భూ సమీకరణకు 6 రెవెన్యూ టీమ్‌లు | 6 Revenue Teams to Land mobilization | Sakshi
Sakshi News home page

భూ సమీకరణకు 6 రెవెన్యూ టీమ్‌లు

Published Thu, Nov 20 2014 2:05 AM | Last Updated on Tue, Aug 14 2018 3:30 PM

భూ సమీకరణకు 6 రెవెన్యూ టీమ్‌లు - Sakshi

భూ సమీకరణకు 6 రెవెన్యూ టీమ్‌లు

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
రాజధాని కోసం వారంలోగా నోటిఫికేషన్ జారీ
రాజధాని ప్రాంతంలో 30 గ్రామాలు.. అన్ని భూములూ సమీకరిస్తాం
తొలుత భూములిచ్చేందుకు సిద్ధమైన వారిని గుర్తించి సమీకరిస్తాం
ఉపసంఘం భేటీ అనంతరం విలేకరులకు వెల్లడించిన యనమల
అసెంబ్లీ జరిగితే సభలో భూసమీకరణ బిల్లు.. లేదంటే ఆర్డినెన్స్
ఉపసంఘం నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు నారాయణ, రావెల

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూముల సమీకరణకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమీకరణలో ఎన్ని గ్రామాలు ఉండబోతున్నాయో.. ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుందనే అంశాలకు సంబంధించి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

భూ సమీకరణకు విధివిధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)ఏర్పాటుకు మార్గదర్శకాలను రెండు రోజుల్లో రూపొందించనున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత.. యనమల తనను కలిసిన విలేకరులకు సమావేశం వివరాలను తెలిపారు.

భేటీల తీసుకున్న నిర్ణయాల గురించి కమిటీ సభ్యులైన మంత్రులు పి.నారాయణ, రావెల కిషోర్‌బాబులు మీడియాకు వివరించారు. రాజధానికి భూములు ఇస్తామని ముందుకు వచ్చిన రైతులను గుర్తించి వారి నుంచి భూమిని స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యనమల చెప్పారు. ఈ రెవెన్యూ బృందాలను త్వరగా ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.

సీఆర్‌డీఏ పరధిలో 30 గ్రామాలు ఉంటాయని, వీటి పరిధిలో గల మొత్తం భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తామని చెప్పారు. అయితే ఆయా గ్రామాలను ఎక్కడికీ తరలించబోమని, గ్రామాల ఇళ్లు, చెరువులు అక్కడే ఉంటాయని.. కానీ వాటిని ఆధునీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే బాండ్లకు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లులోని సెక్షన్ 39 కింద చట్టబద్ధత కల్పించినట్లు ఆయన తెలిపారు. సీఆర్‌డీఏ బిల్లుకు మంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు వెంటనే లేనందున ఆర్డినెన్స్ జారీ చేయడంలో తప్పులేదని యనమల పేర్కొన్నారు.
 
ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు...
అసెంబ్లీ సమావేశాలు త్వరితగతిన జరిగితే.. భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముసాయిదా బిల్లును శాసనసభలో పెడతామని, లేకుంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకువస్తామని మంత్రులు నారాయణ, రావెల మీడియాతో పేర్కొన్నారు. భూ సమీకరణకు ప్రభుత్వపరంగా ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ లాయర్ల నియామకం, రెవెన్యూ శాఖలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, సర్వేయర్లు అవసరమైనందున ఇందుకు గాను ఆయా పోస్టుల మంజూరుకు ఆర్ధికశాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.
 
సత్వరమే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్...
రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు, వారికున్న నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు చెప్పారు. ఈ ప్రాంతాల్లోని భూముల రికార్డుల్ని అప్‌డేట్ చేస్తున్నామని, ఈ-పాస్ బుక్‌ల జారీకి ఇబ్బందులున్న దృష్ట్యా మాన్యువల్‌గా పాస్‌పుస్తకాల జారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమవుతుంది, నిల్వలు ఎంత ఉన్నాయి తదితర అంశాలపై కెలెక్టరు పర్యవేక్షణలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తారన్నారు.
 
మూడు కేటగిరీలుగా భూములు...

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల్ని.. పాత జాతీయ రహదారి పక్కన, మూడు పంటలు పండే భూములు, ఇతర భూములు అనే మూడు కేటగిరీలుగా విభజించామని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్, జపాన్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. గ్రామాలను తాకకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించామని, ఒకవేళ గ్రామాలకు తాకితే నయా రాయపూర్ విధానం అమలు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం మూడు రింగ్‌ల పరిధిల్లో చేపడుతున్నామని, 75 కి.మీ., 125 కి.మీ., 225 కి.మీ. పరిధిలో రాజధాని ఉండబోతుందన్నారు.

75 కి.మీ. పరిధిలో పూర్తిగా రాజధానికి సంబంధించిన నిర్మాణాలు, 125 కి.మీ. పరిధిలో కాలుష్య రహిత పరిశ్రమలు, 225 కి.మీ. పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు ఉంటాయని వివరించారు. రాజధాని నిర్మాణం తమ ప్రాంతంలో జరుగుతున్నందుకు ఆ ప్రాంత వాసిగా తనకు చెప్పలేని ఆనందం కలుగుతోందని.. తమ ప్రాంత ప్రజలు సీఎం చంద్రబాబు ఫోటో పెట్టుకోవాలని మంత్రి రావెల వ్యాఖ్యానించారు.
 
శీతాకాల అసెంబ్లీ హైదరాబాద్‌లోనే: యనమల
శాసనసభ శీతాకాల సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని, విజయవాడలో నిర్వహించడం కష్టమవుతుందని యనమల పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించాలంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేర్వేరుగా రెండు సమావేశ మందిరాలు కావాలని, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి వెంట ఉండే సెక్యురిటీకి, అధికార యంత్రాంగానికి వసతి కల్పించాలంటే కష్టం అవుతుందని ఆయన చెప్పారు.
 
‘రాజధాని-రైతు’ అంశంపై నేడు చర్చ
వేదిక: గుంటూరులోని వైన్ డీలర్స్ కల్యాణమండపం
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement