించదు. దాంతో, అగ్రి సెస్ కారణంగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో వాటా ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి. అగ్రి సెస్ నుంచి రాష్ట్రాలకు ప్రత్యక్ష ప్రయోజనం ఉండదు. అగ్రిసెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి పాండే వెల్లడించారు. తాత్కాలిక, ప్రత్యేక లక్ష్యాల కోసమే సెస్ విధించాలని, వ్యవసాయ మౌలిక వసతుల వంటి సాధారణ లక్ష్యాలకు సెస్ సరికాదని గణాంక నిపుణుడు ప్రణబ్ సేన్ వ్యాఖ్యానించారు. ఈ సెస్ వల్ల కేంద్రం సేకరించే కస్టమ్స్ డ్యూటీ నుంచి రాష్ట్రాలు తమ వాటా ఆదాయాన్ని కోల్పోతాయన్నారు. అయితే, సాధారణంగా కేంద్రం పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా లభించిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోదని, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో సర్దుబాటు చేసే అగ్రిసెస్ ద్వారా రాష్ట్రాలకు ఆదాయ పరంగా నష్టం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో... గత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు పరిగణలోకి తీసుకుంటే అగ్రి సెస్ రూపంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ద్వారా కేంద్రానికి రూ.2,016.33 కోట్ల ఆదాయం సమకూరనుంది. 2019–20 లో రాష్ట్రంలో 401.27 కోట్ల డీజిల్, 164.42 కోట్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. దీని ప్రకారం డీజిల్ పై లీటరుకు రూ.4 అగ్రి సెస్ పరిగణలోకి తీసుకుంటే ఏటా రూ.1,605.33 కోట్లు సమకూరనున్నాయి. ఇదేసమయంలో 164.54 కోట్ల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరిగాయి. లీటరు పెట్రోలు పై విధించిన రూ.2.50 అగ్రిసెస్ పరిగణలోకి తీసుకుంటే రూ.411.25 కోట్లు కేంద్రానికి ఆదాయం గా రానున్నది. తెలంగాణలో.. తెలంగాణ విషయానికొస్తే ఏటా రూ.237 కోట్లకుపైగా నష్టం ఉంటుందని అంచనా. రాష్ట్రంలో నెలకు సగటున (2020, డిసెంబర్ అమ్మకాల ప్రకారం) 12.23 కోట్ల లీటర్ల పెట్రోల్, 23.11 కోట్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు పలు రూపాల్లో ఉంటాయి. రాష్ట్ర పన్నుల రాబడులు నేరుగా మన ఖజానాకు చేరితే కేంద్రం విధించే పన్నుల్లో మనకు వాటా వస్తుంది. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ.4, పెట్రోల్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి, ఆ మేరకు సెస్ పెంచింది. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఉంటుంది కానీ, సెస్ ద్వారా వసూలు చేసుకునే దానిలో రాష్ట్రాలకు రూపాయి రాదు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో నెలకు జరిగే మొత్తం విక్రయాల్లో డీజిల్‌పై లీటర్‌కు రూ.4 చొప్పున రూ.92.44 కోట్లు, పెట్రోల్‌పై రూ.2 చొప్పున రూ.24.46 కోట్లు ఎక్సైజ్డ్యూటీ తగ్గిపోతుంది. అదే సంవత్సరానికి వస్తే డీజిల్‌పై రూ.1109.28 కోట్లు, పెట్రోల్‌పై 293.52 కోట్లు డ్యూటీ రాదు. దీంతో ఈ డ్యూటీలో రాష్ట్రానికి వచ్చే వాటా రాకుండా పోతుంది. కేంద్ర పన్నుల్లో వాటా ప్రకారం మన రాష్ట్రానికి ఈ మొత్తం రూ.1402.80 కోట్లలో రావాల్సిన 2.4 శాతం వాటా రాకుండా పోతోంది. ఇది రూ. 33.64 కోట్లు ఉంటుందని అంచనా. అదే విధంగా కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీపై రాష్ట్రం అదనంగా 14.5 శాతం పన్ను వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు రూ.1402 కోట్ల మేర డ్యూటీ తగ్గిపోవడంతో ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు గండిపడనుంది. ఈ మొత్తం రూ.203.40 కోట్లు ఉంటుందని వాణిజ్య పన్నుల అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే అటు ఎక్సైజ్ డ్యూటీ వచ్చే వాటా, ఇటు ఎక్సైజ్ డ్యూటీపై విధించే రాష్ట్ర పన్ను కలిపితే మొత్తం రూ. 237.04 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా నష్టపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
ఆ క్లబ్లో కొత్తగా కోటి మంది
సాక్షి, న్యూఢిల్లీ : ట్యాక్స్ రిటన్స్ దాఖలు చేసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ముందుకొస్తున్నారు. 2017-18లో దాదాపు కోటి మంది కొత్తగా ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేశారు. ఫలితంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మెరుగైన వృద్ధి నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది 5.4 కోట్ల రిటన్స దాఖలవగా, 2017-18లో 6.8 కోట్ల ఆదాయ పన్ను రిటన్స్ దాఖలయ్యాయని పన్ను విభాగం అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా పన్ను పరిధిని విస్తరించేందుకు, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల ఫలితంగా ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నూతనంగా అమలు చేస్తున్న జీఎస్టీతో పరోక్ష పన్ను వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడంతో 2017-18 కేంద్ర బడ్జెట్ అంచనాలను రెవెన్యూ శాఖ అధిగమించింది. 2016-17లో వసూళ్ల కంటే 17.1 శాతం అధికంగా ప్రత్యక్ష పన్నులు రూ 9.9 కోట్ల మేర వసూలయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ 10 లక్షల కోట్ల మైలురాయిని దాటతాయని భావిస్తున్నామని ఫైనాన్స్ సెక్రటరీ హస్ముక్ అథియా ధీమా వ్యక్తం చేశారు. -
గ్రేటర్‌కు రూ.112 కోట్లు!
మూడు రోజుల్లో భారీగా పన్ను ఆదాయం రూ.210 కోట్ల విద్యుత్ చార్జీల వసూలు జీహెచ్ఎంసీకి రూ.112 కోట్ల ఆదాయం.. పాత నోట్లతో చెల్లింపులకు నేడు ఆఖరు సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నులు, చార్జీలు, జరిమానాల చెల్లింపులకు కల్పించిన అవకాశానికి తొలి రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించగా.. ఆదివారం చెల్లింపులు తగ్గాయి. సోమవారం కూడా పాత నోట్లను స్వీకరించనున్నారు. ‘గ్రేటర్’కు రూ.112 కోట్ల ఆదాయం.. గత మూడు రోజుల్లో జీహెచ్ఎంసీకి ఆస్తి పన్నులు, లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుల రూపంలో రూ.112 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ.26 కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజులొచ్చాయి. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు పాత నోట్లతో పన్నులు, చార్జీలను చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా మూడు రోజుల్లో రూ.25 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేశారుు. తగ్గిన విద్యుత్ చార్జీల చెల్లింపులు.. గడిచిన మూడు రోజుల్లో రూ.210 కోట్ల విద్యుత్ చార్జీలు వసూలయ్యారుు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లభ్యత లేక ఆదివారం చాలామంది చార్జీలు చెల్లించలేదని ఓ అధికారి తెలిపారు. పంచాయతీల్లో రూ.16 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రూ.16 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలైంది. పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు కేంద్రం కల్పించిన అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకుంటున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ మూడు రోజులుగా ఆస్తి పన్ను బకారుులను చెల్లించేందుకు బారులు తీరుతున్నారు. శుక్రవారం రూ.8.16 కోట్లు, శనివారం రూ.4.49 కోట్లు, ఆదివారం రూ.3.76 కోట్ల మేర వసూలయ్యాయి. పాత నోట్లతో చలాన్లు కట్టొచ్చు పాత పెద్ద నోట్లను వినియోగించి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేం దర్‌రెడ్డి వెల్లడించారు. 48 గంటల పాటు ఈ అవకాశం ఉం టుందని, సోమవారం సాయంత్రంలో గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. వాహనచోదకులు తమ పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆం ధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌లలో చెల్లించొచ్చని తెలిపారు. -
8-10% వృద్ధి సాధ్యమే..
పన్ను ఆదాయాలు పెరుగుతున్నాయ్.. - ఈసారి వరుణుడు కరుణిస్తున్నాడు... - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు జోరందుకుంటోందని, ఈ ఏడాది పన్నుల ఆదాయాలు కూడా దండిగానే వస్తాయని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం... ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావంతో మళ్లీ 8-10 శాతం వృద్ధిరేటు సుసాధ్యం కానుందని కూడా ఆయన చెప్పారు. ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థ, ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడుల జోరు, స్మార్ట్సీటీలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం వంటి చర్యలన్నీ వృద్ధిని పరుగులు తీయించేందుకు దోహదం చేస్తాయని జైట్లీ తెలిపారు. ఆదివారమిక్కడ జరిగిన నాబార్డు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 37.5 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు గతేడాదికంటే ఈసారి పన్ను వసూళ్లలో మంచి పురోగతి కనబడుతుండటం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అంత్యంత సానుకూల సంకేతంగా జైట్లీ పేర్కొన్నారు. ఈఏడాది తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) పరోక్ష పన్నుల ఆదాయం 37.5 శాతం ఎగబాకి రూ.1.54 లక్షల కోట్లుగా నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.1.12 కోట్లుగా ఉన్నట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ.. గతేడాది మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదుకావడం చెప్పుకోదగిన విషయమేనని.. ఈ సంవత్సరం(2015-16)లో 8 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. అయితే, దేశీయంగా కొన్ని సవాళ్లు పొంచిఉన్నాయని.. వీటిపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోందన్న జైట్లీ.. ఈ ఏడాది వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 3.3 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక గ్రీస్ సంక్షోభంపై మాట్లాడుతూ.. అన్ని దేశాలూ దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. తమ పరిమితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొనే వ్యయాలు చేయాలన్నది గ్రీస్ ఇచ్చిన అతిపెద్ద సందేశమని చెప్పారు. రైతులకు కొత్త వ్యవసాయ బీమా పథకం! ఈ ఏడాది వరుణుడు కరుణిస్తున్నాడని.. వర్షాలు ఆశించిన స్థాయిలోనే పడుతుండటం అటు రైతులకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పప్పులు, ఇతర ఆహారోత్పుత్తుల ధరలు దిగొచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతుల కోసం ఒక కొత్త వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని చెప్పారు. రైతులు ఒక్క వర్షాలను మాత్రమే నమ్ముకోకుండా చూడటమే ఈ కొత్త పథకం ప్రధానోద్దేశమని జైట్లీ వ్యాఖ్యానించారు. రుతుపవన వర్షాలు కాస్త ఆలస్యమైనప్పటికీ.. వర్షపాతం జూన్‌లో సాధారణం కంటే 25 శాతం అధికంగా నమోదైందని జైట్లీ పేర్కొన్నారు. కరువు భయాలు ఇక తొలగినట్టేనని.. మిగిలిన కాలానికి కూడా వర్షాలు ఆశాజనకంగానే ఉండొచ్చన్నారు. కరువు ఆందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ఇటీవలే ప్రకటించిన రూ.50,000 కోట్ల జాతీయ సాగునీటి పథకం ఇందులో ప్రధానమైనదని కూడా జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం కోసం మరిన్ని చర్యలకు సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారు.