సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టొద్దని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. భూముల అమ్మకాలతో పాటు నోటరీల క్రమబద్ధీకరణ, పన్నుల ఆదాయం పెంపు తదితర మార్గాల ద్వారా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది.
ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సమావేశమైంది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ శాఖల రాబడులు, బకాయిలకు సంబంధించిన వివరాలను మంత్రులకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణకు సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది.
పన్ను ఆదాయం మరింత పెంచండి
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాల ప్రక్రియను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మూడు ప్రధాన పారిశ్రామిక వాడల అమ్మ కాలతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న విలు వైన ప్రభుత్వ భూములను అటు ప్రజా ప్రయోజనార్థం వినియోగించుకోవడంతో పాటు ఖజానా కు ఊతమిచ్చే విధంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా దష్టి పెట్టి పనిచేయాలని మంత్రివర్గం సూచించింది. అదేవిధంగా నోటరీల ద్వారా క్రయ విక్రయ లావాదేవీలు జరిగిన స్థలాలు, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేసినందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
పన్ను వసూళ్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగవేత జరగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని స్పష్టం చేసింది. పన్ను ఆదాయం పెంచడం ద్వారా రెవెన్యూ శాఖలు ప్రభుత్వ మనుగడ సజావుగా సాగేట్టు చూడాలని ఉపసంఘం ఆదేశించింది. పన్నుల ఆదాయం ఇప్పటికే ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మరింత పెరిగేలా కషి చేయాలని కోరింది.
వారం రోజుల్లో 58, 59 జీవోల సంబంధిత పట్టాలు
మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వాటి ప్రకారం.. జీవో 58, 59లకు (ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేని నిర్మాణాల క్రమబద్ధీకరణ సంబంధిత జీవోలు) సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
పేదలకు ఇళ్ల స్థలాలపై సీసీఎల్‌కు ఆదేశాలు
పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియపై కూడా ఉపసంఘం చర్చించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏయే జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్‌ఏను ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని, జిల్లాల కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఆ దిశగా అధికారులు కషి చేసి అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ప్రయోజనాన్ని కలిగించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment