సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుయోగ్య భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం పథకాన్ని వర్తింపజేయాలని.. పంట వేసినా, వేయకున్నా కూడా సాయం అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఎక్కువ మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది. కొందరు రైతులకు సాయం అందించి, పంటలు వేయలేదని మరికొందరికి సాయం అందించకపోతే క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతాయని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సాగు యోగ్యమైన భూమి ఎంత అనేది నిర్ధారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వ్యవసాయశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.
వ్యవసాయశాఖ నిర్ధారిస్తే చాలు..
రైతులకు పెట్టుబడి సాయం పథకం విధి విధానాలపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొద్దిరోజులుగా పలుమార్లు సమావేశాలు జరిపి కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమర్పించింది. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు ఇటీవలి భూప్రక్షాళనలో లెక్కతేలింది. ఈ భూముల్లో దాదాపు మూడు శాతం సాగు యోగ్యం కాని గుట్టలు, రాళ్లతో నిండి ఉన్నాయని అంచనా వేసింది. వాటిని మినహాయించి సాగు యోగ్యంగా ఉన్న భూములన్నింటికీ ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. అయితే సాగు యోగ్యమైన భూముల్లో.. పంట వేసిన రైతులకే సాయం అందించాలా, పంట వేయని భూములకు సైతం ఇవ్వాలా అన్నదానిపై ఉప సంఘం తీవ్రంగా కసరత్తు చేసింది. ఎక్కువ మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంట వేసినా, వేయకున్నా సాగుభూమి అని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే సాయం అందించాల్సిందేనని సూచించింది.
పలు కారణాలతో పంటలు వేయక
చాలా మంది రైతులు సాగు యోగ్యమైన భూములు ఉన్నా కూడా.. వర్షాలు సరిగా కురవకపోవడంతో పలు పలు ఇతర కారణాల వల్ల పంటలు వేయకుండా ఉంటున్నారు. రైతులు గత రెండేళ్లలో ఇలా దాదాపు 30– 35 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలా పంటలు వేయని భూములకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం అందించాలని ఉప సంఘం ప్రతిపాదించింది. కొందరు రైతులకు సాయం అందించి, పంటలు వేయలేదని మరికొందరికి సాయం అందించకపోతే క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతాయని కూడా యోచించింది. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం రాగానే.. మార్గదర్శకాలు ఖరారవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది.
స్పెషల్ డ్రైవ్‌తో గుర్తింపు
పెట్టుబడి సాయం కోసం సాగు యోగ్యమైన భూమిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. పథకం విధివిధానాలు ఖరారు కాగానే.. అన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
సాయానికి ‘నగదు’కష్టం!
పెట్టుబడి సాయం తొలివిడతగా మే నెలలోనే ఎకరానికి రూ. 4 వేల చొప్పున అందజేయనున్నారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉండేలా చర్య లు చేపట్టాలని ప్రభుత్వం ఆర్థిక శాఖను అప్రమత్తం చేసింది. అంత మొత్తాన్ని బ్యాం కుల్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల ‘నగదు’కొరత ఉత్పన్నమయ్యే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ‘నోట్ల రద్దు’పరిణామాలతో ఇప్పటికీ నగదు కొరత సమస్య వెంటాడుతోంది. బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదు తిరిగి బ్యాంకులకు చేరుకోవటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం సొమ్మును తీసుకునేందుకు వీలుగా బ్యాంకుల్లో నగదును అందుబాటులో ఉంచాలని కేంద్రానికి, ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నగదు ఉంచాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment