
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ మాజీ ప్రధాని మన్మోహన్ కంటే ప్రస్తుత ప్రధాని మోదీ హయాంలోనే బాగుందని సోషల్ మీడియా పోల్‌లో అధిక శాతం అభిప్రాయపడ్డారు. మూడీస్ సంస్థ శుక్రవారం భారతదేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచిన నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్వీటర్‌లో ఎకనామిక్స్ టైమ్స్ ఈ పోల్ నిర్వహించింది. ఫేస్‌బుక్ పోల్‌లో 69 శాతం మన్మోహన్ కంటే మోదీయే ఉత్తమమని చెప్పగా, 31 శాతం మంది మన్మోహన్‌కు అనుకూలంగా ఓటేశారు. మొత్తం 3 లక్షల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ట్వీటర్ పోల్‌లో 74 శాతం మోదీకి అనుకూలంగా, 20 శాతం మన్మోహన్‌కు అనుకూలంగా నిలిచారు. ట్వీటర్ పోల్‌లో 3500 మంది పాల్గొన్నారు.
గడ్డుకాలంలోనే ఆర్థిక వ్యవస్థ: మన్మోహన్
కొచ్చి: అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ మూడీస్ భారత సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలం నుంచి ఇంకా బయటపడలేదని మన్మోహన్ అన్నారు. కొచ్చిలోని ఓ కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ రేటింగ్ పెరగడం మంచిదేననీ, అయితే అంతమాత్రానికే ఆర్థిక వ్యవస్థ అంతా సవ్యంగా ఉన్నట్లు పొరబడకూడదని అన్నారు. నోట్టరద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ గమనం మందకొడిగా తయారైందన్నారు. సరైన కసరత్తు లేకుండా జీఎస్టీ తెచ్చారని, 211 రకాల వస్తువులపై అధిక పన్ను వేసి తర్వాత తగ్గించాల్సి వచ్చిందన్నారు.