Ministerial Sub-Committee
-
సంక్రాంతికే భరోసా!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది. సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది. సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం! రైతు భరోసా కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. -
ఖజానా నింపండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టొద్దని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. భూముల అమ్మకాలతో పాటు నోటరీల క్రమబద్ధీకరణ, పన్నుల ఆదాయం పెంపు తదితర మార్గాల ద్వారా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ శాఖల రాబడులు, బకాయిలకు సంబంధించిన వివరాలను మంత్రులకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణకు సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. పన్ను ఆదాయం మరింత పెంచండి రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాల ప్రక్రియను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మూడు ప్రధాన పారిశ్రామిక వాడల అమ్మ కాలతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న విలు వైన ప్రభుత్వ భూములను అటు ప్రజా ప్రయోజనార్థం వినియోగించుకోవడంతో పాటు ఖజానా కు ఊతమిచ్చే విధంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా దష్టి పెట్టి పనిచేయాలని మంత్రివర్గం సూచించింది. అదేవిధంగా నోటరీల ద్వారా క్రయ విక్రయ లావాదేవీలు జరిగిన స్థలాలు, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేసినందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పన్ను వసూళ్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగవేత జరగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని స్పష్టం చేసింది. పన్ను ఆదాయం పెంచడం ద్వారా రెవెన్యూ శాఖలు ప్రభుత్వ మనుగడ సజావుగా సాగేట్టు చూడాలని ఉపసంఘం ఆదేశించింది. పన్నుల ఆదాయం ఇప్పటికే ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మరింత పెరిగేలా కషి చేయాలని కోరింది. వారం రోజుల్లో 58, 59 జీవోల సంబంధిత పట్టాలు మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వాటి ప్రకారం.. జీవో 58, 59లకు (ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేని నిర్మాణాల క్రమబద్ధీకరణ సంబంధిత జీవోలు) సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పేదలకు ఇళ్ల స్థలాలపై సీసీఎల్‌కు ఆదేశాలు పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియపై కూడా ఉపసంఘం చర్చించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏయే జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని, జిల్లాల కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఆ దిశగా అధికారులు కషి చేసి అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ప్రయోజనాన్ని కలిగించాలని సూచించింది. -
పంట వేయకున్నా ‘పెట్టుబడి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుయోగ్య భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం పథకాన్ని వర్తింపజేయాలని.. పంట వేసినా, వేయకున్నా కూడా సాయం అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఎక్కువ మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది. కొందరు రైతులకు సాయం అందించి, పంటలు వేయలేదని మరికొందరికి సాయం అందించకపోతే క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతాయని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సాగు యోగ్యమైన భూమి ఎంత అనేది నిర్ధారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వ్యవసాయశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయశాఖ నిర్ధారిస్తే చాలు.. రైతులకు పెట్టుబడి సాయం పథకం విధి విధానాలపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొద్దిరోజులుగా పలుమార్లు సమావేశాలు జరిపి కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమర్పించింది. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు ఇటీవలి భూప్రక్షాళనలో లెక్కతేలింది. ఈ భూముల్లో దాదాపు మూడు శాతం సాగు యోగ్యం కాని గుట్టలు, రాళ్లతో నిండి ఉన్నాయని అంచనా వేసింది. వాటిని మినహాయించి సాగు యోగ్యంగా ఉన్న భూములన్నింటికీ ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. అయితే సాగు యోగ్యమైన భూముల్లో.. పంట వేసిన రైతులకే సాయం అందించాలా, పంట వేయని భూములకు సైతం ఇవ్వాలా అన్నదానిపై ఉప సంఘం తీవ్రంగా కసరత్తు చేసింది. ఎక్కువ మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంట వేసినా, వేయకున్నా సాగుభూమి అని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే సాయం అందించాల్సిందేనని సూచించింది. పలు కారణాలతో పంటలు వేయక చాలా మంది రైతులు సాగు యోగ్యమైన భూములు ఉన్నా కూడా.. వర్షాలు సరిగా కురవకపోవడంతో పలు పలు ఇతర కారణాల వల్ల పంటలు వేయకుండా ఉంటున్నారు. రైతులు గత రెండేళ్లలో ఇలా దాదాపు 30– 35 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలా పంటలు వేయని భూములకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం అందించాలని ఉప సంఘం ప్రతిపాదించింది. కొందరు రైతులకు సాయం అందించి, పంటలు వేయలేదని మరికొందరికి సాయం అందించకపోతే క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతాయని కూడా యోచించింది. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం రాగానే.. మార్గదర్శకాలు ఖరారవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. స్పెషల్ డ్రైవ్‌తో గుర్తింపు పెట్టుబడి సాయం కోసం సాగు యోగ్యమైన భూమిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. పథకం విధివిధానాలు ఖరారు కాగానే.. అన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సాయానికి ‘నగదు’కష్టం! పెట్టుబడి సాయం తొలివిడతగా మే నెలలోనే ఎకరానికి రూ. 4 వేల చొప్పున అందజేయనున్నారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉండేలా చర్య లు చేపట్టాలని ప్రభుత్వం ఆర్థిక శాఖను అప్రమత్తం చేసింది. అంత మొత్తాన్ని బ్యాం కుల్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల ‘నగదు’కొరత ఉత్పన్నమయ్యే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ‘నోట్ల రద్దు’పరిణామాలతో ఇప్పటికీ నగదు కొరత సమస్య వెంటాడుతోంది. బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదు తిరిగి బ్యాంకులకు చేరుకోవటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం సొమ్మును తీసుకునేందుకు వీలుగా బ్యాంకుల్లో నగదును అందుబాటులో ఉంచాలని కేంద్రానికి, ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నగదు ఉంచాలని కోరింది. -
భూ సమీకరణకు 6 రెవెన్యూ టీమ్‌లు
► మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ► రాజధాని కోసం వారంలోగా నోటిఫికేషన్ జారీ ► రాజధాని ప్రాంతంలో 30 గ్రామాలు.. అన్ని భూములూ సమీకరిస్తాం ► తొలుత భూములిచ్చేందుకు సిద్ధమైన వారిని గుర్తించి సమీకరిస్తాం ► ఉపసంఘం భేటీ అనంతరం విలేకరులకు వెల్లడించిన యనమల ► అసెంబ్లీ జరిగితే సభలో భూసమీకరణ బిల్లు.. లేదంటే ఆర్డినెన్స్ ► ఉపసంఘం నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు నారాయణ, రావెల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూముల సమీకరణకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమీకరణలో ఎన్ని గ్రామాలు ఉండబోతున్నాయో.. ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుందనే అంశాలకు సంబంధించి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూ సమీకరణకు విధివిధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)ఏర్పాటుకు మార్గదర్శకాలను రెండు రోజుల్లో రూపొందించనున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత.. యనమల తనను కలిసిన విలేకరులకు సమావేశం వివరాలను తెలిపారు. భేటీల తీసుకున్న నిర్ణయాల గురించి కమిటీ సభ్యులైన మంత్రులు పి.నారాయణ, రావెల కిషోర్‌బాబులు మీడియాకు వివరించారు. రాజధానికి భూములు ఇస్తామని ముందుకు వచ్చిన రైతులను గుర్తించి వారి నుంచి భూమిని స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యనమల చెప్పారు. ఈ రెవెన్యూ బృందాలను త్వరగా ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. సీఆర్డీఏ పరధిలో 30 గ్రామాలు ఉంటాయని, వీటి పరిధిలో గల మొత్తం భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తామని చెప్పారు. అయితే ఆయా గ్రామాలను ఎక్కడికీ తరలించబోమని, గ్రామాల ఇళ్లు, చెరువులు అక్కడే ఉంటాయని.. కానీ వాటిని ఆధునీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే బాండ్లకు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లులోని సెక్షన్ 39 కింద చట్టబద్ధత కల్పించినట్లు ఆయన తెలిపారు. సీఆర్డీఏ బిల్లుకు మంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు వెంటనే లేనందున ఆర్డినెన్స్ జారీ చేయడంలో తప్పులేదని యనమల పేర్కొన్నారు. ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు... అసెంబ్లీ సమావేశాలు త్వరితగతిన జరిగితే.. భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముసాయిదా బిల్లును శాసనసభలో పెడతామని, లేకుంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకువస్తామని మంత్రులు నారాయణ, రావెల మీడియాతో పేర్కొన్నారు. భూ సమీకరణకు ప్రభుత్వపరంగా ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ లాయర్ల నియామకం, రెవెన్యూ శాఖలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, సర్వేయర్లు అవసరమైనందున ఇందుకు గాను ఆయా పోస్టుల మంజూరుకు ఆర్ధికశాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. సత్వరమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్... రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు, వారికున్న నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు చెప్పారు. ఈ ప్రాంతాల్లోని భూముల రికార్డుల్ని అప్డేట్ చేస్తున్నామని, ఈ-పాస్ బుక్‌ల జారీకి ఇబ్బందులున్న దృష్ట్యా మాన్యువల్‌గా పాస్‌పుస్తకాల జారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమవుతుంది, నిల్వలు ఎంత ఉన్నాయి తదితర అంశాలపై కెలెక్టరు పర్యవేక్షణలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తారన్నారు. మూడు కేటగిరీలుగా భూములు... రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల్ని.. పాత జాతీయ రహదారి పక్కన, మూడు పంటలు పండే భూములు, ఇతర భూములు అనే మూడు కేటగిరీలుగా విభజించామని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్, జపాన్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. గ్రామాలను తాకకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించామని, ఒకవేళ గ్రామాలకు తాకితే నయా రాయపూర్ విధానం అమలు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం మూడు రింగ్‌ల పరిధిల్లో చేపడుతున్నామని, 75 కి.మీ., 125 కి.మీ., 225 కి.మీ. పరిధిలో రాజధాని ఉండబోతుందన్నారు. 75 కి.మీ. పరిధిలో పూర్తిగా రాజధానికి సంబంధించిన నిర్మాణాలు, 125 కి.మీ. పరిధిలో కాలుష్య రహిత పరిశ్రమలు, 225 కి.మీ. పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు ఉంటాయని వివరించారు. రాజధాని నిర్మాణం తమ ప్రాంతంలో జరుగుతున్నందుకు ఆ ప్రాంత వాసిగా తనకు చెప్పలేని ఆనందం కలుగుతోందని.. తమ ప్రాంత ప్రజలు సీఎం చంద్రబాబు ఫోటో పెట్టుకోవాలని మంత్రి రావెల వ్యాఖ్యానించారు. శీతాకాల అసెంబ్లీ హైదరాబాద్‌లోనే: యనమల శాసనసభ శీతాకాల సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని, విజయవాడలో నిర్వహించడం కష్టమవుతుందని యనమల పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించాలంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేర్వేరుగా రెండు సమావేశ మందిరాలు కావాలని, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి వెంట ఉండే సెక్యురిటీకి, అధికార యంత్రాంగానికి వసతి కల్పించాలంటే కష్టం అవుతుందని ఆయన చెప్పారు. ‘రాజధాని-రైతు’ అంశంపై నేడు చర్చ వేదిక: గుంటూరులోని వైన్ డీలర్స్ కల్యాణమండపం సమయం: మధ్యాహ్నం 3 గంటలకు సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం