న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో రెండు త్రైమాసికాల వరుస క్షీణ రేటుతో ‘సాంకేతికంగా’ మాంద్యంలోకి జారిపోయిన భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజారిటీ విశ్లేషణలకు అనుగుణంగానే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి బాట పట్టింది. ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. తాజా సవరిత గణాంకాల ప్రకారం మొదటి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ భారీగా 24.4 శాతం క్షీణత నమోదు చేసింది.
రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌లో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది (నవంబర్ 20నాటి తొలి అంచనాల ప్రకారం ఈ క్షీణ రేట్లు వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి). రెండు త్రైమాసికాలు వరుస క్షీణతను మాంద్యంగా పరిగణిస్తారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి నమోదుకావడంతో భారత్ ఎకానమీ మాంద్యం కోరల నుంచి బయటపడినట్లయ్యింది. ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు ఇందుకు దోహదం చేశాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 3.3 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
► మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది.
► తయారీ రంగం స్వల్పంగా 1.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
► నిర్మాణ రంగం భారీగా 6.2% వృద్ధి చెందింది.
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగంలో భారీగా 7.3 శాతం వృద్ధి నమోదయ్యింది.
► మూలధన పట్టుబడులకు సంబంధించిన ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విభాగంలో 2.6 శాతం వృద్ధి నమోదయ్యింది.
► వాణిజ్య, హోటెల్ పరిశ్రమ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి బయటకు రాలేదు. మూడవ త్రైమాసికంలోనూ క్షీణత 7.7%గా నమోదైంది.
► ప్రభుత్వ వినియోగ వ్యయాలు 1.1%క్షీణిస్తే, ప్రైవేటు వినియోగ వ్యయం 2.4% తగ్గింది.
0.4 శాతం ఎలా అంటే...
మూడవ త్రైమాసికంలో మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.36.22 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లు. వెరసి తాజా సమీక్షా త్రైమాసికంలో వృద్ధి 0.4 శాతంగా ఉన్నట్లు లెక్క.
2020–21లో క్షీణత అంచనా 8 శాతం !
నేషనల్ అకౌంట్స్ రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 8 శాతంగా ఉంటుందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 7.7 శాతంగా ఉండడం గమనార్హం. 2019–20లో 4 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తాజా అంచనాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ 145.69 లక్షల కోట్లు. అయితే 2020–21లో ఈ విలువ 134.09 లక్షల కోట్లకు పడిపోయే వీలుంది. అంటే క్షీణత 8 శాతం ఉంటుందన్నమాట. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎకానమీ 7.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసిన ఆర్‌బీఐ, మూడవ త్రైమాసికంలో 0.1%, నాల్గవ త్రైమాసికంలో 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని సమీక్షలో విశ్లేషించింది.
తలసరి ఆదాయం 9.1% డౌన్!
తాజా గణాంకాల ప్రకారం 2011–12 ధరలను ప్రాతిపదికగా (ద్రవ్యోల్బణం సర్దుబాటుతో) తీసుకుంటే, 2020–21లో తలసరి ఆదాయం రూ.85,929 ఉంటుందని అంచనా. 2019–20లో ఈ విలువ రూ.94,566. అంటే తలసరి ఆదాయంలో 9.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుత ధరల ప్రాతిపదిగా చూస్తే, తలసరి ఆదాయం 4.8 శాతం క్షీణతతో రూ.1,34,186 నుంచి రూ.1,27,768కి పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment